గ్రేటర్ పరిధిలో పూర్ ఓటింగ్

గ్రేటర్ హైదరాబాద్ పరిధి అంటే బాగా విద్యాధికులు, ఉద్యోగులు, వ్యాపార, పారిశ్రామిక రంగాలతో పాటు వివిధ వృత్తుల్లోని చైతన్యవంతులే ఉంటారని అందరు అనుకుంటారు.

Update: 2024-05-13 05:56 GMT
Jr NTR voting

కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ తో పాటు తెలంగాణా ఎన్నికల కమీషనర్, అధికారులు ఎంత మొత్తుకుంటున్నా ఓటింగ్ పై గ్రేటర్ జనాలు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు లేదు. సోమవారం ఉదయం మొదలైన పోలింగ్ లో 9.30 గంటలకు పూర్ ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైన రెండు గంటలకు కూడా 7 శాతం కూడా దాటలేదు. సికింద్రాబాద్ పార్లమెంటులో 5.40 శాతం నమోదైంది. దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ స్పీడందుకోలేదు. ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరినా ఈవీఎంల పనితీరులో లోపాలు, పోలింగ్ కేంద్రాల్లో అయోమయం తదితర కారణాల వల్ల ఓటింగ్ జోరందుకోలేదు. అంబర్ పేటలో 6.45 శాతం, జూబ్లీహిల్స్ లో 6.10, ఖైరతాబాద్ లో 5.20, ముషీరాబాద్ లో 5, నాంపల్లిలో 3.80, సనత్ నగర్లో 5.32, సికింద్రాబాద్ లో 6.02 శాతం మాత్రమే నమోదైంది.

ఇక మరో నియోజకవర్గం హైదరాబాద్ లో కూడా పెద్దగా పోలింగ్ నమోదు కావటంలేదు. ఇక్కడ 5.06 శాతం పోలింగ్ నమోదైంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహదూర్ పురాలో 5.10 శాతం, చాంద్రాయణగుట్టలో 6.66, చార్మినార్లో 3, గోషామహల్లో 2.40, కార్వాన్లో 7.80, మలక్ పేటలో 4.55, యాకూత్ పురాలో 4.5శాతం ఓటింగ్ నమోదైంది. కార్వాన్లో 7.8 శాతం అత్యధికంగా నమోదవ్వగా గోషామహల్లో తక్కువగా 2.4 శాతం నమోదవ్వటం దేనికి సంకేతమో అర్ధంకావటంలేదు. ఓటింగ్ ఇలాగే నత్తనడకన జరిగితే సాయంత్రానికి కూడా పోలింగ్ శాతం పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. 2019 లో కూడా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 44.80 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైన విషయం తెలిసిందే.

అలాగే సికింద్రాబాద్ పరిధిలో 2019 46.9 శాతం మాత్రమే నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటి పోలింగ్ తీరు చూస్తుంటే పోయిన ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతమైనా టచ్ అవుతుందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఊహించని రీతిలో జనాలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తితే తప్ప ఓటింగ్ శాతం పెరిగేట్లుగా లేదనే అనిపిస్తోంది. విచిత్రం ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధి అంటే బాగా విద్యాధికులు, ఉద్యోగులు, వ్యాపార, పారిశ్రామిక రంగాలతో పాటు వివిధ వృత్తుల్లోని చైతన్యవంతులే ఉంటారని అందరు అనుకుంటారు. అయితే వీళ్ళల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటింగులో పాల్గొనే వాళ్ళ సంఖ్య పెద్దగా ఉండటంలేదు కాబట్టే పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. అప్పటికీ ఎన్నికల కమీషన్ సినీ సెలబ్రిటీలు, ప్రముఖులతో ఓటింగులో పాల్గొనే విషయంలో పదేపదే ప్రచారం చేయించింది. ఉదయం నుండే చాలామంది ప్రముఖులు, జూనియర్ ఎన్టీయార్, చిరంజీవి, అల్లు అర్జున్, కీరవాణి లాంటి వాళ్ళు చాలామంది క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు. నమోదవుతున్న ఓటింగ్ శాతం కూడా మధ్య, దిగువ మధ్య తరగతి జనాలతో పాటు పేదలు ఎక్కువగా ఓటింగులో పాల్గొనటం వల్లే పోలింగ్ శాతం ఈమాత్రమైనా నమోదవుతోంది.

Tags:    

Similar News