రేవంత్ కు టాలీవుడ్ తో ఎక్కడ చెడింది ?
రోజురోజుకు రేవంత్ రెడ్డికి తెలుగుసినీ రంగంతో గ్యాప్ బాగా పెరిగిపోతోంది;
ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య జరగకూడని వ్యవహారాలన్నీ జరిగిపోతున్నాయి. రోజురోజుకు రేవంత్ రెడ్డికి తెలుగుసినీ రంగంతో గ్యాప్ బాగా పెరిగిపోతోంది. తొందరలో విడుదలవ్వబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ పాటల స్టెప్పులు అసభ్యకరమైన భంగిమల్లో ఉన్నాయని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ళ శారద చేసిన వ్యాఖ్యలు, అభ్యంతరాలు వైరల్ గా మారాయి. దాంతో రేవంత్(Revanth) ప్రభుత్వానికి టాలీవుడ్(Tollywood) కు మధ్య ఏమి జరుగుతోందనే చర్చ పెరిగిపోతోంది. ఈచర్చ జరగటానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అవేమిటంటే అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చేయటం, కేటీఆర్-సమంత గురించి మంత్రి ఘోరమైన వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాలు, పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, అల్లుఅర్జున్ అరెస్టు లాంటి నేపధ్యాలున్నాయి కాబట్టే రేవంత్-తెలుగుసినిమా ఇండస్ట్రీ మధ్య సంబంధాలు బాగా క్షీణించిపోయాయనే చర్చ పెరిగిపోతోంది.
మొదటగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలగురించి మాట్లాడుకుందాము. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నాగార్జున మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువును ఆక్రమించి కట్టారు. ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్)లో కట్టిన కన్వెన్షన్ సెంటర్ పై ఆరోపణలు వస్తే బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం సర్వేచేయించి చెరువు ఆక్రమణ నిజమే అని అధికారులు తేల్చారు. ఆక్రమించిన భాగాన్ని కూల్చేందుకు ప్రభుత్వయంత్రాంగం జేసీబీలు, బుల్డోజర్లను తీసుకుని వెళ్ళింది. అయితే తెరవెనుక ఏమిజరిగిందో తెలీదుకాని ఎలాంటి కూల్చివేతలు జరగకుండానే జేసీబీలు, బుల్డోజర్లు వెనక్కు వెళ్ళిపోయాయి. ఆ తర్వాత రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆక్రమణల తొలగింపు, జలవనరుల పరిరక్షణకు హైడ్రా అనే వ్యవస్ధను ఏర్పాటుచేశారు. ఈ హైడ్రా తన మొదటిచర్యనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో మొదలుపెట్టింది.
చెరువును ఆక్రమించి నిర్మించిన సెంటర్ ను హైడ్రా కూల్చివేస్తే టాలీవుడ్ మొత్తం నాగార్జునకు మద్దతుగా నిలబడింది. రేవంత్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడకపోయినా సినీపెద్దలంతా నాగార్జునకు మద్దతుగా నిలబడ్డారు. తెలుగు సినీమా ఇండస్ట్రీకి రేవంత్ కు మధ్య గ్యాప్ మొదలైంది సెంటర్ కూల్చివేతతోనే. ఆ తర్వాత నంది అవార్డుల స్ధానంలో గద్దర్ అవార్డులను ఇవ్వబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. గద్దర్ అవార్డుల ప్రకటనపై అభిప్రాయాలు చెప్పాలని రేవంత్ సినీపెద్దలను కోరారు. అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా అధికారికంగా స్పందించలేదు. అంటే గద్దర్ అవార్డులు ఇవ్వాలన్న రేవంత్ అభిప్రాయాన్ని సినీపెద్దలు అసలు పట్టించుకోనేలేదు అనే ప్రచారం బాగా జరిగింది. ఈ విషయంలో రేవంత్ కు బాగా మండింది. తెలుగుసినిమా అవార్డులకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను తెలుగుసినీమా పెద్దలు పట్టించుకోలేదంటే ప్రభుత్వానికి మండకుండా ఎలాగుంటుంది. దీనికంటే ముందు రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభినందిస్తు సినిమా ఇండస్ట్రీ నుండి అధికారికంగా ఒక్క అభినందన కూడా రాలేదు.
ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంది అన్నదానితో సంబంధంలేకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వారిని సినీ ఇండస్ట్రీ పెద్దలు కలిసి అభినందించటం ఆనవాయితి. అలాగే సినిమాటోగ్రఫి శాఖ మంత్రిని కూడా కలిసి పెద్దలు అభినందిస్తారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ప్రతిరోజు ప్రభుత్వంతో అనేక అవసరాలుంటాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని సినీఇండస్ట్రి పెద్దలు ప్రభుత్వంతో మంచిసంబంధాలనే నెరుపుతారు. అయితే ఈ పద్దతి రేవంత్ విషయంలో కనబడలేదు. ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య గ్యాప్ కు భీజం ఇక్కడే పడింది. తర్వాత అనేక కారణాలతో గ్యాప్ బాగా పెరిగిపోయింది.
ఈ విషయాన్ని వదిలేస్తే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను సినీపెద్దలు మరచిపోకముందే మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు ప్రభుత్వానికి మధ్య గొడవల్లో ఎలాంటి సంబంధంలేని సమంత(Samantha)ను కొండాసురేఖ లాగారు. కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తనదగ్గరకు పంపాలని నాగార్జునను కేటీఆర్ ఒత్తిడి చేశాడని మంత్రి పెద్ద బాంబుపేల్చారు. ఆక్రమణ అని తెలిసినా బీఆర్ఎస్ హయాంలో సెంటర్ ను కూల్చకపోవటానికి కారణం ఇదేనని మంత్రి తేల్చేశారు. దాంతో టాలీవుడ్ అట్టుడికిపోయింది. సినీరంగంలోని పెద్దలంతా నాగార్జునకు మద్దతుగా ఏకమవ్వటమే కాకుండా మంత్రిపై మండిపోయారు. సినీపెద్దలకు మంత్రికి మధ్య రెండురోజులు బాగా గొడవలు జరిగాయి. మంత్రి వ్యాఖ్యలు, ఆరోపణలకు రేవంత్ కు ఎలాంటి సంబంధంలేదు. అయినా సరే రేవంతే వెనకుండి మంత్రితో ఆరోపణలు చేయించారని అప్పట్లో ప్రచారం జరిగింది.
తర్వాత పుష్ప-2(Pushpa2) సినిమా రిలీజ్ సమయంలో జరిగిన ఘటనతో రేవంత్-ఇండస్ట్రీ మధ్య సంబంధాలు దాదాపు దెబ్బతినేశాయి. పుష్ప రిలీజ్ సందర్భంగా ధియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ స్పృహతప్పిపోయాడు. ఆసుపత్రిలో చేర్చటమే కోమా స్టేజిలో చేరాడు. అప్పటినుండి ఇప్పటికీ శ్రీతేజ ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఘటనకు అల్లుఅర్జునే(Allu Arjun) కారణమని కేసు నమోదుచేసిన పోలీసులు తర్వాత అరెస్టు కూడా చేశారు. అల్లు అర్జున్ అరెస్టుతో యావత్ ఇండస్ట్రీ అంతా గగ్గోలు పెట్టేసింది. తొక్కిసలాట, అర్జున్ అరెస్టుపై సినీపెద్దలు రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు కాని బెయిల్ పై చంచల్ గూడ జైలునుండి ఇంటికి చేరుకున్న అర్జున్ కు మద్దతుగా నిలిచారు. మద్దతు ప్రకటన కూడా ఎలాగుందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినీపెద్దల బలప్రదర్శనా అన్నట్లుగా సాగింది. రెండురోజుల పాటు అర్జున్ ఇంటికి సినీపెద్దలు ఒకరితర్వాత మరొకరు వెళ్ళటం, సంఘీభావం తెలపడాన్ని లైవ్ రిలేలో చూపించారు. ఈ ప్రహసనం అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినీ ఇండస్ట్రీ బలప్రదర్శనే అన్నట్లుగా ప్రచారం జరిగింది.
తర్వాత అసెంబ్లీలో ఘటనపై రేవంత్ మాట్లాడుతు సినీఇండస్ట్రీని డైరెక్టుగా ఎటాక్ చేశాడు. తొక్కిసలాటకు అల్లుఅర్జునే కారణమని రేవంత్ ప్రకటించటం సంచలనమైంది. ఈ నేపధ్యంలోనే తాను సీఎంగా ఉన్నంతకాలం బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉండదని రేవంత్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపు లేకపోతే నిర్మాతలపై దెబ్బపడటం ఖాయం. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్ దిల్ రాజ్(Dil Raju) ను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎప్డీసీ) ఛైర్మన్ గా నియమించింది. దాంతో ప్రభుత్వానికి ఇండస్ట్రీకి దిల్ రాజ్ సయోధ్య చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే దిల్ రాజ్ ను ముందుపెట్టి సినిమా పెద్దలు రేవంత్ తో రాజీప్రయత్నాలు మొదలుపెట్టారు. దిల్ రాజ్ చొరవతో రేవంత్-సినిమా పెద్దల మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగు తర్వాత ప్రభుత్వానికి సిని ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ తగ్గిపోయిందని సినీపెద్దలు బహిరంగంగానే ప్రకటించారు. అంతా సద్దుమణిగింది ఆల్ హ్యపీస్ అనుకుంటున్న సమయంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శారద ఇచ్చిన వార్నింగ్ తో సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందా అనే ప్రచారం మొదలైపోయింది.
ఇంతకీ శారద ఏమన్నారంటే తొందరలోనే రిలీజ్ అవ్వబోయే ఒక సినిమాలో హీరోయిన పాటల భంగిమలను దృష్టిలో పెట్టుకుని ఛైర్ పర్సన్ కామెంట్ చేశారు. కొన్ని తెలుగుసినిమా పాటల్లో హీరోయిన్లను చాలా వాల్గర్ గా చూపిస్తున్నట్లు మండిపోయారు. డ్యాన్స్ మాస్టర్లు, డైరెక్టర్లు అందరికీ ఇందులో భాగముందని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఛైర్ పర్సన్ వార్నింగుతో రేవంత్-ఇండస్ట్రీ మధ్య గొడవలు పూర్తిగా చల్లారకుండా నివురుగప్పిన నిప్పులా మండుతునే ఉందనే విషయం బయటపడింది.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపధ్యం ఇదేనా ?
రేవంత్ కు సినీ ఇండస్ట్రీకి మధ్య పైకి చూసినపుడు వివాదం రేగటానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ విషయంలో రేవంత్ ఎప్పుడూ, ఏ సందర్భంలో కూడా జోక్యం చేసుకున్నట్లు లేదు. పైగా చాలాకాలం రేవంత్ టీడీపీ(TDP)లో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీని ఏర్పాటుచేసిందే నటరత్న, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్(NTR) కాబట్టి టీడీపీ అంటేనే సినిమా వాళ్ళ పార్టీగా ముద్రపడింది. దానికి తగ్గట్లే టీడీపీలో ఉన్నపుడు చాలామంది సినిమా పెద్దలతో రేవంత్ కు మంచి సంబంధాలు ఉండేవి. అంతాబాగానే ఉంది మరి ఇండస్ట్రీతో రేవంత్ కు ఎక్కడ చెడింది ? ఎక్కడంటే రాష్ట్రం విడిపోయిన తర్వాతే అని సమాచారం. ఎలాగంటే మొదటినుండి అక్కినేని కుటుంబం టీడీపీకి చాలా దూరం. సినీప్రముఖుల్లో చాలామందికి ఏదోరూపంలో టీడీపీతో లేదా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)తో మంచి సంబంధాలే ఉండేవి. అయితే అక్కినేని కుటుంబం మాత్రం చాలాదూరంగా ఉండిపోయింది. నాగార్జునకు వ్యక్తిగతంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్(YSR) తో మంచి సంబంధాలుండేవి. అవేసంబంధాలు వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS JaganMohan Reddy)తో కూడా కంటిన్యు అవుతున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత నాగార్జున కుటంబం కేసీఆర్(KCR) తో కూడా మంచి సంబంధాలే మైన్ టైన్ చేసింది. ఏదో సందర్భంలో కేసీఆర్ లేదా కేటీఆర్ తో నాగార్జున కుటుంబం కలుస్తునే ఉండేది. ఈ నేపధ్యంలోనే నాగార్జున కోడలైన సమంత రుత్ ప్రభును చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు కేటీఆర్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును నాగార్జున కుటుంబం కలవలేదు. అలాగే 2023లో సీఎం అయిన రేవంత్ ను కూడా నాగార్జున కలవలేదు. ఆ కోపం చంద్రబాబుతో పాటు రేవంత్ లో కూడా ఉందనే ప్రచారం తెలిసిందే. తనను నాగార్జున ఫ్యామిలీ దూరంగా ఉంచిందన్న కోపం చంద్రబాబులో పేరుకుపోయిందట. ఆ కోపాన్ని మనసులోఉంచుకునే సీఎం కాగానే రేవంత్ తో చెప్పి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను చంద్రబాబు కూల్చివేయించారనే ప్రచారం కూడా బాగా జరిగింది. కారణాలు ఏవైనా రేవంత్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య సంబంధాలు అయితే సరిగాలేవన్న విషయం మాత్రం వాస్తవం.
సినీ పెద్దలు పట్టించుకోలేదు
రేవంత్ సీఎం అవ్వగానే సినీపెద్దలు వెళ్ళి కలవలేదని ప్రముఖ సినీ క్రిటిక్ జోశ్యుల సూర్యప్రకాష్ చెప్పారు. కేసీఆర్ సీఎం అయినపుడు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినపుడు చాలామంది ప్రముఖులు వెళ్ళి కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. తనను సినీపరిశ్రమ పెద్దలు వచ్చి కలవలేదన్న బాధ రేవంత్ లో ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సమస్యంతా ఇక్కడే మొదలైందన్నారు. ఇదే సమయంలోతమను భయపెట్టడాన్ని సినీప్రముఖులు కూడా ఇష్టపడరన్నారు. దీనికి ఉదాహరణగా పుష్ప-2 రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట, అల్లుఅర్జున పై కేసు, అరెస్టుతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు చెప్పారు. అల్లుఅర్జున్ మీద కేసు, అరెస్టు చేయాల్సిన అవసరంలేకపోయినా అరెస్టు చేసి జైలులో పెట్టడాన్ని సినీ పెద్దలు తమను భయపెడుతున్నట్లుగా ఫీలయ్యారని చెప్పారు. సినీపరిశ్రమ పెద్దలతో రేవంత్ కు ప్రత్యక్షంగా ఎలాంటి గొడవలు లేకపోయినా సంబంధాలు అయితే మంచిగా లేవన్నది నిజమే అని అంగీకరించారు.