చేతులెత్తేసిన రేవంత్

ఆర్ధిక పరమైన డిమాండ్లు ఏవీ చేయవద్దని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో డైరెక్టుగా చెప్పేశారు.

Update: 2024-10-25 04:37 GMT
Revanth and JAC leaders

‘రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది..వచ్చే మార్చి 31వ తేదీ వరకు ఎలాంటి ఆర్ధికపరమైన ఒత్తిడులు చేయవద్ద’ని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. రేవంత్ డైలాగ్ విన్నతర్వాత అదేదో సినిమాలో దేశం క్లిష్ట పరిస్ధితుల్లో ఉందని నూతన్ ప్రసాద్ చెప్పే డైలాగ్ గుర్తుకొస్తోంది. ఇపుడు రేవంత్ కూడా రాష్ట్రం(Telangana) క్లిష్ట పరిస్ధితుల్లో ఉందని చెప్పి రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై చేతులెత్తేశారు. ఆర్ధిక పరమైన డిమాండ్లు ఏవీ చేయవద్దని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో డైరెక్టుగా చెప్పేశారు. కేసీఆర్(KCR) ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే వేల కోట్లరూపాయలు చెల్లిస్తున్నామని ఆర్ధికమంత్రి, ఉపముఖ్యమంత్రి(Dy Chief Minister) మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఒకసారి చెప్పిన విషయం తెలిసిందే. రేవంత్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిప్ప చేతికిచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు కాని రాష్ట్రం క్లిష్టపరిస్ధితుల్లో ఉందని మాత్రం ఇదివరకు ఎప్పుడూ చెప్పలేదు. ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయపరమైనవే అని రేవంత్ అంగీకరించారు.

డిమాండ్ల పరిష్కారం కోసం తొందరలోనే ఆందోళనలు చేయబోతున్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ(JAC) ప్రభుత్వానికి ఈమధ్యనే అల్టిమేటమ్ ఇచ్చింది. ఈ నేపధ్యంలోనే రేవంత్ గురువారం జేఏసీ ప్రతినిధులతో దాదాపు మూడుగంటలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జేఏసీ నుండి హాజరైన 30 మంది నేతలు ముఖ్యమంత్రి, మంత్రులను ఉద్దేశించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను, వాటి పరిష్కారాలపై మాట్లాడారు. నేతలు చెప్పిన సమస్యలను పూర్తిగా రేవంత్ విన్నారు. చివరగా మాట్లాడుతు ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయమైనవే అని అంగీకరించారు. వాటన్నింటినీ పరిష్కరించేందుకు తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరంలేదని స్పష్టంచేశారు. అయితే రాష్ట్ర ఆర్ధికపరిస్ధితిని కూడా ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాల నేతలు అర్ధం చేసుకోవాలన్నారు. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.

కొంతకాలంగా ఆదాయార్జన శాఖల నుండి ఆదాయం తగ్గిపోయింది కాబట్టి ఆర్ధికపరమైన డిమాండ్లను మార్చి 31 తర్వాత మాత్రమే పరిశీలిస్తానని చెప్పారు. ఆర్ధిక అంశాల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిళ్ళు తేవద్దని విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ఉద్యోగులందరు కష్టపడాలని కూడా కోరారు. ఉద్యోగనేతలు మాట్లాడుతు 5 డీఏలు పెండింగులో ఉందని వాటన్నింటినీ వెంటనే విడుదల చేయాలని, అన్నీ కాకపోయినా కనీసం తక్షణావసరంగా గుర్తించి మూడు డీఏలను అయినా విడుదల చేయాలని పట్టుబట్టారు. రేవంత్ స్పందించి ఈనెల 26వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో(Cabinet Meeting) పరిశీలిస్తామని, ఎన్నోకొన్ని డీఏల విడుదుల విషయాన్ని పరిశీలిస్తామని హామీఇచ్చారు. పెండింగు బిల్లులు, నగదు రహిత ఆరోగ్య కార్డుల జారీ అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై భట్టివిక్రమార్క నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

సమస్యలు వివరించాం

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలంత సమస్యల పరిష్కారం కోసం నేరుగా ముఖ్యమంత్రితోనే చర్చించినట్లు జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్(Maram Jagadeeswar) సమావేశం తర్వాత మీడియాతో చెప్పారు. ముఖ్యమంత్రితో ఇది మొదటి సమావేశమని గుర్తుచేశారు. మంచి వాతావరణంలోనే సమావేశం జరిగిందన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. జేఏసీ కో ఛైర్మన్ చావా రవి (Chava Ravi)మాట్లాడుతు పెండింగులో 5 డీఏలున్నాయని, కనీసం 2 డీఏలను అయినా ఇవ్వాలని గట్టిగా చెప్పారు. ప్రతిదానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితితో ముడిపెట్టడం సరికాదని చావా అసంతృప్తిని వ్యక్తంచేశారు.

Tags:    

Similar News