నిజామాబాద్‌లో పసుపు బోర్డు..

జాతీయ పసుపు బోర్డు ప్రారంభంతో పాటు బోర్డు ఛైర్మన్‌నూ నియమించిన కేంద్ర ప్రభుత్వం.;

Update: 2025-01-13 16:48 GMT

ఎన్నో ఏళ్లుగా పసుపు రైతులు కంటున్న కల పసుపు బోర్డు. ఈ కల ఇన్నాళ్టికి నెరవేరింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ.. సంక్రాంతి కానుక ఇచ్చినట్లయింది. అంతేకాకుండా జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం కూడా జరగనుంది. ఈ ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్.. వర్చువల్‌గా హాజరుకానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని 2014 ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. కాగా అది 2025లో అమలయింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంతోషం వ్యక్తం చేశారు.

అయితే జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయాలని తుమ్మలు పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆయన కన్న ఆ కల ఇప్పుడు నెరవేరుతుండటంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పసుపు రైతుల ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరడం ఆనందంగా ఉందని అన్నారు. నిజామాబాద్‌లో రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరియు పసుపు రైతుల తరపున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి, వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రివర్యులు పియుష్ గోయల్కి కృతజ్ఙతలు తెలిపారు మంత్రి తుమ్మల.

కాగా నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపు బోర్డుకు ఛైర్మన్‌ను కూడా కేంద్రం ప్రకటించింది. ఈ బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించినట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Tags:    

Similar News