కమిషన్ నోటీసుపై కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది ?

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మీద ఆరోపణలు చేసినట్లుగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పై కేసీఆర్ ఆరోపణలు చేసేందుకు లేదు;

Update: 2025-05-21 10:53 GMT
KCR

ఇపుడీ విషయమే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణకు హాజరవ్వాలని పినాకి చంద్ర ఘోష్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీచేసింది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని కమిషన్ స్పష్టంగా చెప్పింది. కేసీఆర్(KCR) తో పాటు ఇరిగేషన్, ఆర్ధికశాఖల మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు(Harish), ఈటల రాజేందర్(Eetala Rajendar) ను కూడా జూన్ 6, 9వ తేదీన విచారణకు హాజరవ్వాలని నోటీసులిచ్చింది. నోటీసులు ఇవ్వటం, విచారణకు హాజరవ్వాలని ఆదేశించటం అంతా మామూలే. అయితే విచారణకు నోటీసులు అందుకున్న కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్.

కేసీఆర్ విచారణకు హాజరుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలపైన రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను నియమించింది. విచారణలో భాగంగా కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీచేసి విచారణకు రమ్మని చెప్పింది. అయితే కేసీఆర్ విచారణకు హాజరుకాకపోగా కమిషన్ పరిధినే ప్రశ్నిస్తు పెద్ద లేఖ రాశారు. కమిషన్ పనితీరు ఏకపక్షంగా ఉందని, తనను విచారించే అర్హత కమిషన్ కు లేదని చెప్పిన కేసీఆర్ అసలు కమిషన్ ఉనికినే ప్రశ్నిస్తు హైకోర్టులో పిటీషన్ వేశారు. కేసును విచారించిన హైకోర్టు కేసీఆర్ పిటీషన్ను కొట్టేసింది. దాంతో సుప్రింకోర్టులో కేసీఆర్ కేసు అప్పీల్ చేశారు. కేసును విచారించిన సుప్రింకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పనితీరుపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తంచేసింది. దాంతో జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా చేయగా తర్వాత జస్టిస్ మదన్ బీ లోకూర్ ను ప్రభుత్వం ఛైర్మన్ గా నియమించింది.

అప్పటి మాదిరిగానే ఇపుడు కూడా కేసీఆర్ కమిషన్ తీరును, తనను విచారించే అర్హత కమిషన్ కు ఉందా అనే విషయాలపై లేఖ రాస్తారా అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) కు పనితీరులో చాలా తేడాలున్నాయి. వీటిల్లో ముఖ్యమైనది ఏమిటంటే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ విచారణకు నోటీసు ఇవ్వకముందే మీడియాతో చాలాసార్లు మాట్లాడారు. మీడియా సమావేశాల్లో అనేకసార్లు కేసీఆర్ ను తప్పుపట్టారు. ఈ పాయింట్ నే నోటీసుకు రిప్లై ఇచ్చేటప్పుడు కేసీఆర్ ప్రస్తావించారు. ఇదే పాయింటును కేసీఆర్ సుప్రింకోర్టులో విచారణ సందర్భంగా కూడా లేవనెత్తారు. కేసీఆర్ వాదనతో సుప్రింకోర్టు కూడా ఏకీభవించింది. జస్టిస్ నరసింహారెడ్డి వైఖరిని సుప్రింకోర్టు తప్పుపట్టింది. దాంతో జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా చేశారు.

ఇక పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారాన్ని చూస్తే ఘోష్ ఇప్పటివరకు మీడియాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కమిషన్ విచారణకు హాజరైన వారితో మీడియా మాట్లాడి సొంతంగా కథనాలు రాసుకోవటమే కాని కమిషన్ పరంగా ఎవరూ అధికారికంగా మీడియాతో మాట్లాడలేదు. కాబట్టి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మీద ఆరోపణలు చేసినట్లుగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పై కేసీఆర్ ఆరోపణలు చేసేందుకు లేదు. అందుకనే తనకు అందిన నోటీసులపై కేసీఆర్ న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. విచారణకు హాజరయ్యే విషయమై మంగళవారం సాయంత్రం హరీష్ తో కేసీఆర్ చాలాసేపు మాట్లాడినట్లు సమాచారం.

విచారణ హాజరుపై సస్పెన్స్

కేసీఆర్ విచారణకు హాజరవ్వటానికే ఎక్కువ ఛాన్సుందని పార్టీవర్గాల సమాచారం. ఎందుకంటే ప్రాజెక్టుల(Kaleswaram Project) నిర్మాణంలో తాము ఎలాంటి తప్పుచేయలేదని మొదటినుండి కేసీఆర్, హరీష్ వాదిస్తున్నారు. ఎలాంటి తప్పుచేయకపోతే మరి మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Project) పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయని అడిగితే మాత్రం సమాధానం చెప్పటంలేదు. విచారణకు హాజరైనా కూడా కేసీఆర్ ఇదే వాదనను వినిపిస్తారు అనటంలో సందేహంలేదు. కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో ఏమి అడుగుతుంది అన్నదే ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే కమిషన్ విచారణకు హాజరైన సుమారు 110 మందిలో ఎక్కువమంది ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు జరిగాయని, అందుకు ప్రధాన బాధ్యులు అప్పటి పాలకులు మాత్రమే అని అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. పాలకులు అంటే కేసీఆర్ మాత్రమే అని అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణంలో ఏమి జరిగిందనే విషయంలో కమిషన్ దగ్గర పూర్తి సమాచారం ఉంది.

ఈవిషయం కేసీఆర్ కు కూడా బాగా తెలుసు. కాబట్టి విచారణకు హాజరై లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటం ఎందుకు అని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కమిషన్ ఏమి అడిగినా తాను చెప్పదలచుకున్నది కేసీఆర్ చెప్పేసి బయటకు వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తనకు అనారోగ్యంగా ఉందికాబట్టి డైరెక్టుగా విచారణకు హాజరుకాలేనని చెప్పి వర్చువల్ విచారణ చేయాలని కమిషన్ కు లేఖ రాసే అవకాశాలను కొట్టిపారేసేందుకు లేదని పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కమిషన్ కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే నిలబడే అవకాశం తక్కువని న్యాయ నిపుణులు సూచించారని పార్టీ నేతల టాక్. అందుకనే కమిషన్ విచారణ నుండి తప్పించుకున్నారనే నెగిటివ్ ప్రచారం జరిగే బదులు ధైర్యంగా ఎదుర్కొని పాజిటివ్ ప్రచారం చేసుకోవచ్చని కూడా ఆలోచిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులను మొదలుపెట్టినపుడు హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తే ఆర్ధికశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. 2018లో గెలిచిన తర్వాత ఇరిగేషన్ శాఖను కేసీఆర్ తన దగ్గరే ఉంచుకున్నారు. అప్పుడు ఆర్ధికశాఖకు మంత్రిగా హరీష్ వ్యవహరిస్తే, ఈటల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఈటలను మంత్రివర్గం నుండి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. కాబట్టే విచారణకు కేసీఆర్ తో పాటు హరీష్, ఈటలను కూడా హాజరవ్వాలని కమిషన్ నోటీసులు జారీచేసింది. ఇపుడు ఈటల బీజేపీ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆర్ధికమంత్రిగా తన పాత్ర ఏమిటనే విషయాన్ని కమిషన్ కు వివరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పట్లో తాను ఆర్ధికమంత్రిగా పనిచేసినా నిధుల విడుదలలో తన పాత్ర నామమాత్రమే అని సన్నిహితుల దగ్గర చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈటల సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లుగా ప్రచారంలో ఉన్న మాటనే అప్పటి అధికారులు, రిటైర్డ్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు కూడా కమిషన్ ముందు చెప్పినట్లు సమాచారం. తాము అధికారులుగా నామమాత్రంగా మాత్రమే ఉన్నామని ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం వ్యవహారమంతా కేసీఆర్, హరీషే చూసుకున్నట్లు విచారణలో పాల్గొన్న చాలామంది కమిషన్ కు చెప్పటమే కాకుండా అఫిడవిట్లు కూడా దాఖలుచేసినట్లు తెలుస్తోంది. కాబట్టి విచారణ తేదీకి ఇంకా సమయం ఉంది కాబట్టి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News