డాక్టర్ కెఎల్ రావుని రాజకీయాల్లోకి తెచ్చింది సంజీవరెడ్డి...

చట్టసభల్లో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు లేకపోవడం డా. కెల్ రావుకు పెద్ద లోటు అనిపించింది. ఈ విషయం సంజీవరెడ్డికి చెప్పారు. ఆయన ప్రధాని నెహ్రూను వప్పించారు.

Update: 2024-07-15 02:26 GMT
నాగార్జున సాగర్ వద్ద ఉన్న కెఎల్ రావు విగ్రహం

జులై 15: ఫాదర్ ఆఫ్ ఇండియన్ వాటర్ మేనేజ్ మెంట్ , నాగార్జునసాగర్ ప్రాజెక్టు రూపకర్త, భారతీయ నీటి వనరుల నిపుణుడు - పద్మభూషణ్ డాక్టర్ కానూరి లక్ష్మణ (కే ఎల్) రావు జయంతి.


-కె కె వి నాయుడు


ఈ రోజుల్లో పార్టీల టికెట్ల కోసం నాయకులు వెంపర్లాడుతుంటారు. పూర్వం వివిధ రంగాలో ఉన్న నిపుణలు కోసం పార్టీలు వెదుకుతూ ఉండేవి. ఆ విధానం నెెహ్రూ కాలం నుంచి ఉంది. ఈ విధానంలో వల్లే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కానూరు లక్ష్మణ్ రావు (కెఎల్ రావు) రాజకీయాల్లోకి వచ్చారు.  ఇంజనీరుగా అద్భుతమయిన ప్రయోగాలు చేస్తున్న కెఎల్ రావు నైపుణ్యంతో దేశానికంతా ప్రయోజనం చేకూరాలంటే ఆయన్ని ప్రభుత్వంలోకి తీసుకురావడం సబబు అని  అప్పటి కాంగ్రెస్ నేత నీలం సంజీవరెడ్డి భావించారు.  ఆయన కృషి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా1962లో విజయవాడ నుంచి లోక్‌సభకు పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 1967, 1971 ఎన్నికల్లో గెలిచారు. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రీ ఇందిరాగాంధీ మంత్రి వర్గాలలో పనిచేశారు. 1963లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. 

ఎన్నికల్లో పోటీ చేసేనాటికి ఆయన వివిధ ఉన్నతో ద్యోగాలు చేసి రిటైరయ్యారు. అంతకు ముందు కేంద్రం జల విద్యుత్ కమిషన్ డిజైన్సు విభాగానికి డైరెక్టరుగా 1950లో పనిచేశారు. 1954లో వరదలు అరికట్టే విభాగానికి చీఫ్ ఇంజనీరు అయ్యారు. తర్వాత 1956లో కేంద్ర జల విద్యుత్ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఆపైన ఐక్యరాజ్యసమితి సహజ వనరుల కమిటీ అధ్యక్షులుగా, అంతర్జాతీయ నీటి పారుదల సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 1957లో ఉద్యోగ పదవీ విరమణ చేశారు. అనంతరం 1962 వరకు కేంద్ర జల కమిషన్ సభ్యులుగా కొనసాగారు.

రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?

క్యూసెక్స్ క్యాండిడేట్ (Cusecs Candidate) పేరుతో ఆయన ఆత్మకథ రాశారు. ఆ పుస్తకాన్ని ఆయన  భారతదేశంలో మహానదులను దేశాభివృద్ధికోసం మళ్లించే కృషిలో నిమగ్నమయిన కూలీలకు, ఇంజనీర్లుకు అంకితం ఇచ్చారు.



డాక్టర్ నీలం సంజీవరెడ్డి


తానెలా రాజకీయాల్లోకి వచ్చారో డాక్టర్ రావు ఈ పుస్తకంలో చాలాబాగా చెప్పారు.  ఒక సారి ఆయన న్యూఢిల్లీలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్  ఇంజనీర్స్ సభలో మాట్లాడుతూ చట్ట సభల్లో ఇంజనీర్లు , శాస్త్రవేత్తలు లేకపోవడం మీద విచారం వ్యక్తం చేశారు. తాను అనేక ప్రపం చదేశాలలో పర్యటించాలనని ఆ దేశాలలో చాలామంది ఇంజనీర్లు శాస్త్రవేత్తలు పార్లమెంటు సభ్యులుగా ఉండటం గమనించానని చెబుతూ ఈ వర్గం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకపోవడం వల్లే వాళ్లని చట్ట సభల్లోకి పార్టీ లు ఆహ్వానించడంలేదని అభిప్రాయపడ్డారు. ఆ నాటి సభకి ప్రధాని  నెహ్రూ అధ్యక్సోపన్యాం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో ఆయన మరింత ప్రేరణ పొందారు. దేశనిర్మాణంలకోసం ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కూడా ముందుకు రావాలని ప్రధాని సూచన చేశారు. దీనితో ఆయన రాజకీయాలోకి రావాలనుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నీలం సంజీవరెడ్డి అధ్యక్షులిగా ఉన్నారు. ఆయన సంజీవరెడ్డిని కలసి చట్ట సభల్లో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు లేని విషయం చెప్పారు. దీనితో సంజీవరెడ్డి అంగీకరించారు. నిజానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు రాజకీయల్లోకి రాకూడదని రాజాజీ లాంటి ప్రముఖులుచెప్పుతున్న రోజులవి. విజయవాడనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టేందుకు సంజీవరెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఆత్మకథలో రాాశారు.  సంజీవరెడ్డి తన ప్రతిపాదనని ప్రధాని నెహ్రూకు చెప్పారు. ఆయన అంగీకరించారు. తర్వాత ఆయన సంట్రల్ వాటర్ కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా 1962 జనరల్ ఎన్నికల్లో విజయవాడనుంచి పోటీ చేసి  గెలుపొందారు.

కెఎల్ రావు కృషి
భారత దేశంలో జల వనరుల అభివృద్ధికి, వాటిని సేధ్య వినియోగానికి, నీటి యద్ధడి ఉన్న ప్రాంతాల నీటి అవసరాలు సమకూర్చడానికి బృహత్ ప్రణాళికలకు శ్రీక్రారం చుట్టి -కోశీ, హిరాకుడ్, చంబల్, ఫరక్క, శ్రీశైలం, తుంగభద్ర, నాగార్జున సాగర్ ఆనకట్టలు రూపొందించడమే కాక గ్రామీణ విద్యుదీకరణ విశేష అభివృద్దికి తోడ్పడ్డ క్షేత్రజ్ఞ నిపుణుడు. వ్యవసాయ నీటి పారుదల క్షేత్ర పితామహుడు, గ్రామీణ విద్యుదీకరణ రచనకర్త పద్మభుషణ్ డాక్టర్ కానూరి లక్ష్మణ రావు (కే ఎల్ రావు) గారు.
ప్రపంచంలో అత్యంత పొడవైన " అర్తెన్ డాం " ఆనకట్టను కృష్ణా నది మీద నిర్మించారు.

మూడు వందలకు పైగా సాంకేతిక రచనలు చేశారు. వీరు రచించిన " స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ అండ్ రీ ఇంఫోర్స్డ్ కాంక్రీట్ " పుస్తకం ఈ క్షేత్రంలో ప్రామాణిక గ్రంధం. ఆటోబయోగ్రఫీ " ది క్యూసెక్స్ కాండిడేట్ " మొదలగు పుస్తకాలు రాసారు.భారత దేశ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కే ఎల్ రావు గారు.

డాక్టర్ కే ఎల్ రావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక ఆచార్యుడిగా, కేంద్ర మంత్రి గా, ఇంజినీరుగా పనిచేసిన ప్రతిభాశాలి.కే ఎల్ రావు గారి జీవితం అత్యంత విశిష్ట మైనది. అనేక విజయాలు సాదించారు. భారత దేశానికి గణనీయ మైన సేవలు అందించారు.

జవాహర్ సాగర్, గాణీనగర్, రాణా ప్రతాప్ సాగర్ నిర్మాణపు పనులు శ్రీ కే ఎల్ రావు మేధాసంపత్తికి నిదర్శనాలు.

ఒక సమావేశంలో కెఎల్ రావు (మధ్య)


 అనేక విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. అప్పటి భారత ప్రధానులు - నెహ్రూ, లాల్ భహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధి ప్రభుత్వాలలో నీటి పారుదల, జల వనరుల మంత్రిగా వ్యవహరించారు


కే ఎల్ రావు గారు, జులై 15, 1902 లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ వద్ద కంకిపాడు లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తన తొమ్మిదవ ఏటనే తండ్రిని కోల్పోయారు. మద్రాస్ లోని ప్రెసిడెన్సీ కాలేజి లో చదివారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి. ఈ., డిగ్రీ సాందించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ డిగ్రీ లో మాస్టర్స్ పట్టా సాధించిన ప్రప్రధములు. ఇంగ్లాండ్ లోని బ్ర్మింగ్ హాం విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. డాక్టరేట్ పట్టా సాదించిన తరువాత అక్కేడే (ఉప) ఆచార్యుడిగా పనిచేశారు. అప్పటి మద్రాస్ ప్రభుత్వంలో డిసైన్ ఇంజినీర్ గా కొంత కాలం పనిచేశారు. మరికొంత కొంత కాలం సి డబ్లు సి సభ్యులు గా ఉన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ నేత, మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ రెడ్డి గారి సూచన మేరకు డాక్టర్ కే ఎల్ రావు విజయవాడ నుండి MP గా ఎన్నికలలో పోటీచేసి గెలుపొందేరు . 1962 నుండి 1977 వరకు విజయవాడ లోక్ సభ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఉన్నారు. భారత దేశ నదులని అనుసంధానం చేయాలని (సర్వే) చేశారు. కాని ఇది రూపు దాల్చ లేదు.

ఢిల్లీ, విద్యుత్ కమీషన్ సంచాలకుడిగా పనిచేసి, తరువాత ముఖ్య (చీఫ్) ఇంజినీర్ గా కొంత కాలం పనిచేశారు. " ఇండియా'స్ వాటర్ వెల్త్ " పుస్తకం ఈ క్షేత్రంలో శాస్త్రజ్ఞులకి సైతం ప్రామాణిక గ్రంధం.

విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కూడా కే ఎల్ రావు గారి మేధా సంపత్తి నిర్దర్శనమే. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ వీరి హయాం లోనే నెలకొల్పారు. డాక్టర్ కే ఎల్ రావు గారి నేతృత్వంలో - నాగార్జున సాగర్, దిగువ భవాని, మలాంపూజ, కోశీ, హిరాకుడ్, చంబల్, ఫరక్క, శ్రీశైలం, తుంగభద్ర తదితర భారీ జల విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనలు జరిగాయి. ఇంతటి బృహత్తర రీతిలో కృషి, జల వనరులు, (ఇరిగేషన్), సాగుకు దోహద పడ్డ ఉదాహరణలు మరెక్కడా లేవు. గంగా, బ్రహ్మపుత్ర వరధ నివారణ చర్యలకు కీలక సలహాలు అందించారు.

1970 లో చెన్నై ఐఐటిలో హైడ్రాలిక్ లాబోరేటరీ నిర్మాణానికి శంకుస్ఠాపన చేస్తూన్న కెఎల్ రావు 


 డాక్టర్ కే ఎల్ రావు గారు అనేక అవార్డులు, గౌరవాలు పొందేరు. వాటిలో కొన్ని ముఖ్య మైనవి:


- 1963 లో భారత ప్రభుత్వం నుండి పద్మ భుషణ్ గౌరవం అందుకున్నారు.
- 1960 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవం అందుకున్నారు
- 1968 లో రూర్కీ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు
- భారతీయ ఇంజినీర్స్ సంస్థ అధ్యక్షుడిగా ఉన్నారు
- 1958-59 లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ అధ్యక్షులు గా ఉన్నారు
- జవాహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం గౌరవ డాక్ట్రేట్ అందుకున్నారు
డాక్టర్ కే ఎల్ రావు గారు అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2006 లో గుంటూర్ జిల్లా లోని బెల్లంకొండ పులిచింతల ప్రాజెక్టుకు కే ఎల్ సాగర్ ప్రాజెక్ట్ గా నామకరణం చేసింది.వీరి మనుమలు - దీపక్, సంజై కణిష్క విమాన ప్రమాధంలో మరణించారనే వార్త వీరిని కుంగ దీసింది. మే 18, 1986 లో మరణించారు.

దేశ నీటి ప్రయోజనాలని పెంచడానికి ఎంతో దోహద పడ్డారు లక్ష్మణ రావు గారు. ఆయన ఆశించిన భారతీయ జీవ నదులు గంగా, బ్రహ్మపుత్రను, గంగా కావేరీ నదులను కలిపే బృహత్తర ప్రణాళికల రూపకల్పన రానున్న కాలంలో సాఫల్యం అయి నీటి యద్ధడి తీరుస్తుందని ఆశిద్ధాం. భారత దేశానికి ఓ సంగ్రహ విద్యుత్ (గ్రిడ్) రూపొందిం చాలని ఆకాంక్షించారు. ఈ రెండూ నెరవేర్చడమే మనం ఆయనకు ఇవ్వగలిగే నివాళి


Tags:    

Similar News