‘దోషులపై జాలి చూపకూడదు’
సోషల్ మీడియా విషయంలో బాలల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి.;
బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియాను ఆసరగా చేసుకుని లైంగిక దాడులకు పాల్పడుతున్న కేసుల్లో దోషులపై జాలి చూపకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో “నిస్సహాయకులకు అండగా - లైంగిక దాడికి గురైన పిల్లల రక్షణ మరియు హక్కులు” అన్న అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సులో రేవంత్ పాల్గొన్నారు. బాలలకు వారి హక్కులపై అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
“పిల్లలపై జరుగుతున్న హేయమైన నేరాలను నియంత్రించడమే కాకుండా బాధితులకు చట్టపరంగా, నైతిక పరంగా మాత్రమే కాకుండా అన్ని రకాలుగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. వారి రక్షణ కోసం తెలంగాణలో భరోసా ప్రాజెక్టును చేపట్టాం. భరోసా ప్రాజెక్టు కింద ప్రస్తుతం 29 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా బాధితులకు పోలీసు సహకారమే కాకుండా న్యాయపరమైన, వైద్యపరమైన సహాయం అందించడంతో పాటు సానుకూల వాతావరణంలో వారికి అవసరమైన కౌన్సెలింగ్ వంటి సేవలను అందిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది. ఈ కోర్టుల ద్వారా కేసులను సత్వరం పరిష్కరించడమే కాకుండా పిల్లలకు సంపూర్ణ రక్షణ, వారిలో విశ్వాసం కల్పించడం, భవిష్యత్తులో వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో వీటిని ప్రారంభించాం’’ అని తెలిపారు.
‘‘పోక్సో చట్టం (POCSO Act), జువెనైల్ చట్టాల (Juvenile Justice Act) ఆచరణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించాలి. ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి వేదన కలిగించకుండా, వారి భవిష్యత్తుకు రక్షణగా సంపూర్ణ సహాయకారిగా ఉండాలి. న్యాయం కేవలం కోర్టుల్లోనే లభించాలనే కాకుండా, ఈ ప్రక్రియలో ప్రతి దశలోనూ వారికి అవసరమైన అండదండలు లభించాలి. పోలీస్ స్టేషన్, బాలల సంక్షేమ కేంద్రాలతో పాటు అన్ని దశల్లోనూ బాధితులకు న్యాయం దక్కాలి, రక్షణ కల్పించాలి. న్యాయం దక్కడం అంటే కేవలం దోషులకు శిక్షలు విధించడం వరకే సరిపోదు. బాధితుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. వారికి అవసరమైన రక్షణ, సమాజంలో తగిన గౌరవం కల్పించేలా చర్యలు ఉండాలి. వారి బాల్యాన్ని తిరిగి పొందేలా చర్యలు ఉండాలి. అత్యంత హేయమైన ఇలాంటి నేరాలను నియంత్రించడంలో న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, బాలల సంక్షేమ కమిటీలు, పౌర సమాజంలోని ఇతర భాగస్వామ్య సభ్యులందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం’’ అని పిలుపిచ్చారు. జరిగిన అన్యాయంపై తమ గొంతు వినిపించలేని వారికి అండగా నిలవాలన్న ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించడం ఎంతో అవసరమని, అందుకు న్యాయ వ్యవస్థ సభ్యులు, పోలీసు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, పౌర సమాజానికి అభినందనలు అని అన్నారు.