కొండా అసలు టార్గెట్ ఎవరు ?
మంత్రి కొండా సురేఖ అసలు టార్గెట్ ఎవరు ? ఇపుడీ ప్రశ్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మంత్రి కొండా సురేఖ అసలు టార్గెట్ ఎవరు ? ఇపుడీ ప్రశ్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన మంత్రి సమంత-నాగచైతన్య విడాకులకు అసలు కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే అని ఆరోపించిన విషయం తెలిసిందే. కేటీఆర్ ఏ విధంగా కారణమో కూడా మంత్రి వివరించారు. మంత్రి చేసిన ఆరోపణలు, చెప్పిన విషయాలపై ఇటు సొంతపార్టీ నేతలతో పాటు సినీరంగంలోని ప్రముఖులు కూడా భగ్గుమంటున్నారు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా సినీప్రముఖుల్లో చాలామంది అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి మద్దతుగా నిలబడటమే కాకుండా మంత్రిని వాయించిపడేస్తున్నారు.
కొండా వ్యాఖ్యలు, ఆరోపణలపై అక్కినేని నాగార్జున క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటు నాంపల్లి కోర్టులో కేసు వేశారు. అలాగే కేటీఆర్ కూడా సురేఖకు లీగల్ నోటీసు పంపారు. లీగల్ నోటీసులు, కోర్టులో కేసులు ఏమవుతాయన్నది పక్కనపెట్టేస్తే అసలు మంత్రి టార్గెట్ ఎవరు ? అన్న విషయంపై ఇపుడు పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మంత్రి చేసిన ఆరోపణలను జాగ్రత్తగా గమనిస్తే జరిగిన డ్యామేజి మొత్తం నాగార్జున, నాగ చైతన్య, కేటీఆర్ కు మాత్రమే అని అర్ధమవుతోంది. సమంత గురించి మంత్రి ఎక్కడా డ్యామేజింగుగా మాట్లాడలేదు. నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనే కమర్షియల్ ప్రాపర్టీ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
మంత్రి ఆరోపణల ప్రకారం ఆ సెంటర్ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపమని నాగార్జునను కేటీఆర్ అడిగారు. విషయం మొత్తాన్ని వివరించిన తర్వాత కేటీఆర్ దగ్గరకు సమంతను ఒకసారి వెళ్ళమని నాగార్జున, చైతన్య చెప్పినట్లు మంత్రి ఆరోపించారు. అందుకు సమంత అంగీకరించకపోవటంతో బాగా ఒత్తిడిచేశారట. దాంతో వాళ్ళకు సమంత ఎదురుతిరగటంతో గొడవలై ఇంట్లోనుండి బయటకు వెళ్ళిపొమ్మని చెప్పినట్లు మంత్రి చెప్పారు. అప్పుడు వేరేదారిలేక సమంత ఇంటినుండి బయటకు వచ్చేసినట్లు, తర్వాత సమంత-చైతన్యలు విడాకులు తీసుకున్నట్లుగా మంత్రి చెప్పారు. తాను ఇపుడు చెప్పిన విషయం బహిరంగ రహస్యమని సినీఫీల్డులోని చాలామందికి ఈ విషయం ఎప్పుడో తెలుసని కూడా మంత్రి చెప్పారు.
మంత్రి చెప్పిన మాటలు, చేసిన ఆరోపణలను జాగ్రత్తగా గమనిస్తే నాగార్జున, చైతన్య క్యారెక్టర్ బాగా డ్యామేజి అయ్యింది. తనను తాను కాపాడుకోవటానికి మామగారు నాగార్జునతో పాటు భర్త నాగచైతన్యకు కూడా సమంత ఎదురుతిరిగిందనే విషయం మంత్రి మాటల్లో అర్ధమవుతోంది. దీంతో ఎవరికీ లొంగని మనిషిగా సమంత క్యారెక్టర్ బాగా హైలైట్ అయ్యిందని జనాల్లో బాగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రి ఆరోపణలు ఎంతవరకు నిజమనే విషయాన్ని పక్కనపెట్టేస్తే జనాల్లో తన క్యారెక్టర్ బాగా బ్యాడ్ అయిపోయిందని నాగార్జునకు అర్ధమైంది. అందుకనే కొండాసురేఖ మీద న్యాయపరమైన చర్యలకు నాగార్జున దిగారు.
వర్మ ఏమన్నారు ?
ఇదే విషయాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాలవర్మ మాట్లాడుతు కొండా సురేఖ వ్యాఖ్యలు, ఆరోపణలతో నాగార్జున, చైతన్యకు బాగా అవమానం జరిగినట్లు అభిప్రాయపడ్డారు. సమంతకు కొండా సురేఖ సారి చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. ఎందుకంటే కొండా సురేఖ ఎక్కడకూడా సమంతను తప్పుపట్టలేదన్నారు. సురేఖ వ్యాఖ్యలతో డ్యామేజి అయ్యిందంతా నాగార్జున, చైతన్య ఇమేజీయే అని చెప్పారు.