ములుగు అడవుల్లో 50వేల చెట్లు ఎందుకు కూలాయంటే...

తాడ్వాయి, పస్రా అడవుల్లో చెట్ల వేళ్లు లోతుగా లేకపోవడం, కుండపోత వర్షంతోపాటు వీచిన భారీ గాలులకు వేళ్లతో సహా చెట్లు నేలకూలాయని అటవీశాఖ అధికారుల సర్వేలో తేలింది.

Update: 2024-09-07 04:08 GMT

స్థలం : ములుగు జిల్లా తాడ్వాయి, పస్రా అటవీ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలోని మూడు కిలోమీటర్ల వెడల్పులో చెట్లు భారీ గాలులకు కూకటివేళ్లతో కూలిపోయాయి.

తేదీ : ఆగస్టు 31వతేదీ శనివారం
సమయం: రాత్రి 6 నుంచి 7 గంటల వరకు
కుండపోత వర్షం, బలమైన గాలుల ప్రభావంతో అడవుల్లో 50వేల చెట్లు నేలకూలాయి.
ములుగు జిల్లా తాడ్వాయి, పస్రా అటవీ రేంజి పరిధిలోని 204.30 హెక్టార్ల అటవీ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్, భారీ గాలులు వీయడం వల్ల 50వేలకు పైగా చెట్లు కూకటివేళ్లతో కూలిపోయాయి. అడవిలో వేలాది వృక్షాలు నేలకొరగడంపై అటవీశాఖ సమగ్ర సర్వే చేసి దీనిపై నివేదికను తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.

అడవిలో చెట్లు ఎందుకు కూలాయంటే...
తాడ్వాయి, పస్రా అడవుల్లో చెట్ల వేళ్లు లోతుగా లేకపోవడంతో క్లౌడ్ బరస్ట్ వల్ల వీచిన భారీ గాలులకు వేళ్లతో సహా చెట్లు నేలకూలాయని అటవీశాఖ అధికారులు తాజాగా రూపొందించిన నివేదికలో తెలిపింది. 204.30 హెక్టార్లలో 50వేల వృక్షాలు కూలిపోయాయని అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో జరిపిన సర్వేలో తేలింది. చెట్లు కూలడంపై సర్వే నివేదికను తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి డోబ్రియల్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.భారీవర్షం వల్ల నీరు అడవిలో చెట్ల మధ్యకు చేరడంతో ఆ చెట్ల వేళ్లు వదులు అయ్యాయి. వర్షంతో పాటు భారీ గాలులు వీచడంతో అవి కాస్తా నేలకొరిగాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

సారవంతమైన అటవీ ప్రాంతం
తాడ్వాయి, పస్రా రేంజిలోని అటవీ ప్రాంతంలో భూములు రాళ్లు, రప్పలు లేని సారవంతమైన భూమి. ఈ ప్రాంతంలో చెట్ల వేర్లు భూమి లోపలకు ఎక్కువగా వెళ్లలేదు. దీంతో భారీ గాలల వల్ల చెట్లు కూలిపోగా, చెట్ల కొమ్మలు విరిగిపోయాయి.తాడ్వాయి సెక్షన్ కమరం వెస్ట్ బీట్ పరిధిలో 41.20 హెక్టార్ల అటవీ భూమి, తాడ్వాయి సౌత్ లోని బోడిగూడ సౌత్ పరిధిలో 42.60 హెక్టార్లు, మేడారంలోని మేడారం సౌత్ బీట్ లో 50.20 హెక్టార్లు, పస్రాలోని మోట్లగూడ బీట్ పరిధిలో 70.30 హెక్లార్లలో వృక్షాలు నేలకూలాయని అటవీశాఖ సర్వేలో తేలింది.

క్లౌడ్ బరస్ట్ పై అధ్యయనం చేయాలి
తాడ్వాయి అడవుల్లో క్లౌడ్ బరస్ట్ ఘటనపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, భారత వాతావరణశాఖ శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాలని అటవీశాఖ పీసీసీఎఫ్ ప్రభుత్వానికి సూచించారు. చెట్ల వేర్లు భూమి లోపలకు వెళ్లక పోవడంతోపాటు నలుదిశలా బలమైన గాలులు వీచడంతో అడవుల్లోని చెట్లు కూలాయని అటవీశాఖ అధికారుల అధ్యయనంలో తేలింది. గంట వ్యవధిలో 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.వాతావరణ సమతౌల్యం లోపించడం వల్లే భారీవర్షాలు, భారీగాలులు వీచాయని బేగంపేటలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షంతోపాటు గాలులు వీచాయని ఆయన చెప్పారు.

క్లౌడ్ బరస్ట్ వల్ల వన్యప్రాణులకు ముప్పు లేదు
తాడ్వాయి, పస్రా అటవీ రేంజిలో క్లౌడ్ బరస్ట్ వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ముప్పూ లేదని పీసీసీఎఫ్ డోబ్రియల్ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.తాడ్వాయి అడవుల్లో వన్యప్రాణులు ఎక్కువగా ఉన్నా, వర్షాలు, గాలుల వల్ల వీటికి ఎలాంటి ముప్పూ ఏర్పడలేదని తమ సర్వేలో తేలిందని అటవీశాఖ అధికారులు చెప్పారు.

అడవుల పునరుద్ధరణకు నిధులివ్వండి : మంత్రి ధనసరి సీతక్క
ములుగు జిల్లా తాడ్వాయి అటవీప్రాంతంలో వీచిన భారీ గాలుల వల్ల కూలిన చెట్ల స్థానంలో అడవుల పునరుద్ధరణకు కేంద్రం నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క కోరారు.తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర నిధులు తీసుకురావాలని ఆమె సూచించారు. క్లౌడ్ బరస్ట్, భారీ గాలులు వీయడంపై కేంద్ర సంస్థలతో పరిశోధనలు చేయించాలని ఆమె కోరారు. ఇలాంటి విపత్తులు సంభవించే ముందు వాతావరణ శాఖ ముందస్తుగా అప్రమత్తం చేయాలని సీతక్క కేంద్రానికి సూచించారు.

చెట్లు కూలడం విషాదకరం : మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్
తాడ్వాయి అటవీప్రాంతంలో వీచిన భారీ గాలుల వల్ల పెద్దసంఖ్యలో చెట్లు కూలిపోవడం విషాదకరమని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చెప్పారు. ఎక్ష్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. అటవీప్రాంతంలో నేలకూలిన చెట్ల స్థానంలో మొక్కలు నాటి అడవిని పునరుద్ధరించాలని సంతోష్ కుమార్ సూచించారు.భవిష్యత్ కోసం పచ్చదనాన్ని పునర్ నిర్మిద్దాం అంటూ ఆయన కోరారు.





Tags:    

Similar News