‘మద్దతుగా నిలిస్తే మీకే నష్టం’
ఢిల్లీకి పనిపాట లేక వెళ్లడం లేదు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల కోసమే వెళ్తున్నాన్న సీఎం రేవంత్.;
తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను పాటుపడుతున్నానని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ దిశగా తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన ప్రాపర్టి షోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగానే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని అన్నారు. అలా ఉంటేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని, లేదంటే ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అపోహలు, అనుమానాలను దాటుకుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నా అని అన్నారు.
‘‘ప్రభుత్వం పాలసీ, కన్స్ట్రక్షన్ రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివి. పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. నాయకుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు, అపోహలకు తావిస్తుంది. పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం.. పెట్టుబడులకు రక్షణ కల్పించడమేకాదు.. లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది.. మాది. రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు మీరు ఊతం ఇస్తే నష్టపోయేది మీరే. అలాంటి అపోహలను తొలగించడానికే ఇక్కడికి వచ్చా’’ అని తెలిపారు.
‘‘ఇతర దేశాల ప్రతినిధులను ఇక్కడ పెట్టుబడులకు ఆహ్వానించే మేము… ఇక్కడే ఉన్న మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం? పెట్టుబడుల విషయంలో మీకే మా మొదటి ప్రాధాన్యత.. నేను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని. కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్న వాడిని కాదు. సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తా.. అందుకే మీరు అడిగిన కొన్నింటికి నేను అంగీకరించకపోవచ్చు.. నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను.. పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు నాకు అభ్యంతరం లేదు’’ అని వివరించారు.
‘‘జైపాల్ రెడ్డి గారి చొరవతో హైదరాబాద్ నగరానికి మెట్రో వచ్చింది. పదేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదు. అలా జరిగి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య కొంతైనా పరిష్కారమయ్యేది. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మల్టీ యూనిట్ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి.. లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నా.. షామీర్ పెట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణకు కృషి చేస్తున్నాం. మన నగరం ప్రతిష్ట పెంచడానికే మా ప్రయత్నం. మాటిమాటికీ ఢిల్లీకి వెళుతున్నారని కొందరు మాట్లాడుతున్నారు… మెట్రో, మూసీ, ఇతర అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా ఎక్కడికి వెళతారు’’ అని నిలదీశారు.
‘‘ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగళా ఇచ్చింది నెలకు నాలుగురోజులు వెళ్లి కేంద్రంతో అనుమతులు తెచ్చుకోవడానికే. దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా. అది ఫామ్ హౌస్ లా వాడుకుని దావత్ లు చేసుకునేందుకు కాదు… 26 వేల కోట్లు రుణాలను 35 ఏళ్లకు 7.5 శాతం వడ్డీకి రీ స్ట్రక్చర్ చేయించా. అలా 2 లక్షల కోట్ల రుణాలకు రీ స్ట్రక్చర్ కోసం ప్రధానిని కోరుతున్నా. ఇదినా ఒక్కడి కోసం చేస్తున్నది కాదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా తాపత్రయం. తెలంగాణకు మరిన్ని విమానాశ్రయాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదా. మెట్రో, ఎయిర్ పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు 11 కొత్త రేడియల్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నాం. వాటర్, రోడ్డు కనెక్టివిటీ లేకుండా ఇన్ఫ్రా స్రక్చర్ ఎలా అభివృద్ధి అవుతుంది’’ అని తెలిపారు.
‘‘హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం.. త్వరలోనే అనుమతులు రాబోతున్నాయి. తెలంగాణను మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయబోతున్నాం. నీళ్ళుండే చోటుకు మనం వెళితే నీళ్లు ఎక్కడికి వెళతాయి… అందుకే హైడ్రాతో చెరువులను పునరుద్ధరిస్తున్నాం. నాలాల ఆక్రమణలు తొలగిస్తే ఒక పెద్దమనిషి సోషల్ మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి మీరు మద్దతుగా నిలిస్తే మీకే నష్టం. తెలంగాణ కోసం ప్రణాళికలు మేం సిద్ధం చేస్తాం.. మీరు ప్రమోట్ చేయండి’’ అని కోరారు.
‘‘ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది. కులీ కుతుబ్ షా చార్మినార్ కట్టారు, ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ నిర్మించారు, హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు.. వాళ్లు ఇక్కడ లేకపోయినా వారి పేర్లు చెప్పుకుంటున్నాం.. వారిని గుర్తు చేసుకుంటున్నాం. సంపాదించింది ఎవరైనా తీసుకెళతారేమో కానీ సమాజానికి ఇచ్చింది ఎవరూ తీసుకెళ్లలేరు. నాకు వేరే కోరికలేం లేవు… హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా.. భవిష్యత్ లో వందేళ్లు, వెయ్యేళ్లు చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తాం. నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి, తపన ఉంది’’ అని అన్నారు. తనకు వయసు ఉంది, ఓపిక ఉందని, అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. భూమి ఒక సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను మీరు ఎంత పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్తారనేదనిపైనే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆధారపడి ఉంటుందని చెప్పారు.