తెలంగాణలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయ్యేదెన్నడు?

తెలంగాణలో పెండింగులో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు గళం విప్పారు. రైల్వే జీఎంను కలిసి సమస్యలను ప్రస్థావించారు.;

Update: 2025-04-24 02:54 GMT
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పిస్తున్న తెలంగాణ ఎంపీలు

సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, రైల్వే సమస్యలను తీర్చాలని కోరారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డిలు రైల్వే జీఎంను కలిసి తెలంగాణలోని రైల్వే సమస్యలను తీర్చాలని కోరారు.


యాదగిరిగుట్ట వరకు ఎంఎంటిఎస్ రైలు నడపండి
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని హైదరాబాద్ నుంచి రాయగిరి(యాదగిరిగుట్ట)వరకు ఎంఎంటిఎస్ రైలు కొసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పిస్తానని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జీఎంకు చెప్పారు.యాదగిరిగుట్ట వరకు ఎంఎంటిఎస్ రైలు నడిపితే తెలంగాణ తిరుపతి అయిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు, హైదరాబాద్ కు అప్ అండ్ డౌన్ చేసే కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చామల పేర్కొన్నారు.


కాజీపేట జంక్షన్ సమస్యలు తీర్చండి

కాజీపేట జంక్షన్ ప్రాధాన్యాన్ని తగ్గించకుండా చూడాలని, కాజీపేట లోకో రన్నింగ్ డిపో సిబ్బందిని విజయవాడ డిపోకు బదిలీ చేయవద్దని ఎంపీ కడియం కావ్య జీఎంను కోరారు. అమృత్ భారత్ పథకం కింద కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఎంపీ సూచించారు. కాజీపేటలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.



 రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయండి

భువనగిరి, ఆలేరు, జనగాం, రామన్నపేటలో రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఎంపీలు కోరారు. రైళ్ల రాకపోకల సమయాలు మార్పు , అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణాల కోసం ఇటీవల తాను పార్లమెంటులో ప్రస్తావించానని ఎంపీ చామల చెప్పారు. తెలంగాణ రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాము కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలిశానని తెలిపారు. రైల్వే సమస్యలపై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ తో కులంకషంగా చర్చించి వెంటనే పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జీఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు.

ఎన్నెన్నో పెండింగ్ ప్రాజెక్టులు

- హైదరాబాద్- యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు నడపడానికి నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ ఎంపీలు కోరారు. హసన్ పర్తి- కరీంనగర్ రైల్వే లైన్ నిర్మించాలని ఎంపీలు డిమాండ్ చేశారు.
- హైదరాబాద్ నుంచి బెంగళూరు, కుక్కే సుబ్రహ్మణ్య స్టేషన్ల మీదుగా మంగళూరు సూపర్ ఫాస్ట్ రైలు నడిపించాలని సూచించారు. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కృష్ణా వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని కోరారు.
- తెలంగాణలో నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజనల్ రింగ్ రైల్వే లైన్ నిర్మించాలని కోరారు.సికింద్రాబాద్- కాజీపేట మూడో రైల్వేలైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. శంషాబాద్-విజయవాడకు హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు నిర్మించాలని సూచించారు.
- తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్రాలైన ములుగు, నిర్మల్, భూపాలపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తిలకు రైలు మార్గం లేదని ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మేడారం, రామప్ప, భద్రాచలంలకు రైలు మార్గాలు నిర్మించాలని కోరారు.
- హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు విస్తరణ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని ఎంపీలు కోరారు.వికారాబాద్ -తాండూర్ మార్గంలోని గంగారం, రామయ్యగూడ, ధారూర్, తరిగోపుల, మర్పల్లి, మొరంగపల్లి, గేటువనంపల్లి, బషీరాబాద్ ప్రాంతాల్లో రైల్వే వంతెనలు నిర్మించాలని కోరారు.
- ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు కొత్త రైల్వే లైను నిర్మించాలని కోరారు. హైదరాబాద్ మెట్రోను పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు పొడిగించాలని సూచించారు.


Tags:    

Similar News