ఈ సిటీ జంక్షన్లు ఇక జామ్ అవ్వవు.. !

హైదరాబాద్ పేరు వినగానే హుస్సేన్ సాగర్, చార్మినార్, గోల్కొండ కోట తో పాటు ట్రాఫిక్ జామ్ లు కూడా గుర్తుకు వస్తాయి. వీటికి చెక్ పెట్టి సిగ్నల్ ఫ్రీ వ్యవస్థగా..

Update: 2024-09-29 10:49 GMT

హైదరాబాద్ .. రాష్ట్ర రాజధాని.. దేశంలోని ఐదో అతిపెద్ద మహానగరం... కోటి దాటిన జనాభా.. మధ్య తరగతి ప్రజలు, పేదలతో పాటు సంపన్నులకు ఇష్టమైన నగరం.. ఇవన్నీ బాగానే ఉన్నా, విపరీతమైన ట్రాఫిక్ తో వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు.

ముఖ్యంగా ఐటీ, సినీ రంగాలు, వాణిజ్యం బాగా జరిగే ప్రాంతాలలో ప్రతిరోజు ఇదే సీన్ రీపిట్ అవుతోంది. ఇలాంటి ఒక ఏరియానే కేబీఆర్ పార్క్. అక్కడ ఆరు జంక్షన్ లో సిగ్నల్ పడిన ప్రతిసారి కిలోమీటర్ల కొలది వాహనాలు బారులు తీరుతాయి. ప్రైమ్ ట్రైమ్ లో అయితే బైక్ నుంచి కాలు కింద పెట్టడానికి కూడా స్థలం ఉండదు.

ఇక నుంచి ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. భవిష్యత్ లో వీటన్నింటిని సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మార్చడానికి రూ. 826 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. వీటికి సంబంధించిన పరిపాలన అనుమతులు సైతం మంజూరు చేసింది.

కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్ లు, ప్లై ఓవర్లు నిర్మించ బోతోంది. ఈ ప్రాజెక్ట్ లను హెచ్ సీటీ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించడానికి జీహెచ్ఎంసీ సిద్ధమై, క్షేత్ర స్థాయి పరిశీలనలు చేసి ప్రణాళిలు సిద్దం చేసింది. ఈ పనులు రెండు దశల్లో చేపట్టబోతున్నారు.

ఐటీ విప్లవం తరువాత కేబీఆర్ పార్క్ పరిసరాలు వేగంగా అభివృద్ధి చెందాయి. ఒకప్పుడు హైదరాబాద్ అవుట్ స్కట్స్ గా పేరుపొందిన ఈ ప్రాంతమే ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్నట్లు మారిపోయింది. ఇక్కడ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి, ఫిల్మ్ నగర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వెళ్లే జంక్షన్లు ఉన్నాయి.
దీంతో విపరీతమైన ట్రాఫిక్ దీని చుట్టూ కేంద్రీకృతమైంది. ఈ రద్దీని నియంత్రించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని తాజా ప్రతిపాదనలుకు సిద్ధం చేసింది. అయితే కొత్తగా నిర్మించబోయే నిర్మాణాల్లో ఎక్కడా కేబీఆర్ పార్క్ కు నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ నిర్మించబోయే అండర్ పాస్ లో నీరు నిలవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నారు.
ప్యాకేజీ- 1:
మొదటి ప్యాకేజీలో భాగంగా అత్యంత రద్దీగా ఉండే రోడ్డు నెంబర్ 45 నుంచి యూసుఫ్ గూడ వైపు ఓ అండర్ పాస్ ను నిర్మిస్తారు. తరువాత కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుంచి రోడ్డు నెంబర్ 36 వరకూ నాలుగు లైన్లతో కూడిన ప్లై ఓవర్ నిర్మించాలని ప్రణాళిక. అలాగే యూసుఫ్ గూడ నుంచి వచ్చే వాహానాల కోసం రోడ్డు నెంబర్ 45 వరకూ రెండు లైన్ల ఫై ఓవర్ నిర్మించబోతున్నారు.
జూబ్లిహిల్స్ చెక్ పోస్టు నుంచి బసవతారకం క్యాన్సర్ హస్పిటల్ వరకూ కూడా రెండు లైన్ల అండర్ పాస్, జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లడానికి ప్లై ఓవర్, అండర పాస్ల నిర్మాణం, దీనిని మూడు వరుసల్లో చేపట్టబోతున్నారు. ఈ మొదటి ప్యాకేజ్ కోసం మొత్తం రూ. 421 కోట్లు ఖర్చు అవుతాయని అంచనాలు రూపొందించారు.

ప్యాకేజ్-2 :

రెండో దశలో మొదట ఫిలింనగర్ జంక్షన్ ను అభివృద్ధి చేయబోతున్నారు. మొదటి విడతలో అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 45 కి రెండు లైన్ల అండర్ పాస్, రెండు లైన్ల ప్లై ఓవర్ తరువాత బసవతారకం హస్పిటల్ నుంచి ఫిలింనగర్ వరకూ అండర్ పాస్, ఫిలిం నగర్ నుంచి రోడ్ నెంబర్ 12 వరకూ రెండు లైన్ల ప్లై ఓవర్ నిర్మించబోతున్నారు. చివరగా క్యాన్సర్ జంక్షన్ ను అభివృద్ధి చేయాలని దీనికోసం రూ. 405 కోట్లను ఖర్చు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వర్షం పడితే విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనికి సిగ్నల్ల వద్ద గంటల కొద్ది వాహనాలు నిలిచిపోవడం ఓ కారణం అయితే మురుగు నీరు రోడ్లపై ప్రవహించడం మరో సమస్య. మొదటి దశలో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ పై దృష్టి పెట్టిన ప్రభుత్వం రెండో విడతలో అయిన మురుగు నీటి వ్యవస్థపై దృష్టి పెడితే వాహనాదారులకు నిత్య ట్రాఫిక్ జామ్ ల నరకం తప్పుతుంది.
Tags:    

Similar News