బీసీ రిజర్వేషన్ల కోసం జీఓలు.. క్యాబినెట్ కీలక నిర్ణయం

కోదండరాం, అజహరుద్దీన్‌లకు గ్రీన్ సిగ్నల్.;

Update: 2025-08-30 10:01 GMT

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. అనంతరం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల నుంచి కోదరండరాం, అజహరుద్దీన్‌లకు ఎమ్మెల్సీ పదవులు వంటి కీలక అంశాలపై మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రిజర్వేషన్ల కోటా పరిమితినే ఎత్తివేయాలని కేబినెట్ ఫిక్స్ అయింది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీఓలు తీసుకురావాలని డిసైడ్ అయింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(ళ)ను సరవించాలని నిశ్చయించుకుంది. దాంతో పాటుగానే కుండపోత వర్షాలతో రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులపై కూడా కేబినెట్ దృష్టి సారించింది. వర్షాల వల్ల కలిగిన నష్టంపై అధికారుల నుంచి ఇప్పటి వరకు వచ్చిన నివేదికలు, సమాచారాన్ని పరిశీలించింది. రైతులను ఎలా ఆదుకోవాలి అన్న అంశంపై దృష్టి సారించింది.

రిజర్వేషన్లకు జీఓలు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం తెలంగాన ప్రభుత్వం తీవ్ర పోరాటం చేస్తోంది. అన్ని విధాలా దీనిని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన బీసీ రిజర్వేషన్ బిల్లు.. కేంద్రం ఆమోదం అందక నిలిచిపోయింది. దాంతో ఈ విషయంలో తెలంగాణ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇది కూడా మూడు నెలలు గవర్నర్ దగ్గర ఆగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ దగ్గర నిలిచి ఉంది. దీనిపై కేంద్రం ఇప్పట్లో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న ఆశలు లేవు. ఈ క్రమంలోనే ఆగస్టు మొదటి వారంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్, బీసీ నేతలు భారీ దర్నా చేపట్టారు. ఆ సందర్భంగానే రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందించాలని కూడా అనుకున్నారు. కానీ అందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం కోసం ప్రత్యేక జీఓలు తీసుకురావాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

దగ్గరపడుతున్న స్థానిక ఎన్నికలు..

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం అత్యం కీలకంగా మారింది. ఎలాగైనా అమలు చేయాలని కాంగ్రెస్.. అమలు కాకపోతే అది అస్త్రంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో బీసీ రిజర్వేషన్ల విషయం అన్ని పార్టీలకు అత్యంత కీలక అంశంగా మారింది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు క్యాబనెట్ ఆమోదం..

శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సుప్రీంకోర్టు కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల ఎమ్మెల్సీ నియామకాన్ని రద్దు చేసింది. తాజాగా మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వారి పేర్లనే సిఫార్సు చేయడానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్సీ రేసు నుంచి అమీర్ అలీఖాన్‌ను తప్పించిన కాంగ్రెస్ ఆ స్థానాన్ని అజహరుద్దీన్‌కు కేటాయించింది.

Tags:    

Similar News