తమ్ముడికి అరుదైన వ్యాధికి ఈ అక్క అండగా నిలిచింది
రాఖీ పౌర్ణమి రోజు మూల కణాలను దానం చేసిన మహబూబ్ నగర్ వాసి;
అరుదైన వ్యాధితో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తమ్ముడికి అండగా నిలిచింది ఈ అక్క. రాఖీ పండుగ రోజు తమ్ముడికి రాఖీ కట్టి తన మూల కణాలను దానం చేసింది. మూలకణాలు ఇస్తే ప్రమాదమనే అపోహలను కాసేపు పక్కన పెట్టి తమ్ముడి ఆరోగ్యమే ముఖ్యమని ముందుకొచ్చింది. తన మూల కణాలను దానం చేసి అతడి ప్రాణాలకు రక్షణగా నిలిచింది. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. మానవ సంబంధాలు క్షీణిస్తున్న ఈ రోజుల్లో ఈ అక్క మూల కణాలను దానం చేసి అక్కా తమ్ముడి బంధాన్ని మరింత బలోపేతం చేసింది. పలువురికి ఆదర్శంగా నిలిచింది.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలుడు అప్లాస్టిక్ అనీమియా అనే భయంకర వ్యాధితో బాధపడుతున్నాడు. పరిస్థితి రోజురోజుకు విషమించడంతో అతనికి ప్రాణాపాయం ఉందని వైద్యులు తేల్చారు. చికిత్సకు మూలకణాలు అవసరమయ్యాయి. తోబుట్టువులు మాత్రమే మూలకణాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఇంటర్ చదువుతున్న అతడి సోదరి ముందుకొచ్చింది. తమ్ముడికి భరోసా ఇచ్చింది.తన శరీరంలోని మూలకణాలను దానం చేసి, అతడి ప్రాణాలు కాపాడింది. రాఖీ పండుగ సందర్బంగా సికింద్రాబాద్‌లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో తమ్ముడికి రాఖీ కట్టి.. ‘ నీ కోసం నేనున్నా తమ్ముడూ’ అంటూ ధైర్యం చెప్పింది. ఈ సందర్భంగా వైద్యుడు నరేందర్ కుమార్ మాట్లాడుతూ.. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచింది అన్నారు.
అప్లాస్టిక్ అనిమియా వ్యాధి అంటే..
అప్లాస్టిక్ అనీమియా అనేది ఒక తీవ్రమైన రక్త రుగ్మత. ఈ రుగ్మత వల్ల ఎముక మజ్జ తగినంత కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేయదు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు , ప్లేట్‌లెట్స్ వంటి అన్ని రకాల రక్త కణాలు చాలా తక్కువగా ఉంటాయి. దీని వలన అలసట, ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం వంటి సమస్యలు ఎదురౌతాయి.
ఎర్ర ,రక్త కణాలు తక్కువగా ఉండటం వలన, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక, అలసట మరియు బలహీనత వాటిల్లుతుంది.
తెల్ల రక్త కణాలు చాలా తక్కువగా ఉండటం వలన, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం తగ్గుతుంది, దీని వలన తరచుగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది.
ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండటం వలన, చిన్న చిన్న గాయాలకే రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. రక్తస్రావం ఆపడం సాధ్యం కాదు.
ఎముక మజ్జ సరిగ్గా పనిచేయకపోతే, దాన్ని మార్పిడి చేయడానికి అవకాశముంది.
రోగనిరోధక వ్యవస్థ రక్త కణాలపై దాడి చేస్తుంటే, దానిని అణచివేయడానికి మందులు వినియోగిస్తారు.
మూలకణాలు మార్పిడి సురక్షితమే కాని..
మూలకణాలు (Stem cells) అనేవి శరీరంలో వివిధ రకాల కణాలుగా వృద్ది చేసే సామర్థ్యం ఉన్న ప్రత్యేకమైన కణాలు. ఇవి శరీరానికి ఎప్పటికప్పుడు మరమ్మతు వ్యవస్థలాగా పని చేస్తాయి.
మూలకణాలు ప్రధానంగా రెండు రకాలు: పిండ మూలకణాలు (embryonic stem cells) ,వయోజన మూలకణాలు (adult stem cells).
మూలకణాలు శరీరానికి మరమ్మత్తు వ్యవస్థలాగా పనిచేస్తాయి, దెబ్బతిన్న కణాలను భర్తీ చేస్తాయి. కొత్త కణజాలాలను ఉత్పత్తి చేస్తాయి. మూలకణాల పరిశోధన వైద్యరంగంలో అనేక అవకాశాలను కల్పిస్తుంది. ముఖ్యంగా క్షీణత చెందే వ్యాధుల చికిత్సలో దీని అవసరం ఉంటుంది.
మూలకణాలు (స్టెమ్ సెల్స్) దానం చేయడం సాధారణంగా పూర్తిగా సురక్షితమే, కానీ కొన్ని సందర్భాల్లో దుష్ప్రభావాలు ఉండవచ్చు. ఎముక మజ్జ లేదా రక్తంలోని మూలకణాలను దానం చేయడం ద్వారా, అవసరమైన వారికి సహాయం చేయవచ్చు, ముఖ్యంగా రక్త క్యాన్సర్ లేదా ఇతర రక్త రుగ్మతలు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, దానం చేసే ముందు, దాత కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి, దానం చేయడం సురక్షితమేనా అని సంబధిత డాక్టర్లు నిర్దారించాల్సి ఉంటుంది.