తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారా?

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. తిరుమలపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-27 10:11 GMT

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల నటి సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. వాటిపై స్పందించిన నాగార్జున, కేటీఆర్‌లు.. సదరు మంత్రిపై పరువు నష్టం దావాలు దాఖలు చేశారు. ఆ సమస్య సమసిపోకముందే తాజాగా ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆమె తిరుమల తిరుపతి దేవస్థానంపై మాట్లాడారు. తిరుమలలో తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, ఇది చాలా దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి వచ్చే భక్తుల పట్ల టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వం నుంచే తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురౌతున్నారని ఆమె విమర్శించారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చింస్తామని, ఇప్పటికే ఈ విషయంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడానని కొండా సురేఖ చెప్పారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని కూడా అన్నారు.

‘‘రాష్ట్ర విభజన సమయంలో మన దురదృష్టం వల్ల శ్రీశైలాన్ని కోల్పోయాం. దాన్ని ఆంధ్రకు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు తిరుమలలో తెలంగాణ భక్తులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. టీటీడీకి తెలంగాణ నుంచే అధికరాబడి వస్తోంది. తెలంగాణలో దేవాలయాలు, కళ్యాణ మండపాల నిర్మాణానికి టీటీడీ సహకరించాలి. అదే విధంగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సు లేఖలను కూడా టీటీడీ స్వీకరించాలి. తెంగాణ భక్తులను ప్రాధాన్యతనివ్వాలి. తెలంగాణలో ధర్మప్రచారానికి టీటీడీ నిధులు కేటాయించాలి’’ అని ఆమె కోరారు. శ్రీశైతం భ్రమరాంబికా మల్లికార్జునస్వామిని శుక్రవారం కొండాసురేఖ దర్శించుకున్నారు. ఈ సందర్భంగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఇటీవల ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భక్తులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను టీటీడీ నిర్లక్ష్యం చేస్తోంది. గతంలో అంతా సరిగా ఉండేది. కానీ ఇటీవల తిరుమలలో తెలంగాణ భక్తులు వివక్షకు గురవుతున్నారు’’ అని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం నిషేధం కావడంతో తెలంగాణ మాజీ మంత్రిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా అటువంటి వ్యాఖ్యలే చేయడం కీలకంగా మారింది. మరి ఈ విషయంపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News