తెలంగాణలో అడుగంటిన ప్రాజెక్టులు..పంటల సాగు చేసేదెలా?
రుతు పవనాల ప్రభావం వల్ల ఆశించిన మేర వర్షాలు కురవక పోవడంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు.దీంతో తెలంగాణలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
By : The Federal
Update: 2024-06-22 00:48 GMT
తెలంగాణలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో వర్షాకాలంలోనూ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి.తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులలోకి గత సంవత్సరం వరదనీరు చేరలేదు. దీంతో ఈ సంవత్సరం ప్రాజెక్టు జలాశయాలు అడుగంటాయి.రాష్ట్రంలో వర్షాకాలం రుతుపవనాలు వచ్చినా ఆశించిన మేర వర్షాలు కురవక ఖరీఫ్ కార్యకలాపాలు అనిశ్చితంగా మారాయి. రుతువపనాల ముందుగా వచ్చినా కొంత విరామం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణకేంద్రం హెడ్ కె నాగరత్న చెప్పారు. జూరాల మినహా దాదాపు అన్ని ప్రధాన, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లోకి ఇంకా మొదటి వరదనీటి ప్రవాహాలు రాలేదు.జూన్‌లో ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురవక నీటి కష్టాలు ఏర్పడ్డాయి.
ఆకాశం వైపు ఎదురుచూస్తున్న రైతులు
జూన్ నెల రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవక పత్తి విత్తనాలు వేసిన రైతులు ఆశగా వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాల్లేక నారుమళ్లు ఎండిపోతున్నాయి. మరో వైపు వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తక రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి స్టోరేజీ తక్కువగా ఉంది.చిన్న నీటి వనరులైన చెరువుల్లోనూ వరదనీరు రాలేదు.రుతుపవనాల ప్రభావం వల్ల భారీవర్షాలు కురిసి ప్రాజెక్టుల్లోకి నీరు వస్తేనే ఖరీఫ్ ఆయకట్టు సాగులోకి వస్తుందని సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్డీఆర్కే శర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
నాగార్జునసాగర్ జలాశయంలో అడుగంటిన నీరు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా శనివారం నాటి నీటిమట్టం 504 అడుగులకు పడిపోయింది. గత సంవత్సరం ఈ ప్రాజెక్టు జలాశయంలో శనివారం నాటికి 149.270 టీఎంసీల నీరుంది. కాగా ఈ ఏడాది శనివారం నాడు నాగార్జునసాగర్ లో 122.350 టీఎంసీలకు పడిపోయింది. గత ఏడాది సరిగా వర్షాలు కురవక ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. రుతుపవనాలు ప్రవేశించాక కూడా వర్షాలు సరిగా కురవక పోవడంతో ప్రాజెక్టు జలమట్టం అడుగంటింది.
తాగునీటికి అందని నీరు
ఈ ప్రాజెక్టు నుంచి జంటనగరాలు,మూడు జిల్లాల తాగునీటి అవసరాలకు నీరు అందించే పరిస్థితి లేదు. ప్రాజెక్టుకు వచ్చే మొత్తం ఇన్‌ఫ్లోలు చాలా తక్కువగా ఉండడంతో గతేడాది వర్షాకాలం,యాసంగి సీజన్‌లలో రెండు పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు.ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండాలంటే 190 టీఎంసీల నీరు అవసరం.ఈ ప్రాజెక్టు నిండితే సాగర్ ఎడమ కాలువ ద్వారా 6.16 లక్షల ఎకరాల ఆయకట్టు తెలంగాణలో సాగులోకి వస్తుంది.
జూరాల జలాశయానికి వచ్చిన నీరు
గతేడాది వరకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహణలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చేతుల్లోకి వెళ్లింది.శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 813 అడుగులకు పడిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం 36 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది.జూరాల ప్రాజెక్టుకు గత మూడు వారాలుగా 6.56 టీఎంసీల నీరు రావడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
గోదావరి బేసిన్ ప్రాజెక్టులు ఖాళీ
గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం మేడిగడ్డ,అన్నారం,సుందిళ్ల వద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు బ్యారేజీలను ఖాళీ చేశారు. దీంతో శ్రీపాద ఎల్లంపల్లికి గత నాలుగు నెలలుగా నీరు రాలేదు.ఎల్లంపల్లి నీటి సామర్థ్యం 20.18 టీఎంసీలకు గాను 4.21 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది.శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు గాను 8 టీఎంసీల నీరు మిగిలింది.
హైదరాబాద్ కు ఎల్లంపల్లి నీరు అత్యవసర పంపింగ్
గోదావరి ఒడ్డున ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయంలో కేవలం 4.21 టీఎంసీల లైవ్ స్టోరేజీతో మిగిలి ఉంది. ఇందులో రోజుకు 168 మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్ నగరానికి సరఫరా చేస్తున్నారు.ఎనిమిదేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి అత్యవసర పంపింగ్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఎల్లంపల్లి నీటిని నగరంలో సరఫరా చేస్తున్నామని వాటర్ బోర్డు ఎండీ సుదర్శనరెడ్డి చెప్పారు. హైదరాబాద్ మహానగరంలోని మంచినీటి జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరా అధికారులకు సవాలుగా మారింది. ఒక్క ఏప్రిల్‌లోనే 2.37 లక్షల ట్రిప్పుల నీటి ట్యాంకర్ల ద్వారా నీరందించారు. ఈ రిజర్వాయర్ వద్ద పంపింగ్ చేసిన నీటిని ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, లింగంపల్లి, మియాపూర్,చందానగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.