తెలంగాణ హెచ్చార్సీ నిండా పెండింగ్ కేసులే...
మానవ హక్కులంటే ఎంత చులకనో .... హెచ్చార్సీ ఛైర్మన్ ను నియమించేందుకు 16 నెలలు పట్టింది.;
By : Saleem Shaik
Update: 2025-04-18 08:23 GMT
తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ (Telangana Human Rights Commission)ఎట్టకేలకు కొలువుతీరింది. మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా ,రిటైర్డ్ సెలక్షన్ గ్రేడ్ జిల్లా జడ్జి శివాడి ప్రవీణ (జ్యుడీషియల్),రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బి కిషోర్ (నాన్-జ్యుడీషియల్) కూడా కమిషన్ సభ్యులుగా గురువారం బాధ్యతలు స్వీకరించారు.
పెండింగ్ ఫిర్యాదులపై విచారణ
తెలంగాణ హెచ్చార్సీ (Telangana HRC)పదవీ బాధ్యతలు స్వీకరించగానే పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను (Resolving Pending Cases)త్వరగా పరిష్కరించడంపై దృష్టి సారించింది. (Resolving Pending Cases)మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి సారించిన కమిషన్ 300 పరిష్కారం కాని కేసులను పరిష్కరించడానికి ఒక బెంచ్‌తో ప్రారంభించింది.జస్టిస్ అఖ్తర్, సభ్యులతో కలిసి పెండింగ్‌లో ఉన్న కేసులపై సత్వరమే విచారణ ప్రారంభించారు. రాష్ట్రంలో మానవ హక్కులకురక్షణ. ప్రోత్సాహాన్ని నిర్ధారించడం ద్వారా మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 లక్ష్యాలను సాధించడానికి కమిషన్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని హెచ్చార్సీ ఛైర్ పర్సన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
మానవ హక్కులను కాపాడుతాం : జస్టిస్ షమీమ్ అఖ్తర్
తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులను కాపాడటానికి హెచ్చార్సీ అంకితభావంతో పనిచేస్తుందని హెచ్చార్సీ ఛైర్ పర్సన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ చెప్పారు. కమిషన్ అలా బాధ్యతలు స్వీకరించగానే ఇలా 300 దీర్ఘకాలిక మానవ హక్కుల కేసులపై విచారణను వేగవంతం చేసింది.జస్టిస్ అక్తర్ నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన కమిషన్ సమయాన్ని వృథా చేయలేదు. తాము చేపట్టిన సత్వర విచారణ అపరిష్కృత ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడానికి, ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కమిషన్ అంకితభావాన్ని సూచిస్తుందని ఆయన చెప్పారు. కొత్తగా ఏర్పడిన కమిషన్ మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన 300 పాత కేసులను విచారించడానికి ఒక బెంచ్ సిట్టింగ్‌ను ఏర్పాటు చేసింది.
అరకొర ఉద్యోగులతో ఫిర్యాదుల పరిష్కారం ఎలా?
తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో అరకొర ఉద్యోగులతో మానవ హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. కమిషన్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు సెక్రటరీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉంది.కమిషన్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. మానవ హక్కుల కమిషన్ లో కీలకమైన రెండు పోస్టులు ఖాళీగా ఉండటం నిర్వహణ భారంగా మారింది. కమిషన్ లో కేవలం అసిస్టెంట్ జుడీషియల్ రిజిష్ట్రార్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు ఇద్దరే ఉన్నారు.
16 నెలలుగా మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్యలేవి?
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 16 నెలలుగా మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజలు ఫిర్యాదులు చేసినా వాటిపై చర్యలు తీసుకునే వారు కరువయ్యారు.2023వ సంవత్సరం డిసెంబరు 23వతేదీన హెచ్చార్సీ ఛైర్ పర్సన్ గా చంద్రయ్య పదవీ విరమణ చేశారు. నాటి నుంచి కమిషన్ ఖాళీగానే ఉంది. తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ గత 16 నెలలుగా ఖాళీగా ఉంది.టీజీహెచ్చార్సీ ఛైర్ పర్సన్, జుడీషియల్ మెంబర్, నాన్ జుడీషియల్ మెంబర్లు 16 నెలలుగా లేక పోవడంతో మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులు పేరుకు పోయాయి. కమిషన్ గృహకల్పలోని పురాతన భవనంలో అసౌకర్యాల మధ్య నడుస్తోంది. గత 16 నెలల పాటు తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణలు జరగలేదని మానవ హక్కుల సంఘం యాక్టివిస్టు పి అశోక్ కుమార్ చెప్పారు.
ఫిర్యాదులకు నంబరు వేసి ఉంచారు...
తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం హెచ్చార్సీ కమిషన్ ను నియమించక పోవడంతో గత 16 నెలలుగా వచ్చిన ఫిర్యాదులకు నంబరు వేసి విచారణ పెండింగులో ఉంచామని హెచ్చార్సీ జుడీషియల్ అసిస్టెంట్ రిజిష్ట్రార్ షహబుద్దీన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మానవ హక్కుల మానవ హక్కుల రక్షణ చట్టం 1993, సవరణ చట్టం 2006, 2019 యాక్ట్ ల ప్రకారం మానవ హక్కులను పరిరక్షించేందుకు కమిషన్ పనిచేయాలి. కానీ గత 16 నెలల కాలంలో కమిషన్ ఖాళీగా ఉండటంతో 28,500 ఫిర్యాదులు పేరుకుపోయాయి. న్యాయం కోసం హెచ్చార్సీకి బాధితులు పిటీషన్లు సమర్పించినా అవి పరిష్కారానికి నోచుకోలేదు.
జస్టిస్ చంద్రయ్య పదవీ విరమణతో ఖాళీగా...
2019వ సంవత్సరం వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే మానవ హక్కుల కమిషన్ పనిచేసింది. 2019వ సంవత్సరం డిసెంబరు నెలలో తెలంగాణ కమిషన్ ను ఏర్పాటు చేయడంతో అప్పుడు జస్టిస్ చంద్రయ్యను తెలంగాణ మొట్టమొదటి మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ గా, సభ్యులుగా మాజీ జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్ జ్యుడీషియల్ సభ్యుడిగా మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ నియమితులయ్యారు. వీరి పదవీ కాలం 2023 డిసెంబరు 22వతేదీన ముగిసింది.
ఫిర్యాదులు ఇలా...
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ ఫిర్యాదు చేయవచ్చు. ప్రజలే కాకుండా మానవ హక్కుల రక్షకులు, సంస్థలు కూడా కమిషన్ లో కేసులు వేస్తుంటాయి. మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కూడా కేసులను విచారణకు స్వీకరిస్తుంటాయి. ప్రజలు ఫిర్యాదు చేశాక తమ ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు. కానీ గత కొంత కాలంగా టీజీ హెచ్చార్సీ కమిషన్ వెబ్ సైట్ కూడా సజావుగా పనిచేయలేదు. ఇక నైనా కొత్త కమిషన్ ఏర్పాటైన నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేసి, పెండింగు కేసుల విచారణను సత్వరం పూర్తి చేయాలని న్యాయవాదులు కోరుతున్నారు.