SLBC టన్నెల్‌లో గల్లంతైన వారిని వెలికి తీస్తున్నాం
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ లో గల్లంతైన వారి మృతదేహాలను త్వరలో వెలికితీస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సాయంత్రం వెల్లడించారు.;
By : The Federal
Update: 2025-03-01 10:53 GMT
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ లో గల్లంతైన వారి మృతదేహాలను త్వరలో వెలికితీస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సాయంత్రం వెల్లడించారు. 24 అడుగుల మేర బురదలోపల మృతదేహాలు కూరుకుపోవడంతో వాటిని తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
రేపు రాత్రి వరకు నలుగురు కార్మికుల ఆచూకీ దొరికే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. టన్నెల్ వద్ద సహాయ చర్యలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి,విపత్తు సహాయ కమిషనర్ అర్వింద్ కుమార్ లు సమీక్షించిన తర్వాత మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. 24 అడుగుల మట్టి దిబ్బలో నాలుగు మృతదేహాలున్నట్లు స్కానింగ్ లో కనిపించిందని మంత్రి వివరించారు. టన్నెల్ లోపల మృతదేహాలను వెలికితీసేందుకు 11 విభాగాలకు చెందిన సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని మంత్రి జూపల్లి తెలిపారు.
‘‘మృతదేహాలున్న అనుమానిత ప్రాంతంలో 24 అడుగుల మేర బురద ఉంది.టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) మిషన్ కట్ చేయాల్సి వచ్చింది.నలుగురి ఆచూకీ ఉందని భావిస్తున్న చోట్ల తవ్వడం జరిగింది. రేపటి సాయంత్రం వరకు పూర్తవుతుంది’’అని జూపల్లి వివరించారు.
టీబీఎం కింద నలుగురి మృతదేహాలు
మిగతా నలుగురి ఆచూకీ టన్నెల్ బోరింగ్ మిషన్ అడుగున ఉండొచ్చని భావిస్తున్నామని మంత్రి జూపల్లి చెప్పారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం 11 కిలోమీటర్ల టన్నెల్ తవ్వారు... నేను అదే చెప్పిన.మిగతా 9 కిలోమీటర్ల ఎందుకు తవ్వలేదు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా 200కిలో మీటర్ల టన్నెల్ తవ్వినప్పుడు... పదేళ్లలో ఇక్కడ 9 కిలోమీటర్లు ఎందుకు తవ్వలేదు?అప్పుడే తవ్వితే ఈ సంఘటన జరగపోవు కదా’’ అని జూపల్లి చెప్పారు.తాను మొదటి రోజే టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులు బతికుండే అవకాశాలు చాలా చాలా తక్కువ అని చెప్పానని మంత్రి జూపల్లి చెప్పారు. పనులు తిరిగి ప్రారంభించినప్పుడు జీఎస్ఐ వాళ్ళు సర్వే చేశారని మంత్రి పేర్కొన్నారు.