Venu Swamy | ‘శ్రీ తేజ కోసం మృత్యుంజయ హోమం చేస్తా’
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉన్న శ్రీ తేజను ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పరామర్శించారు.
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉన్న శ్రీ తేజను ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పరామర్శించారు. ఈ సందర్భంగానే శ్రేతేజ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సహాయం చేశారు. అనంతరం బాలుడి ఆరోగ్య పరిస్థితిపై తండ్రి భాస్కర్‌కు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ జాతకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ జాతకంలో శని ఉండటం వల్లే ఇలా జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అందుకోసం తాను తన సొంత ఖర్చులతో మృత్యుంజయ హోమం చేయనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంధ్య థియేటర్ ఘటన సంచలనం రేపుతున్న క్రమంలో వేణు స్వామి వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి.
అయితే అల్లు అర్జున్ జాతకంలో శని ప్రభావం ఉందని, అందువల్లే ఈ సంఘటన చోటు చేసుకుని బన్నీ చిక్కుల్లో పడ్డారని అన్నారు. వచ్చే ఏడాది మార్చి 29 వరకు అల్లు అర్జున్‌కు శని ప్రభావం తప్పదని వివరించారు. అంతవరకు అల్లు అర్జున్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంనతరం సంధ్య థియేటర్ ఘటనను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎవరూ ఏదీ కావాలని చేయరని, ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతుంటాయని అన్నారు. శని ప్రభావం తగ్గించుకోవడానికి అల్లు అర్జున్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు.
ఇదెలా ఉంటే సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు మంగళవారం దాదాపు మూడున్నర గంటల పాటు విచారించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు చూపిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. బుధవారం శ్రేతేజ కుటుంబాన్ని అల్లు అరవింద్, దిల్ రాజు పరామర్శించారు. అనంతరం రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.