‘యూరియా కొరతకు కాంగ్రెస్ చేతకాని తనమే కారణం’
కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప సమస్యకు పరిష్కారం వెతకడం లేదన్న హరీష్ రావు.;
తెలంగాణలో యూరియా కొరత రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనమే కారణమంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలన చేతకాని వాళ్లు అధికారంలోకి వస్తే ఇలానే ఉంటుందంటూ చురకలంటించారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నా లాభం లేకుండా పోతోందని, రైతులు కష్టాలను నేతలు పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ యూరియా కొరతకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు సచివాలయం దగ్గర బైఠాయించి ధర్నా చేశారు. అన్నదాతల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎక్కడా లేని సమస్య ఇక్కడే ఎందుకు?
యూరియా కొరత సమస్య దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని, అది కేవలం తెలంగాణలోనే ఎందుకు వస్తోందని హరీష్ రావు ప్రశ్నించారు. అధికారంలో ఉన్న నేతలమే సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం, విమర్శలు చేసుకోవడమే సరిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు, ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారే తప్ప.. అన్నదాతల అవస్థలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల కష్టాలకు పరిష్కారం చూపే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని, అరెస్ట్‌లకు తాము భయపడేది లేదని అన్నారు.
గతంలో సమస్యే లేదు..
‘‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా అన్నదాతలు యూరియా కోసం ఎదురుచూపులు చూడలేదు. ఆఖరికి కరోనా సమయంలో కూడా ఇటువంటి సమస్యలు తలెత్తకుండా యూరియా పంపినీ చేశాం. తెలంగాణకు కావాల్సిన యూరియా నిల్వలను గత ప్రభుత్వం ముందుగానే సిద్ధం చేసి ఉంచేది. అవసరం వచ్చిన వెంటనే రైతులకు అందించడం షురూ చేసింది. అందువల్లే కేసీఆర్ హయాంలో రైతులు రాజుల్లా బతికారు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి దుర్భరంగా మారింది. యూరియా పంపిణీ చేతకాకపోతే కాంగ్రెస్ అది ఒప్పుకోవాలి. మేము సచివాలయం దగ్గరకు రాజకీయ లబ్ధి కోసం రాలేదు. రైతుల కోసం వచ్చాం. యూరియా కోసం వస్తున్న రైతులపై దాడులు చేస్తున్నారు. వాటిని వెంటనే ఆపి.. రైతుల కష్టాలను తీర్చాలి. లేకుండా రానున్న రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’’ అని హరీష్ రావు హెచ్చరించారు.
రెండు రోజుల్లో రానున్న యూరియా..
అయితే పార్లమెంటు ఆవరణలో తెలంగాణ నేతల నిరసనల అనంతరం రాష్ట్రానికి మరింత యూరియా సరఫరా చేయడానికి కేంద్రం అంగీకరించింది. 50వేల టన్నుల యూరియాను వారం రోజుల్లో అందించనున్నట్లు వెల్లడించింది. ముందుగా 10వేల టన్నుల యూరియాను కర్ణాటక నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. కాగా కేంద్రం చెప్పిన యూరియా.. రాష్ట్రానికి అందడానికి ఇంక రెండు రోజుల సమయమే ఉంది.
పంపిణీకి అంతా సిద్ధం: తుమ్మల
కేంద్రం నుంచి యూరియా అందిన వెంటనే దానిని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయడానికి అంతా సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా గంగవరం, దామ్ర, కరాయికల్ పోర్టుల నుండి మరో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని చెప్పారు. పోర్టుల నుండి ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వెల్ ప్రాంతాలకు యూరియా చేరుకోనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. అక్కడి నుండి డిమాండ్ ను బట్టి జిల్లాలకు పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.సాయంత్రంలోగా పంట నష్టంపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు.