కవిత వల్ల లాభం ఎవరికి ? నష్టం ఎవరికి ? ఓ విశ్లేషణ
రాజకీయాల్లో కవితకు ఈపాటి గుర్తింపు దక్కిందంటే అది కేసీఆర్ కూతురవ్వటం వల్లనే కాని ఆమె సొంతంగా సంపాదించుకున్నది ఏమీలేదు;
తెలంగాణ రాజకీయాలు గడచిన ఐదురోజులుగా కల్వకుంట్ల కవిత చుట్టే పరిభ్రమిస్తున్నాయి. కవిత తొందరలో కొత్తపార్టీ పెడతారని కొందరు చెబుతున్నారు. లేదు లేదు ఆమెకంత సీన్ లేదు ఏదో స్ధాయిలో మళ్ళీ తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) తో అడ్జస్టయిపోతారని మరికొందరు వాదిస్తున్నారు. జరుగుతున్న ప్రచారం, వాద-ప్రతివాదనలను కాసేపు పక్కనపెట్టేద్దాం. అసలు కవిత(Kavitha)కు ఉన్న కెపాసిటి ఎంత ? కవిత వల్ల లాభం ఎవరికి ? నష్టం ఎవరికి ? అన్న పాయింట్లను డిస్కస్ చేద్దాం.
ముందుగా కవిత కెపాసిటి ఏమిటనేది విశ్లేషిద్దాము. కవితకు సొంత గుర్తింపంటు లేదన్నది వాస్తవం. మైనస్ కేసీఆర్..కవిత జీరో అని అంగీకరించాల్సిందే. తెలంగాణ(Telangana) రాజకీయాల్లో కవితకు ఈపాటి గుర్తింపు దక్కిందంటే అది కేసీఆర్ కూతురవ్వటం వల్లనే కాని ఆమె సొంతంగా సంపాదించుకున్నది ఏమీలేదు. పార్టీకి ఆమె ఉపయోగపడకపోగా ఒకరకంగా నష్టమే చేశారు. ఎలాగంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పీకల్లోతు ఇరుక్కోవటం ద్వారా. బీఆర్ఎస్-బీజేపీ మధ్య అవగాహన ఉందికాబట్టే దర్యాప్తుసంస్ధలు ఈడీ, సీబీఐ కవితను అరెస్టుచేయటంలేదు అన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి(Rahul Gandhi), రేవంత్ రెడ్డి(Revanth) ఆరోపణలు జనాల మీద బాగా ప్రభావంచూపాయి. తమ శీలరీక్షను రుజువుచేసేందుకా అన్నట్లుగా కవితను 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు మార్చి 15వ తేదీన ఈడీ అరెస్టుచేసింది.
కాంగ్రెస్ ఆరోపణలను జనాలు నమ్మారు
కాంగ్రెస్ ఆరోపణలు నిజమే అని జనాలు నమ్మటంవల్ల పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పూర్తిగాను, బీజేపీ పాక్షికంగను నష్టపోవాల్సొచ్చింది. పోటీచేసిన 17 సీట్లలో బీఆర్ఎస్ ఒక్కదానిలో కూడా గెలవలేదు. బీజేపీ 8 సీట్లను గెలుచుకున్నది. పై రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందో లేదో బయటకు తెలీదు కాని ఉందన్న కాంగ్రెస్ ప్రచారం వల్ల బీఆర్ఎస్ నూరుశాతం నష్టపోయింది. దీన్నిబట్టి అర్ధమైంది ఏమిటంటే కవిత వల్ల బీఆర్ఎస్ కు నష్టమే కాని ఎలాంటి ఉపయోగంలేదని. లిక్కర్ స్కామ్(Delhi liquor scam) అరెస్టయిన కవిత ఆరుమాసాల తర్వాత బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. కాబట్టి రేపు ఏ ఎన్నికలు జరిగినా పార్టీ తరపున కవిత ప్రచారంచేస్తే కాంగ్రెస్, బీజేపీలు(BJP) లిక్కర్ స్కామ్ నే ప్రధాన ఆయుధంగా ప్రయోగిస్తాయి. అప్పుడు కూడా కవిత వల్ల పార్టీకి నష్టమే జరుగుతుంది.
ఈ విషయాలన్నింటినీ ఆలోచించే కూతురును కేసీఆర్ దూరంగా ఉంచుతున్నట్లున్నారు. కవితలో ఇన్ని మైనస్సులుండగా కొడుకు కేటీఆర్ తో సమానంగా పార్టీలో హోదా ఇవ్వటం ఎలాగ సాధ్యం. అయితే ఈ విషయాలేవీ కవిత ఆలోచిస్తున్నట్లు లేదు. అందుకనే పార్టీలో హోదా కోసం సోదరుడితో పోరాడుతున్నారు.
కాంగ్రెస్ తో సాధ్యమేనా ?
బీఆర్ఎస్ విషయాన్ని పక్కనపెట్టేస్తే కాంగ్రెస్ విషయం చూద్దాం. కవితను అర్జంటుగా పార్టీలో చేర్చుకోవాల్సినంత అవసరం కాంగ్రెస్ కు లేదు. ఎందుకంటే కవితవల్ల కాంగ్రెస్ కు లాభంకన్నా నష్టమే ఎక్కువ. కారణం ఏమిటంటే మళ్ళీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవటమే. స్కామ్ లో ఇరుక్కున్న కవిత బెయిల్ రద్దుచేయాలని ఈడీ(ED) గనుక కోర్టులో అఫిడవిట్ దాఖలుచేసి సక్సెస్ అయితే మళ్ళీ కవిత తీహార్ జైలుకు వెళ్ళాల్సిందే. ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో కవిత-కాంగ్రెస్ కలిస్తే బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా ? వెంటనే ఈడీ, సీబీఐలను రంగంలోకి దింపి కవిత బెయిల్ రద్దుచేయించే అవకాశాలున్నాయి. కాబట్టి అనవసరంగా కవిత దగ్గరైతే నష్టమే తప్ప లాభం లేదని కాంగ్రెస్ కు అంతమాత్రం తెలీదా ?
బీజేపీతో కుదురుతుందా ?
ఇక ఫైనల్ గా బీజేపీ విషయం చూస్తే లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టుచేయించిందే బీజేపీ అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ మళ్ళీ అదే కవితను ఏరూపంలో దగ్గరకు తీసుకుంటుంది. ఏరూపంలో దగ్గరకు తీసుకున్నా కవిత వల్ల కమలంపార్టీకి నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. కవితను పార్టీలో చేర్చుకున్నా, లేదా అవగాహన కుదుర్చుకున్నా కవితకున్న మైనస్ ను బీజేపీ కూడా మోయాల్సిందే. అందుకనే బీజేపీ-కవిత దగ్గరయ్యే అవకాశంలేదు. ఒకవేళ ఏదో రూపంలో బీజేపీ-కవిత దగ్గరైతే వెంటనే ఏదోరూపంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ దగ్గరయ్యే అవకాశాలను కొట్టిపారేసేందుకు లేదు.
సో, ఏ కోణంలో చూసినా కవిత వల్ల సొంతపార్టీకే కాదు కాంగ్రెస్, బీజేపీకి కూడా ఎలాంటి ఉపయోగంలేదని అర్ధమవుతోంది.కాబట్టి కవిత సొంతపార్టీ అన్నది కేవలం నాలుగురోజుల ముచ్చటగానే మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయాల్లో రాణించాలంటే క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటి అన్నది చాలా ముఖ్యం. జనాలను సమ్మోహితులను చేసి ఆకర్షించేంత శక్తి ఉన్నపుడే రాజకీయాల్లో నేతలు రాణించగలరు. సమ్మోహన్ శక్తి అన్నది కొందరికి రాష్ట్రస్ధాయిలో ఉంటే మరికొందరికి నియోజకవర్గాల స్ధాయిలో ఉంటుంది. ఆ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటి అన్నది కవితలో ఎక్కడా కనబడటంలేదు. కవితకు ఎన్ని కెపాసిటీలు ఉన్నా అతిపెద్ద మైనస్ పాయింట్ లిక్కర్ స్కామ్ ఒక్కటిచాలు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కవితకు ‘లిక్కర్ రాణి’ (Liquor Queen)అనే పేరు పాపులరైపోయింది. లిక్కర్ స్కామ్ లో నుండి బయటపడేంతవరకు కవిత ఎన్నిమాటలు చెప్పినా ఏమీ ఉపయోగం ఉండదు. మనం చెప్పుకున్న ప్రాబబులిటీస్ అన్నీ లాజికల్ గా మాత్రమే గ్రహస్ధితి మనకు తెలీదు.