రేవంత్ సక్సెసర్ ఎవరు ?

2023లోనే ముఖ్యమంత్రి సీటుకోసం రేవంత్ తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ కూడా పోటీపడ్డారు.;

Update: 2025-05-27 09:49 GMT

రేవంత్ సక్సెసర్ ఎవరన్న ప్రశ్న వినటానికి చాలా విచిత్రంగానే ఉంటుంది. అసలిపుడు రేవంత్ సక్సెసర్ గురించి చర్చించుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు కూడా చాలామందికి రావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గర రేవంత్ కు బాగా పట్టుంది, అగ్రనేతలు సోనియా గాంధి, రాహుల్, ప్రియాంక గాంధీల గుడ్ లుక్సులో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి మార్పుగురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు కూడా రావచ్చు. అయితే రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరూ ఛెప్పలేరు. అందులోను కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి పదవి దక్కుతుందో, ఎప్పుడు ఎవరికి పదవి ఊడిపోతుందో కూడా చెప్పలేరు. నిప్పులేందే పొగరాదంటారు పెద్దలు. పొగ పైకి లేస్తోందంటే ఎక్కడో నిప్పు రాజుకుందని అర్ధమవుతోంది.

ఇపుడు విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ వారసుడు ఎవరనే చర్చ పార్టీలో సడెన్ గా మొదలైంది. ఢిల్లీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్ధమవుతుంది. అదేమిటంటే అగ్రనేత రాహుల్ గాంధిని కలిసే అవకాశం రేవంత్ కు దక్కలేదు. కారణాలు ఏవైనా కాని రేవంత్ కు రాహుల్ అపాయిట్మెంట్ ఇవ్వలేదని పార్టీవర్గాల సమాచారం. ఇదే విషయమై గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకటిరెండుసార్లు చెప్పినా అప్పట్లో అది నిజంకాదు. అయితే ఇపుడు మాత్రం రేవంత్ కు రాహుల్ అపాయిట్మెంట్ ఇవ్వలేదన్నది పార్టీవర్గాల సోర్స్. కాబట్టి రేవంత్ విషయంలో అధిష్ఠానం దగ్గర ఏదో నెగిటివ్ గా డెవప్మెంట్ జరుగుతోంది అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయమే పార్టీలో నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

పార్టీని అధికారంలోకి తేవటంలో రేవంత్ కృషి చాలావుందనటంలో సందేహంలేదు. పీసీసీకి రేవంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాతే పార్టీకి ఊపొచ్చిందన్నది నూరుశాతం వాస్తవం. పీసీసీ పగ్గాలు అందిన తర్వాత పార్టీలో ఒక్కసారిగా జోష్ పెరిగిపోయింది. కేసీఆర్ కు ధీటుగా బహిరంగసభల్లో మాట్లాడటం, 119 నియోజకవర్గాల్లో దాదాపు 90 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయటం, కేసీఆర్ వ్యతిరేకుల్లో మెజారిటి నేతలను కాంగ్రెస్ కు అనుకూలంగా రప్పించుకోవటంలో రేవంత్ కృషిని ఎవరూ కాదనలేరు. అయితే అదంతా చరిత్రయిపోయింది. వర్తమానం ఏమిటంటే పార్టీఅధిష్ఠానాన్ని మించి రేవంత్ దూసుకువెళ్ళిపోతున్నాడనే అనుమానాలు కూడా పార్టీలో పెరిగిపోతున్నాయి. అందుకనే రేవంత్ కు రీప్లేస్ మెంట్ తప్పదనే సంకేతాలు కనబడుతున్నాయి. నిజంగానే రీప్లేస్మెంట్ తప్పదు అంటే ముఖ్యమంత్రి అయ్యేంత స్ధాయినేతలు పార్టీలో ఎవరున్నారు ? ఎంతిమంది ఉన్నారు ? అన్నదే ఇపుడు పాయింట్.

ఈ విషయాన్ని జగ్రత్తగా గమనిస్తే 2023లోనే ముఖ్యమంత్రి సీటుకోసం రేవంత్ తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ కూడా పోటీపడ్డారు. అయితే ఎంఎల్ఏల నుండి తీసుకున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎక్కువమంది ఛాయిస్ ప్రకారం అధిష్ఠానం రేవంత్ ను సీఎంగా ప్రకటించింది. అప్పట్లో రేవంత్ తరువాత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొందరు ఎంఎల్ఏలు మద్దతిచ్చినట్లు పార్టీవర్గాల సమాచారం. సరే, ఇపుడు ప్రస్తుతానికి వస్తే రేవంత్ సక్సెసర్ గా భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర్ తో పాటు మరో మంత్రి కూడా రేసులో ఉండే అవకాశముందని సమాచారం. ఆ మంత్రి ఎవరంటే ధనసరి సీతక్క.

మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ ఇద్దరూ రెడ్డి సామాజికవర్గం నేతలే కాకుండా ఆర్ధికంగా అత్యంత బలమైన వారు. అయితే ఇద్దరికీ మెజరిటి ఎంఎల్ఏల మద్దతు అనుమానమే. ఎందుకంటే ఇద్దరూ ప్రజాకర్షక నేతలు కారు, మాటకారులు అంతకన్నా కారు. ఇక భట్టి, దామోదర విషయం చూస్తే ఇద్దరూ ఎస్సీ సామాజికవర్గం నేతలే. ఇద్దరు ఆర్ధికంగా గట్టిస్ధితిలోనే ఉన్నా మాటకారులైతే కారు, మెజారిటి ఎంఎల్ఏల్లో బలంలేదు. అధిష్ఠానం ఒక పేరును ఫైనల్ చేస్తే ఎంఎల్ఏలు వీళ్ళకు మద్దతిస్తారేమో కాని తమంతట తాముగా ఎవరికి మద్దతు ఇస్తారని అడిగితే మాత్రం ఈ ఇద్దరికీ మెజారిటి ఎంఎల్ఏలు ఓట్లుపడేది అనుమానమే.

ఫైనల్ గా మంత్రి సీతక్క విషయం చూస్తే ఈమెకు కూడా మెజారిటి ఎంఎల్ఏల మద్దతు కష్టమే. అయితే సీతక్కకు ఉన్న క్లీన్ ఇమేజి బాగా ప్లస్సవుతుంది. అగ్రకులాల ఎంఎల్ఏల్లో మెజారిటి మద్దతు దక్కకపోయినా ఎస్సీ, ఎస్టీ ఎంఎల్ఏల మద్దతు దక్కే అవకాశముంది. మహిళ అందులోను ఎస్టీ కావటం సీతక్కకు బాగా కలిసివచ్చే అంశం. చాలామంది మంత్రులతో పోలిస్తే సీతక్క చాలా యాక్టివ్ గా ఉన్నారు. పైగా సీతక్కకు మరో రెండు ప్లస్సులున్నాయి. అవేమిటంటే రేవంత్ నూరుశాతం మద్దతుతో పాటు అగ్రనేత రాహుల్ కోటరీ మద్దతు కూడా ఉంటుందని పార్టీవర్గాల సమాచారం. తాను సీఎంగా తప్పుకోవాల్సిన పరిస్ధితులు వచ్చినపుడు తన ఛాయిస్ ఎవరంటే రేవంత్ కచ్చితంగా సీతక్క పేరుమాత్రమే చెబుతారని పార్టీలో టాక్. కాబట్టి ‘ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు‘ అని మాయాబజార్ సినిమాలో పాట పాడుకోవటమే.

Tags:    

Similar News