కాళేశ్వరం ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’ : ఉత్తమ్
కమిషన్ రిపోర్టులోని కీలకమైన అంశాలను ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఉత్తమ్ చదివి వినిపించారు;
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలకు పాల్పడి బాధ్యులపై చర్యలు తీసుకోవాని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్టులో స్పష్టంగా చెప్పిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్(Uttam Kumar Reddy) రెడ్డి ఆదివారం ప్రకటించారు. పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission Report) రిపోర్టులోని కీలకమైన అంశాలను ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఉత్తమ్ చదివి వినిపించారు. కాళేశ్వరం రిపోర్టు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల(BC Reservations) అంశాలపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రిపోర్టు ప్రకారం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు రిపోర్టులో పీసీ ఘోష్ ఏమిచెప్పారు ? అనే అంశాలపై మంత్రి చర్చను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతు రిపోర్టు ప్రకారం కేసీఆర్ కారణంగా తెలంగాణకు వేలాది కోట్ల రూపాయల శాశ్వత నష్టం జరిగిందని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణం, పంపుహౌస్ వల్ల రు. 21 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. పైన చెప్పిన మూడు బ్యారేజీలు నీటినిల్వకు పనికిరాకుండా పోయిందన్నారు. నీటినిల్వకు పనికిరాకపోవటంతో దానికి అమర్చిన పంప్ హౌసులు కూడా ఎందుకు పనికిరావన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణాలు మొదలై, పూర్తిచేసుకుని చివరకు కుప్పకూలిపోయిన కారణంగా అన్నింటికీ కేసీఆర్ మాత్రమే బాధ్యత వహించాలని ఉత్తమ్ స్పష్టంగా చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజాస్టర్ అన్నది మ్యాన్ మేడ్ డిజాస్టర్ గా మంత్రి అభివర్ణించారు. ప్రాజెక్టు, బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, నిర్మాణ స్ధలాల మార్పిడి అంతా ఏకపక్షంగానే సాగినట్లు రిపోర్టులో జస్టిస్ ఘోష్ స్పష్టంగా తేల్చేసినట్లు మంత్రి చెప్పారు. రిపోర్టులోని కీలకమైన అంశాలను ఒకదాని తర్వాత మరోదాన్ని మంత్రి చదివి వినిపించారు. మొత్తంమీద ప్రతిపక్ష సభ్యులు, సభలోని ఇతర సభ్యులు మాట్లాడిన తర్వాత ఫైనల్ గా ఎనుముల రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి రిపోర్టుపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వినిపిస్తారని మంత్రి ఉత్తమ్ స్పష్టంచేశారు.