యూరియా సరఫరా మెరుగు: మంత్రి తుమ్మల
వచ్చే రెండ్రోజుల్లో 21,325 మెట్రిక్ టన్నుల యూరియా;
యూరియా సరఫరాలో తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. వచ్చే రెండు రోజుల్లో గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చర్ల, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వెల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లి కి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకోనుందని మంత్రి తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా గంగవరం, దామ్ర, కరాయికల్ పోర్టుల నుండి మరో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని మంత్రి చెప్పారు.
పోర్టుల నుండి ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వెల్ ప్రాంతాలకు యూరియా చేరుకోనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. అక్కడి నుండి డిమాండ్ ను బట్టి జిల్లాలకు పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.సాయంత్రంలోగా పంట నష్టంపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు.
బృందాలుగా ఏర్పడి జిల్లాలలో పర్యటించి, పంట నష్టం వివరాలను సేకరించాలని అధికారులకు హుకుం జారి చేశారు.
వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.
రాజకీయ వివాదంగా...
తెలంగాణలో మునుపెన్నడూ లేని యూరియా కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మధ్య రాజకీయ వివాదంగా మారిపోయింది. ఈ సంక్షోభం రాష్ట్రవ్యాప్తంగా పంట దిగుబడిపై ప్రభావం పడింది. రైతుల జీవనోపాధికి ముప్పు వాటిల్లడంతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. కీలకమైన ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరత రైతుల నడ్డివిరిచినట్లైంది. రైతుల నిరసనలు, విపక్ష ఆరోపణలతో తెలంగాణ అట్టుడికిపోయింది.
తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఆగస్టు నాటికి ఖరీఫ్ సీజన్‌కు రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) యూరియా కేటాయించబడింది, కానీ కేవలం 5.62 లక్షమెట్రిక్ టన్నులు మాత్రమే అందినట్లు సమాచారం. దీని వల్ల దాదాపు 3 లక్ష మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడింది, ఇది రైతులను తీవ్రంగా ప్రభావితం చేసింది.
ఈ సీజన్‌లో వరి సాగు రికార్డు స్థాయిలో ఉండటంతో సంక్షోభం మరింత తీవ్రమైంది, దీని ఫలితంగా యూరియాకు మొత్తం డిమాండ్ 10.48 లక్షమెట్రిక్ టన్నులకి కి పెరిగింది. నైరుతి రుతుపవనాలు అనుకూలమైన పరిస్థితులను సృష్టించినప్పటికీ యూరియా కొరతతో రైతు కుదేలయ్యాడు. యూరియా సరఫరా తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.