అభయారణ్యాల్లో వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలేవి?
తెలంగాణలో అడవుల విస్తీర్ణంతోపాటు అభయారణ్యాలు, జాతీయ పార్కులు, మూడు జూపార్కులున్నా వన్యప్రాణుల పరిరక్షణకు మెరుగైన చర్యలు తీసుకోవడం లేదు.
By : Saleem Shaik
Update: 2024-10-11 13:34 GMT
అక్టోబరు 2వతేదీ నుంచి 8వతేదీ వరకు తెలంగాణలో వన్యప్రాణి సప్తాహం మొక్కుబడిగా చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు.
- అటవీ ప్రాంతమే కాకుండా వన్యప్రాణుల అభయారణ్యాలు అధికంగా ఉన్న తెలంగాణలో వన్యప్రాణుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయలేదు.
- తెలంగాణ రాష్ట్రంలో 2,939 వృక్ష జాతులు,365 పక్షి జాతులు,103 క్షీరద జాతులు,28 సరీసృపాలు,జంతుజాలం ఉన్నా వీటి సంరక్షణ చర్యలు, వన్యప్రాణుల పునరుత్పత్తి చర్యలు మాత్రం సజావుగా చేయడం లేదు.
అంతరించి పోతున్న పలు వన్యప్రాణులు
రాష్ట్రంలోని అభయారణ్యాల్లో ఉన్న పలు వన్యప్రాణులు సంరక్షణ, పునరుత్పత్తి లేక అంతరించిపోతున్నాయి.అభయారణ్యాల్లో పెద్ద పులులు, చిరుత పులులు,జింకలు, కృష్ణ జింకలు,అడవి పందులు, రాబందులు,మొసళ్లతోపాటు పలు వన్యప్రాణులు ఉన్నాయి.వన్యప్రాణుల పరిరక్షణ కోసం తెలంగాణ అటవీ శాఖ రక్షిత ప్రాంతాల నెట్‌వర్క్ పేరిట అభయారణ్యాలను ఏర్పాటు చేసింది, ఇందులో ఏడు వన్యప్రాణుల అభయారణ్యాలు,రెండు టైగర్ రిజర్వ్‌లు, మూడు జాతీయ ఉద్యానవనాలు, మూడు జూపార్కులు ఉన్నాయి.ఈ అడవుల్లో పలు వృక్షాలతోపాటు జంతుజాలం ఉంది. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం వన్యప్రాణి రక్షణ చట్టం 1972 అమలులో ఉన్నా అటవీ గ్రామాల్లో వన్యప్రాణుల వేట కొనసాగుతూనే ఉంది. వన్యప్రాణి సప్తాహంలోనే అమ్రాబాద్ అభయారణ్యంలో ఓ చిరుతపులి వేటగాళ్ల వేటుకు నేలకొరిగింది.
తెలంగాణలో 27 శాతం అడవులే...
తెలంగాణలోని భూమి విస్తీర్ణంలో 27 శాతం అడవులే. పన్నెండు అభయారణ్యాలు 7260 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మూడు జూలాజికల్ పార్కులు ఉన్నాయి, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్,హన్మకొండ కాకతీయ జూలాజికల్ పార్క్,మహబూబ్‌నగర్ పిల్లలమర్రి మినీ జూ పార్కులున్నాయి. నెహ్రూ జూపార్కులో ఏటా 30 లక్షల మంది సందర్శిస్తుంటారు. దేశంలోనే అత్యుత్తమ జూలలో ఒకటిగా నిలిచినా ఆశించిన మేర దీన్ని అభివృద్ధి చేయడం లేదు. సెంట్రల్ జూ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం హైడరాబాద్ జూపార్కును ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించాలని ప్రతిపాదించినా పనులు చేపట్టలేదు.అటవీ శాఖ ఆధీనంలో మూడు జింకల పార్కులు ఉన్నాయి.
అమ్రాబాద్, కవ్వాల టైగర్ రిజర్వ్
నాగర్ కర్నూల్, నల్గొండ, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలోని 4,626.83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమ్రాబాద్, కవ్వాల పులుల అభయారణ్యాలున్నాయి. ఈ రెండు అభయారణ్యాల్లో 3058.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కోర్ ఏరియా ఉంది. 1568.23 చదరపు కిలోమీటర్ల మేర అభయారణ్యం బఫర్ జోన్ ఉంది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పరిరక్షణ చర్యలేవి?
నల్లమల ఫారెస్ట్ ట్రాక్‌లో భాగమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేక స్థానిక జాతుల వృక్ష,జంతుజాలంతో గొప్ప జీవ వైవిధ్యం ఉన్నా, దీన్ని పరిరక్షించేందుకు మెరుగైన చర్యలు తీసుకోవడం లేదు.తెలంగాణలోని అమ్రాబాద్ అత్యధిక సంఖ్యలో పులులకు నిలయంగా ఉంది. లోతైన లోయలు, కనుమలు ఉన్న ఈ టైగర్ రిజర్వ్ కొండ భూభాగం, కృష్ణా నది పరివాహక ప్రాంతంగా ఉంది.1983వ సంవత్సరంలో అమ్రాబాద్ పులుల అభయారణ్యంగా ప్రకటించినా, దీనిలో వన్యప్రాణుల పరిరక్షణకు మెరుగైన చర్యలు తీసుకోవడం లేదని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ(హిటీకాస్) ఫౌండర్ ఇమ్రాన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.కుల్లంపెంట, పులిచింతల, గూళ్లపల్లి, బొమ్మనపెంట అటవీ గ్రామాలను పులుల కోసం తరలించాలని ప్రతిపాదించినా పునరావాసం చేపట్టలేదని ఆయన చెప్పారు. దేశంలోని 51 టైగర్ రిజర్వ్‌లలో మొత్తం వైశాల్యం ప్రకారం ఆరవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ అమ్రాబాద్ లో వన్యప్రాణుల పరిరక్షణ చర్యలు చేపట్టడం లేదని ఇమ్రాన్ చెప్పారు. వన్యప్రాణులపై ప్రజల్లో అవగాహన కల్పించి, వాటిని పరిరక్షించి, పునరుత్పత్తి చేసి జీవి వైవిధ్యాన్ని కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు సజావుగా పనిచేయడం లేదని ఇమ్రాన్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో వన్యప్రాణుల పరిరక్షణ చర్యలు సజావుగా సాగుతుండగా, తెలంగాణలో దీన్ని చిన్నచూపు చూస్తున్నారని ఇమ్రాన్ చెప్పారు.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో పులుల జాడేది?
తెలంగాణలోని పాత ఆదిలాబాద్ జిల్లా గోదావరి నది ఒక వైపు, మహారాష్ట్ర సరిహద్దులోని పెనుగంగా, ప్రాణహిత మధ్య ఉన్న కవ్వాల ప్రాంతాన్ని భారత ప్రభుత్వం 2012వ సంవత్సరంలో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించింది. దక్షిణం వైపు గలగల పారుతున్నగోదావరి, కడెం నదుల పరివాహక ప్రాంతంలో పులులను పరిరక్షించాలని అభయారణ్యంగా ప్రకటించినా దీనిలో ఒక్క పులి జాడ కూడా కనిపించడం లేదు.2015.44చదరపు కిలోమీటర్ల అటవీ కోర్ ఏరియాలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ విస్తరించి ఉంది.పులుల కోసం మైసంపూర్, రాంపూర్ గ్రామాలను ఖాళీ చేయించి వారికి పునరావాసం కల్పించినా పులుల పునరుత్పత్తి జాడ మాత్రం లేదు.
అభయారణ్యాల్లో వన్యప్రాణుల పునరుత్పత్తి చర్యలేవి?
తెలంగాణలో ప్రాణహిత, శివారం, ఏటూర్ నాగారం, పాఖాల్, కిన్నెరసాని, మంజీరా,పోచారం వన్యప్రాణుల అభయారణ్యాలున్నాయి. మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని అడవుల్లో పలు రకాల వన్యప్రాణులున్నాయి.వీటితోపాటు కాసు బ్రహ్మానందరెడ్డి, మృగవని, మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కులున్నాయి. ఈ జాతీయ పార్కుల్లోనూ నెమళ్లు, జింకలు ఇతర వన్యప్రాణులున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే 5,692.48 చదరపు కిలోమీటర్ల మేర వన్యప్రాణుల అరణ్యాలున్నాయి. ఉన్న అభయారణ్యాల్లో వన్యప్రాణుల పునరుత్పత్తి సజావుగా జరగడం లేదని వన్యప్రాణి ప్రేమికులు ఆరోపించారు.
మూడు జంతుప్రదర్శనశాలలున్నా...
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు, హన్మకొండ జిల్లాలో కాకతీయ జూపార్కు, మహబూబ్ నగర్ లోని పిల్లల మర్రి మినీ జూ పార్కులున్నాయి. జూపార్కులతో పాటు మేడ్చల్ లో జవహర్ లాల్ నెహ్రూ టూరిస్టు కాంప్లెక్స్,కొత్తగూడెంలో కిన్నెరసాని జింకల పార్కు, కరీంనగర్ లో ఎల్ఎండీ డీర్ పార్కులున్నాయి. వీటిని ఆధునీకరించి సందర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో అటవీశాఖ విఫలమైందని వన్యప్రాణుల ప్రేమికుడు, హిటీకాస్ ప్రాజెక్టు మేనేజరు వైభవ్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
కుచించుకు పోతున్న అడవులు
తెలంగాణలో వన్యప్రాణుల ఆవాసాలు కుంచించుకుపోవడం,వన్యప్రాణుల ఆవాసాలపై ఒత్తిడి కారణంగా మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణలు పెరుగుతున్నాయి.పోడు సేద్యం వల్ల అటవీ విస్తీర్ణం తగ్గుతోంది. వ్యవసాయం, ఉద్యానవన పంటలకు అడవి పందులు,కోతుల వల్ల నష్టం వాటిల్లుతుందని, వాటిని చంపేస్తున్నారు.
వేటగాళ్ల వేటుకు నేలకొరుగుతున్న వన్యప్రాణులు
అటవీ గ్రామాల్లో వేటగాళ్లు వలలు, ఉచ్చులు,విద్యుత్ వైర్లు,విషప్రయోగం, పేలుడు పదార్థాలు మొదలైన వాటిని ఉపయోగించి వన్యప్రాణులను చంపుతున్నారు. వేటగాళ్ల బారి నుంచి వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ సవాలుగా మారింది.వన్యప్రాణులను చంపడం,వేటాడే ప్రయత్నాలను నిరోధించడానికి గత ఏడాది డిసెంబరు 1వతేదీన చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ స్టేట్ వైడ్ ఇంటెన్సివ్ ప్రివెంటివ్ డ్రైవ్ క్యాచ్ ది ట్రాప్ కార్యక్రమాన్ని ప్రారంభించినా వేటకు తెరపడటం లేదు.