వీసా గాడ్ ‘సంతాన బాలాజీ’గా పాపులరవుతున్నారా ?

మొన్న 19వ తేదీన చిలుకూరి బాలాజీ ఆలయంలో సంతాన ప్రాప్తికోసం వేలాదిమంది మహిళలు లేదా దంపతులు ‘గరుడ ప్రసాదాన్ని’ సేవించారు.

Update: 2024-04-23 10:26 GMT
Chilukuru Balaji

సంతాన ప్రాప్తికోసం పూజలు, వ్రతాలు, యాగాలు చేసినట్లు పురాణాల్లో చదువుకున్నాము, సినిమాల్లో చూశాము. సంతానం కోసం దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినట్లు రామాయణంలో ఉంది. అలాగే వివాహమైనా సంతానం కలగటంలేదన్న చింతతో చాలామంది దంపతులు ఆలయాల్లో ముడుపులు కట్టడం కూడా తెలిసిందే. కొందరు డాక్టర్లను సంప్రదిస్తే మరికొందరు పూజలు, వ్రతాలు చేస్తారు. అలాగే సంతానం కలిగితే మొక్కలు చెల్లించుకుంటామని చాలామంది మొక్కుకుంటారు. డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా, దేవుళ్ళకు మొక్కినా అది వాళ్ళ నమ్మకాలే.

 

ఇపుడిదంతా ఎందుకంటే మొన్న 19వ తేదీన చిలుకూరి బాలాజీ ఆలయంలో సంతాన ప్రాప్తికోసం వేలాదిమంది మహిళలు లేదా దంపతులు ‘గరుడ ప్రసాదాన్ని’ సేవించారు. గరుడప్రసాదం కోసం ఆలయానికి పోటెత్తిన మహిళలు, దంపతులు అన్న వార్త పెద్ద సంచలనగా మారింది. సంతానం కోసం చేసే పూజలు, వ్రతాల తర్వాత ప్రసాదం వండుకోవటం దాన్ని భక్తితో తినటం అందరికీ తెలిసిందే. కాని సంతానం కోసం చిలుకూరి బాలాజీ ఆలయంలో ‘గరుడ ప్రసాదం’ తినటం అన్నది గతంలో చాలామందికి తెలీదు. ఇపుడు ఆలయ నిర్వాహకులు చేసిన ప్రకటనతో వేలాదిమంది భక్తులు పోటెత్తటంతో చుట్టు పక్కల ప్రాంతమంతా భక్తులతో క్రిక్కిరిసిపోయింది.

పోలీసుల అంచనా ప్రకారం గరుడప్రసాదం కోసం సుమారు లక్షన్నరమంది వచ్చారు. అయితే వీరిలో సుమారు 40 వేలమందికి మాత్రమే ప్రసాదం తినే భాగ్యం దక్కింది. అందుకనే మిగిలిన వాళ్ళకి కూడా వీలువెంబడి ప్రసాదాన్ని అందిస్తామని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ప్రసాదాన్ని ముందు పదివేలమందికి మాత్రమే తయారుచేసినా భక్తుల రద్దీ కారణంగా అప్పటికప్పుడు మరో 30 వేలమందికి తయారుచేయాల్సొచ్చింది. ప్రసాదంకోసం ఆలయానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంవరకు భక్తులు వేచి ఉన్నారంటేనే ఎన్ని వేలమంది దంపతులు ఎంతకాలంగా సంతానం కోసం తపించిపోతున్నారో అర్ధమవుతోంది.

 

ఇదే విషయాన్ని ‘తెలంగాణా ఫెడరల్’ చిలుకూరి బాలాజీ ఆలయం ప్రధాన నిర్వాహకుడు, ప్రధాన అర్చకుడు రంగరాజన్ తో మాట్లాడింది. ఫెడరల్ తో రంగరాజన్ మాట్లాడుతు ‘చిలుకూరు బాలాజీ ఆలయంలో సంతాన ప్రాప్తికోసం గరుడప్రసాదం పంపిణీచేయటం ఇదే మొదటిసారి కాద’న్నారు. గడచిన 50 ఏళ్ళుగా గరుడ ప్రసాదాన్ని సంతానంలేని భక్తులకు అందిస్తున్నట్లు చెప్పారు. ‘ప్రతి ఏడాది బ్రహోత్మవాల ప్రారంభంలో ధ్వజారోహణం సందర్భంగా సంతానంలేని దంపతులకు గరుడప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నా’మని చెప్పారు. ‘గరుడప్రసాదాన్ని సేవిస్తే సంతానభాగ్యం కలుగుతుందని స్కంధ పురాణంతో పాటు బ్రహ్మాండ, గరుడపురాణాల్లో కూడా చెప్పార’న్నారు. ‘భక్తితో, నమ్మకంతో గరుడప్రసాదాన్ని సేవించిన వాళ్ళకు సంతానభాగ్యం కలుగుతుందన్నది పురాణ నమ్మకమ’ని రంగరాజన్ చెప్పారు. గరుడప్రసాదం అంటే చక్రపొంగలిగా చెప్పారు.

 

నమ్మకానికి, విశ్వాసానికి ఆధారాలు చూపించటం సాధ్యం కాదన్నారు. ఒకరి విశ్వాసాన్ని ఎవరు ప్రశ్నించేందుకు లేదన్నారు. ‘గరుడప్రసాదాన్ని సేవించటం వల్ల సంతానభాగ్యం దక్కిందని కొన్నివేలమంది దంపతులు తమతో చెప్పార’ని రంగరాజన్ అన్నారు. ‘చిలుకూరు టెంపుల్ కు వెళ్ళి దర్శనం చేసుకుని మొక్కుకుంటే విదేశాలకు వెళ్ళేందుకు వెంటనే వీసా వస్తుందనే నమ్మకాన్ని ఎవరైనా నిరూపించగలరా’ ? అని రంగరాజన్ ఎదురు ప్రశ్నించారు. చిలుకూరు టెంపుల్ కు వెళ్ళి మొక్కుకుంటే వీసా వస్తుందన్నది భక్తుల నమ్మకం, విశ్వాసమన్నారు. కొన్ని వేలమందికి వీసాలు వచ్చింది కాబట్టే చిలుకూరు బాలాజీకి వీసా దేవుడనే పేరు కూడా వచ్చింది. దర్శనం చేసుకుని మొక్కుకుంటే వీసాలు వచ్చినట్లే చిలుకూరు ఆలయంలో గరుడప్రసాదం తిన్న తర్వాత సంతాన కలిగిందన్న నమ్మకం, విశ్వాసం వీసా దేవుడిగా ప్రాచుర్యం పొందిన చిలుకూరు బాలాజీని ‘సంతాన బాలాజీ’ అని కూడా భక్తులు చెప్పుకుంటారేమో చూడాలి.

Tags:    

Similar News