Tigers | కవ్వాల్‌కు వచ్చిన పులులు, రంగంలోకి ఎనిమల్ ట్రాకర్స్ బృందాలు
పొరుగు రాష్ట్రాల అభయారణ్యాల నుంచి పులులు కవ్వాల్ అభయారణ్యంలోకి వలస వచ్చాయి.పులుల కదలికలను గుర్తించేందుకు ఎనిమల్ ట్రాకర్స్ బృందాలను రంగంలోకి దించారు.
By : The Federal
Update: 2024-12-26 13:22 GMT
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పులుల సంచారం పెరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని పులుల అభయారణ్యాలైన తాడోబా, తిప్పేశ్వర్, గంగావతి అటవీ ప్రాంతాల నుంచి పులులు కవ్వాల్ బాట పట్టాయి.
- పులుల సంరక్షణ కోసం అటవీశాఖ తాడోబా, తిప్పేశ్వర్, గంగావతి, కవ్వాల్ అటవీ ప్రాంతాలను పులుల అభయారణ్యాలుగా ప్రకటించింది. ఈ నాలుగు అభయారణ్యాల్లోని పులులు మేటింగ్ సీజనులో ఒక అభయారణ్యం నుంచి మరో అభయారణ్యానికి వలస వచ్చి పోతుంటాయి.
రంగంలో ఎనిమల్ ట్రాకర్స్ బృందాలు
పొరుగున ఉన్న మూడు అభయారణ్యాల నుంచి పులులు కవ్వాల్ అభయారణ్యంలోకి వచ్చాయి. పులుల వలస నేపథ్యంలో అటవీశాఖ అధికారులు కవ్వాల్ అభయారణ్యంలోని అటవీ రేంజ్ లలో ఎనిమల్ ట్రాకర్స్ బృందాలను రంగంలోకి దింపాయి. అటవీశాఖ బీట్ లలోని కంపార్టుమెంట్లలో ఎనిమల్ ట్రాకర్స్ బృందాలు తిరుగుతూ కెమెరా ట్రాప్ ల సాయంతో పులుల కదలికలను గమనిస్తున్నాయని అటవీశాఖ రేంజి అధికారి కారం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అటవీ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం
ఎనిమల్ ట్రాకర్స్ అడవిలో సంచరిస్తూ పులుల కదలికలను గమనించి కెమెరా ట్రాప్ ల సాయంతో తీసిన చిత్రాలను వాట్సాప్ లో ఉంచుతాయని, దీని సాయంతో తాము అటవీ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని శ్రీనివాస్ చెప్పారు. పులులు సంచరించే ప్రాంతాలకు అటవీ గ్రామాల ప్రజలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. వీరికి తోడు అటవీ శాఖ బేస్ క్యాంపుల్లో ఉన్న వాచర్స్ సాయంతో పులుల కదలికలను గుర్తిస్తున్నామని ఆయన వివరించారు.
పులి పాదముద్రల గుర్తింపు
పెంచికల్ పేట అటవీ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎస్ 12 అనే నంబరు గల ఆడపులి సంచరిస్తుందని కెమెరా ట్రాప్ ల చిత్రాలతో తేలింది. గొంట్లపేట్ గ్రామం వద్ద వాగు ఒడ్డున బుధవారం పులి వచ్చి పోయిందని అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. లోడ్‌పల్లి, కొండపల్లి, జైహింద్‌పూర్, దరోగపల్లి, అగర్‌గూడ, ఎల్లూరుగొంట్లపేట, ఎర్రగుంట, బొంబాయిగూడ, పోతేపల్లి అటవీ గ్రామాల్లో పులి సంచరిస్తుండటంతో రైతులు పత్తి తీసేందుకు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
పులి దాడి ఘటనలతో భయం...భయం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఈస్‌గావ్‌లో నవంబర్ 29వవతేదీన పత్తి పంట కోసే పనిలో నిమగ్నమై ఉన్న మోర్లే లక్ష్మి (21)ని మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పులి దాడి చేసి చంపేసింది. నవంబర్ 30వతేదీన దుబ్బగూడెంలో మరో రైతు సురేష్‌పై అదే పులి దాడి చేసిందని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
విద్యుత్ కంచెలతో పులికి హాని కలిగించొద్దు
ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని కవ్వాల అభయారణ్యంలో బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో పులులు సంచరించాయని తాజాగా తేలింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పులుల సంచారం పెరిగిన నేపథ్యంలో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసి పులులకు హాని కలిగించవద్దని కవ్వాల అభయారణ్యం అధికారులు అటవీ గ్రామాల ప్రజలను కోరారు.