మావోయిస్టుల సంచలన నిర్ణయం
మంగళవారం రాత్రినుండి జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది;
మావోయిస్టుపార్టీ సంచలన నిర్ణయంతీసుకుంది. భేషరతుగా కాల్పుల విరమణకు, ఆయుధాలను వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రప్రభుత్వానికి రాసిన లేఖ అభయ్ పేరుతో వైరల్ అవుతోంది. మావోయిస్టు(Maoist Party) పార్టీ ప్రతినిధి అభయ్ పేరుతో కేంద్రానికి రాసిన లేఖ ఆలస్యంగా వెలుగుచూసింది. ఈలేఖ మంగళవారం రాత్రినుండి జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆపరేషన్ కగార్(Operation Kagar) దెబ్బకు మావోయిస్టులు(Maoists) తీవ్రమైన ఒత్తిడిలో పడిపోయిన విషయం తెలుస్తోంది. గడచిన ఐదునెలల్లో కీలకమైన నేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. మావోయిస్టులకు దశాబ్దాలుగా షెల్టర్ జోన్ గా ఉన్న దండకారణ్యంలోకి భద్రతాదళాలు చొచ్చుకుపోతున్నాయి.
దండకారణ్యంలోకి చొచ్చుకుపోవటమే కాకుండా భద్రతాదళాలు తమ బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేనట్లుగా భద్రతాదళాలు అత్యంత అధునాతన ఆయుధాలు, ద్రోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్ధను ఏర్పాటుచేసుకున్నాయి. దండకారణ్యం అడవులను నాలుగువైపులనుండి కమ్ముకుంటు అడవులను జల్లెడపడుతున్నాయి. ఈనేపధ్యంలో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఎంతోమంది కీలకనేతలు ఎన్ కౌంటర్లో చనిపోయారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటి కార్యదర్శిగా నియమితుడైన మాడ్వి హిడ్మా టార్గెట్ గా భద్రతాదళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
అలాగే కొన్నివందలమంది మావోయిస్టులు పోలీసులఎదుట లొంగిపోతున్నారు. మావోయిస్టులకు భద్రతాదళాలు ఒకటే ఛాయిస్ ఇచ్చాయి. అదేమిటంటే లొంగిపోవటమో లేకపోతే ఎన్ కౌంటర్లలో చనిపోవటమో. కొందరు పోలీసుల ముందు లొంగిపోతుంటే మరికొందరు ఎన్ కౌంటర్లలో చనిపోతున్నారు. మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026, మార్చి 30వ తేదీని టార్గెట్ పెట్టుకన్న విషయాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. డెడ్
డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో పోలీసుల ముందు లొంగిపోయే విషయంలో పార్టీలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల ఎన్ కౌంటర్లో చనిపోకముందు నుండే కేంద్రప్రభుత్వంతో శాంతిచర్చలు జరిపే విషయంలో పార్టీలో డిబేట్లు నడుస్తున్నట్లు అభయ్ రాసిన తాజా లేఖతో బయటపడింది. నరేంద్రమోదీ, అమిత్ గతంలో అనేకసార్లు చేసిన విజ్ఞప్తులపై చర్చలు జరిపిన తర్వాత శాంతిచర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఆయుధాలను వదిలేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు అభయ్ తనలేఖలో స్పష్టంచేశారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టు కీలకనేతలతో చర్చలు జరిపి తుదినిర్ణయానికి వచ్చేందుకు కనీసం నెలరోజుల సమయం పడుతుందని అభయ్ లేఖలో చెప్పారు. అప్పటివరకు భద్రతాదళాలు కాల్పుల విరమణ పాటించాలని కోరారు.
తన లేఖపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రేడియో, ప్రభుత్వ వార్తా సంస్ధలు, ఇంటర్నెట్ లాంటి మాధ్యమాల ద్వారా తెలియజేయాలని కూడా అభయ్ సూచించారు. అయితే అభయ్ పేరుతో చెలామణి అవుతున్న లేఖను భద్రతాదళాలు పూర్తిగా నమ్మటంలేదు. లేఖలోని అంశాలను పరిశీలించాలని ఛత్తీస్ ఘడ్ డిప్యుటి సీఎం, హోంమంత్రి విజయ్ శర్మ అన్నారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ కూడా లేఖలోని అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కాల్పుల విరమణపేరుతో తాము బలపడేందుకు మావోయిస్టులు లేఖపేరుతో వేస్తున్న ఎత్తుగడగా భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.