జల వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

Update: 2025-07-16 17:28 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న జల వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, బనకచర్లపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఏపీ కూడా ఓకే చెప్పిందని సీఎం వెల్లడించారు. చ‌ర్చ‌లు స‌హృద్భావ వాతావ‌ర‌ణంలో జ‌రిగాయ‌ని సీఎం తెలిపారు. సుహృద్భావం వాతావార‌ణం చెడిపోతే బాగుండున‌ని కొంత‌మందికి ఉంద‌ని... ఇరు రాష్ట్రాలు కొట్టుకుంటే త‌మ‌కు బాగుంటుంద‌ని వాళ్లు అనుకుంటున్నార‌ని... వారిని చూసి జాలిప‌డ‌డం త‌ప్ప ఏం చేయ‌లేమ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

జ‌ల్‌శ‌క్తి, ఇరు రాష్ట్రాల‌కు చెందిన అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల క‌మిటీ గోదావ‌రి, కృష్ణా న‌దుల నీటి కేటాయింపులు, దీర్ఘ‌కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న‌స‌మ‌స్య‌ల‌ను ఆ క‌మిటీ ప‌రిశీలించి చ‌ర్చిస్తుంద‌ని సీఎం వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత ఏ విధంగా ముందుకెళ్లాల‌నే దానిపై పైస్థాయిలో చ‌ర్చించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీఎం తెలిపారు. కృష్ణా న‌ది జ‌లాల్లో ఏ రాష్ట్రం ఎంతమేర నియోగించుకుంటున్న‌ద‌నే విష‌యంపై టెలీమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాల‌ని తాము ప్ర‌తిపాదించ‌గా... దానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంగీక‌రించిద‌న్నారు. ఈ ర‌కంగా ఒక స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించామ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ‌శైలం ప్రాజెక్టు భ‌ద్ర‌త‌కు సంబంధించి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ), ఇత‌ర సంస్థ‌లు తెలిపిన వివ‌రాల‌పై చ‌ర్చించి మ‌ర‌మ్మ‌తుల విష‌యాన్ని ప్ర‌స్తావించ‌గా.. మ‌ర‌మ్మ‌తులు చేపట్టేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంగీక‌రించింద‌ని సీఎం తెలిపారు.

ఆంధ్ర‌ప్రదేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం... త‌ర్వాత కాలంలో జ‌రిగిన అపెక్స్ క‌మిటీలో గోదావ‌రి న‌ది యాజ‌మాన్య బోర్డు, కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డు కార్యాల‌యాల‌ను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోటి ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నార‌ని.. గోదావ‌రి న‌దియాజ‌మాన్య బోర్డును తెలంగాణ‌లో, కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డును ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏర్పాటు చేయాల‌ని ఈ రోజు స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీఎం తెలిపారు. బ‌న‌క‌చ‌ర్ల‌కు సంబంధించి తాము చేసిన ఫిర్యాదుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోని సంస్థ‌లు స్పందించి అభ్యంత‌రాలు చెప్పినందున ఆ అంశ‌మే ప్ర‌స్తావ‌న‌కు రాలేద‌ని ఓ ప్ర‌శ్న‌కు ముఖ్య‌మంత్రి బ‌దులిచ్చారు. కేసీఆర్ తెలంగాణ హ‌క్కుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ధారాదాత్తం చేసి అన్యాయం చేశార‌ని.. వాటిని ప‌రిష్క‌రించ‌డానికి విధివిధానాల‌ను ముందుకు తీసుకువ‌చ్చామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చారు.

టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటు, శ్రీ‌శైలం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంగీక‌రించ‌డం తెలంగాణ విజ‌య‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప‌దేళ్లు అవ‌కాశం ఇచ్చినా వాళ్లు (బీఆర్ఎస్‌ను ఉద్దేశించి) ఏ స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌లేక‌పోయార‌ని.. వాళ్ల దుఃఖాన్ని, బాధ‌ను తాము అర్ధం చేసుకుంటామ‌ని సీఎం వ్యాఖ్యానించారు. వాళ్ల‌కు స‌మాధానం ఇవ్వ‌డానికి తాము లేమ‌ని, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు జవాబుదారీగా తామున్నామ‌ని.. ప‌రిపాల‌న ఎలా చేయాలో త‌మ‌కు తెలుస‌ని సీఎం తెలిపారు. వివాదాలు చెల‌రేగ‌కుండా స‌మ‌స్య‌ల‌ను శాశ్వ‌త ప‌రిష్కారం చూప‌డం త‌మ బాధ్య‌త‌ని సీఎం తెలిపారు. స‌మావేశంలో మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, అభిషేక్ మ‌ను సింఘ్వీ, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, కుందూరు ర‌ఘువీర్ రెడ్డి, రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి, డాక్ట‌ర్ క‌డియం కావ్య‌, సురేష్ షెట్కార్‌, గ‌డ్డం వంశీకృష్ణ‌, పోరిక బ‌ల‌రాం నాయ‌క్ పాల్గొన్నారు.

Tags:    

Similar News