HCA అధ్యక్షుడికి విజిలెన్స్ పిలుపు

హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య సాగిన ఈమెయిల్స్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ మెయిల్స్ ఆధారంగా దర్యాప్తును ముందుకు కొనసాగించడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు.;

Update: 2025-04-01 11:41 GMT

సర్‌రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదం కీలక మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు ఉదయం మొదలైన దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య సాగిన ఈమెయిల్స్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ మెయిల్స్ ఆధారంగా దర్యాప్తును ముందుకు కొనసాగించడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటుగా ఐపీఎల్‌కు ముందు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. రెండేళ్లుగా ఉప్పల్ స్టేడియం రినొవేషన్‌కు హెచ్‌సీఏ తీసుకున్న చర్యలు, వాటికి సంబంధించి లెక్కలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ఐపీఎల్‌కు ముందు హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించిన రికార్డ్‌లు, టికెట్ల సర్దుబాటు వంటి అంశాలను తరువుగా తనిఖీ చేస్తున్నారు అధికారులు. దర్యాప్తును పర్యవేక్షించడానికి విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఉప్పల్ స్టేడియం‌కు చేరుకున్నారు. అందుబాటులో ఉన్న ఆఫీస్ బేరర్స్ అంతా స్టేడియం దగ్గరకు రావాలని అధికారులు సూచించారు. ఇందులో భాగంగానే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావుకు కూడా విజిలెన్స్ అధికారులు నోటీసులు అందించారు.

బుధవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ ట్రెజరర్ సభ్యులను అధికారులు విచారించారు. ఇదిలా ఉంటే కాంప్లిమెంటరీ పాస్‌ల వ్యవహారంలో హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య వివాదం జరుగుతుంది. ఐపీఎస్‌ 2025 ఒప్పందం ప్రకారం 10శాతం టికెట్లు హెచ్‌సీఏకు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా 50 టికెట్ల సామర్థ్యం ఉన్న కార్పొరేట్ బాక్స్‌‌ను హెచ్‌సీఏకు కేటాయించారు. కానీ ఈ ఏడాది ఆ బాక్స్ సామర్థ్యం 30కి తగ్గింది. దీంతో తమకు అదనంగా మరో 20 టికెట్లు ఇవ్వాలని హెచ్‌సీఏ డిమాండ్ చేసింది. దీనిపై చర్చించాలని ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధులు సూచించారు. దీంతో ఒక మ్యాచ్ సందర్భంగా ఆ హెచ్‌సీఏ ప్రతినిధులు తమ కార్పొరేట్ బాక్స్‌కు తాళం వేశారు. తమకు రావాల్సిన అదనపు 20 టికెట్లు ఇస్తేనే తాళం తీస్తామని హెచ్‌సీఏ ప్రతినిధులు చెప్పారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్.. హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావుకు లేఖ రాసినట్లు సమాచారం. ఈ లేఖలో గత రెండేళ్లుగా హెచ్‌సీఏ వేధింపులు ఎక్కువయ్యాయని, తాము ఉప్పల్ స్టేడియంలో ఆడటం ఇష్టం లేనట్లు హెచ్‌సీఏ ప్రవర్తిస్తోందని, ఇలానే కొనసాగితే ఇదే విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో చర్చించి మరో హోమ్ గ్రౌండ్ చూసుకోవాల్సి రావొచ్చని పేర్కొన్నారు. ఈ వివాదం తీవ్రతరం కావడంతో సీఎం రేవంత్ స్పందిస్తూ.. విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News