ఆదివారం వడ్డేపల్లి అంత్యక్రియలు

ప్రముఖ లలిత గీతాల రచయిత, సినిమా పాటల కవి, 'గేయ కిరీటి' బిరుదాంకితుడు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ శుక్రవారం మరణించారు.

Update: 2024-09-07 17:38 GMT

ప్రముఖ లలిత గీతాల రచయిత, సినిమా పాటల కవి, 'గేయ కిరీటి' బిరుదాంకితుడు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ శుక్రవారం మరణించారు. అయితే, ఆయన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వడ్డేపల్లి కృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య సమస్యలతో నెల రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

అమెరికాలో, కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లిన కృష్ణ ఆరోగ్యం దెబ్బతినడంతో జులై 16న హైదరాబాద్ వచ్చి నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. నెలరోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందిన ఆయన... నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. గురువారం మళ్లీ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు మరోసారి నిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఇటీవలే తెలుగు సినీ రచయితల సంఘం వడ్డేపల్లి కృష్ణకు జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా అందించింది. 

వడ్డేపల్లి కృష్ణ స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణం. తపాలా శాఖలో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ లోని నాగోల్ లో స్థిరపడ్డారు. నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన ఆయన.. సినారె స్ఫూర్తితో విద్యార్థి దశలోనే గేయ రచన ప్రారంభించారు. వెయ్యికి పైగా గేయాలు రాసిన వడ్డేపల్లిని వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ నిర్వాహకులు 'గేయ కిరీటి' బిరుదుతో సత్కరించారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ నుంచి 'లలిత గీతాల' మీద ఆయన చేసిన పీహెచ్డీ పరిశోధన అత్యంత ప్రామాణికమైనదిగా విమర్శకులు చెబుతుంటారు.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'పిల్ల జమిందార్' సినిమాలో 'నీ చూపులోన విరజాజి వాన' పాటతో సినీ గేయ రచయితగా ఆయన ప్రస్థానం ప్రారంభించారు. పెద్దరికం,  భైరవద్వీపం, పిలిస్తే పలుకుతా సినిమాల్లో ఆయన రాసిన పాటలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఆయన రాసిన ఎన్నో దేశభక్తి గీతాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. మరికొన్ని 60 ఆడియో ఆల్బమ్స్ గానూ వచ్చాయి. ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని కళ్ళకు కట్టే 'జయ జయహే తెలంగాణ', 'ఆమ్రపాలి', 'రమణి రామప్ప' తదితర 40 పైగా సంగీత, నృత్య రూపకాలను రచించారు.

తెలుగు సినీ రచయితల సంఘం త్రిదశాబ్ది వేడుకల సందర్భంగా వారం కిందట వడ్డేపల్లి కృష్ణను జీవిత సాఫల్య పురస్కారంతో సన్మానించారు. ఉమ్మడి ఏపీలో నంది అవార్డుల కమిటీ చైర్మన్ గా సెన్సార్ బోర్డు సభ్యుడుగా, అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం, బాలల నంది నాటక పోటీలకు న్యాయ నిర్ణీతగా పలు బాధ్యతలు నిర్వర్తించారు వడ్డేపల్లి కృష్ణ. రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇటీవల మంచి పేరు తెచ్చుకున్న బలగం సినిమాలో కూడా నటించారు.

Tags:    

Similar News