లాల్ దర్వారా మహంకాళీ బోనాలు విశిష్టత ఇదే
హైదరాబాద్ లో చివరి బోనాలు కావడంతో సర్వత్రా ఆసక్తి;
తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బోనాలు ఒకటి. జంట నగరాల్లో బోనాల జాతర ఎంతో ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఈ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే గోల్కొండ జగదాంబిక, సికిద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జూలై 20, 21వ తేదీల్లో ఆది, సోమవారాల్లో లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో బోనాల జాతరను ఘనంగా జరుపుకోనున్నారు.
1907 సంవత్సరంలో లాల్ దర్వాజ బోనాలను మహారాజా కిషన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ బోనాల వేడుకలకు అప్పటి హైదరాబాద్ నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ భూమిని విరాళంగా ఇచ్చారు. అనేక ఆలయాల నిర్మాణాలకు భూమిని దానంగా ఇచ్చిన ఘనత నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీఖాన్ కు దక్కింది. ఆయన హాయంలో మత సామరస్యం వెల్లి విరిసింది. ప్రతీ యేడు మీర్ మహబూబ్ అలీఖాన్ అమ్మవారికి ముక్కు పుడకను బహుమతిగా ఇచ్చేవారు.
అంటు వ్యాధులు ప్రబలకుండా
ఆషాఢ మాసంలో కుండపోత వర్షాలు కురుస్తాయి. ఈ కాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ సమయంలో పురుగు పుట్రా, ఇతర కీటకాల నుంచి ఇబ్బందులు తలెత్తుతాయి. వీటన్నింటి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనంలో వాడిన సున్నం, పసుపు, వేపాకు ఇవన్నీ యాంటి సెప్టిక్, యాంటీ బయోటిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే ఎలాంటి కీటకాలు బోనం లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. అందుకే ఈ బోనాన్ని పవిత్రంగా భావిస్తారు.
ఆషాఢ మాసంలో అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామ దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం బోనం కుండలకు వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. కుండపైన ఓ దీపాన్ని కూడా పెడతారు. వీటిని మహిళలు తలపై పెట్టుకుని.. మేళ తాళాలతో, డప్పు చప్పుళ్ల మధ్య దేవాలయాలకు తీసుకెళ్లి.. బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు.
లాల్ దర్వాజా లో సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాతబస్తీలోని 28 ప్రధాన ఆలయాలతో పాటు మరో 330 దేవాలయాలను అందంగా అలంకరించారు. ముందుగా జూలై 20న ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ నిర్వహిస్తారు. 4 గంటలకు బలిహరణ 5:30 గంటలకు అమ్మవారికి మహాభిషేకం తర్వాత భక్తులకు దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తారు. ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం బోనాల జాతరలో చివరి రోజు ఓ మహిళ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీన్నే రంగం అంటారు. చివర్లో అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబురాలు ముగుస్తాయి.