ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం
సీఎం ఆదేశాల మేరకు చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మే నెల 5,6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా చర్చకు రెడీ అని చెప్పారు.;
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని, ఒక్క బస్సు కూడా రోడ్డుపైకి రాదని కార్మికులు ఇప్పటికే హెచ్చరించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మే 7 నుంచి సమ్మెకు దిగుతున్నామని ఇప్పటికే ప్రకటించారు. ఆ తేదీ దగ్గర పడుతుండటంతో తాజాగా సమ్మె వంటి ఆలోచనలు విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇప్పుడిప్పుడు తెలంగాణ ఆర్టీసీ గాడిన పడుతుందని, లాభాలను చూస్తోందని, ఇలాంటి సమయంలో సమ్మె సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. అయినా ఆర్టీసీ కార్మికులు వెనకడుగు వేయకపోవడంతో.. వారితో చర్చించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్ధమయ్యారు. తమ ప్రభుత్వం చర్చలు చేయడానికి రెడీగా ఉందని ప్రకటించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండు పరిసరాలను సందర్శించి, ప్రయాణికులతో ముచ్చటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మే నెల 5,6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా చర్చకు రెడీ అని చెప్పారు.
ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం కోసం తమ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని చెప్పారు. 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయిందన్నారు. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందని గుర్తుచేశారు. కార్మికులు కూడా ఇందుకు సహకరించాలని, సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం అనే మూడు ముఖ్య ఉద్దేశాల మీద సంస్థ నడుస్తుందని చెప్పారు.