భట్టి నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఎందుకు ఫెయిలైంది ?

రేవంత్ స్ధానంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించటంతోనే సమావేశం ప్రాధాన్యత తగ్గిపోయింది.;

Update: 2025-03-09 03:36 GMT
All party meeting by Dy CM Bhatti

ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డైడ్ అన్నట్లుగా తయారైంది ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన అఖిలపక్ష సమావేశం. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శనివారం మొదటిసారి అఖిలపక్ష సమావేశం జరిగింది. కేసీఆర్ పదేళ్ళ పాలనలో ఒక్కసారి కూడా ఏ విషయంలోనూ అఖిలపక్ష సమావేశం జరగలేదు. తమహయాంలో ఒక్కసారి కూడా అఖిలపక్ష సమావేశం జరపకపోయినా ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గరనుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీష్ రావు అఖిలపక్ష సమావేశాలకు డిమాండ్లు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. సరే, కారణమేదైనా కానీండి ఉపముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రజాభవన్లో అఖిలపక్ష సమావేశం(All party meeting) జరిగింది. అయితే ఈసమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు హాజరుకాలేదు. కాంగ్రెస్ ఎంపీలతో పాటు మిత్రపక్షం ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే హాజరయ్యారు.

సమావేశ ముఖ్యఉద్దేశ్యం ఏమిటంటే కేంద్రంనుండి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులను ఎలాగ రాబట్టాలన్నదే ప్రధాన అజెండా. మొదటిసారి జరిగిన ఇంతటి కీలకమైన అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఎందుకు గైర్హాజరయ్యారు ? ఎందుకంటే అధికార, ప్రతిపక్షాల మధ్య ఉన్న బద్ధవైరమే కారణమని చెప్పాలి. అలాగే అధికార, ప్రతిపక్షాల మధ్య ఆధిపత్య పోరాటాలు జరుగుతున్నాయి. ప్రతిచిన్న విషయంలోనూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలు తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకని రేవంత్ రెడ్డి(Revanth)పై డైరెక్టుగా పదేపదే ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. రేవంత్-కేసీఆర్ మధ్య ఉన్న వ్యక్తిగత వైరాన్ని ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు కంటిన్యుచేస్తున్నారు. రేవంత్ సీఎం అవటాన్ని బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. రేవంత్ ను తిట్టని, రేవంత్ పై కేటీఆర్, హరీష్ లు ఆరోపణలుచేయని రోజంటు లేదంటే అతిశయోక్తికాదు.

రాష్ట్రంలో ఎక్కడేమి జరిగినా వెంటనే దాన్ని రేవంత్ కు ముడేసి కేటీఆర్, హరీష్ లు ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. దాంతో రేవంత్ లేదా మంత్రులు కూడా అంతే ధీటుగా కేటీఆర్, హరీష్ పై ఆరోపణలు, విమర్శలతో ఎదురుదాడులు చేస్తున్నారు. ఇపుడు వీళ్ళ మధ్య పరిస్ధితి ఎలాగుందంటే రేవంత్, కేటీఆర్, హరీష్ ఏ సందర్భంలో కూడా ఎదురుపడటానికి ఇష్టపడటంలేదు. ఇదే పరిస్ధితి దాదాపు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) తో కూడా కంటిన్యు అవుతోంది. వీళ్ళమధ్య వైరం రాజకీయ దశను దాటేసి వ్యక్తిగతమైపోయింది. కేసీఆర్(KCR) పదేళ్ళ పాలనలోని లోపాలకు కూడా కేటీఆర్, హరీష్ లు రేవంత్ దే బాధ్యతగా ఆరోపణలతో రెచ్చిపోతుండటమే అసలుసమస్య. ఉదాహరణగా సంక్షేమ హాస్టళ్ళల్లో విద్యార్ధులకు సరైన వసతులు లేవన్నది వాస్తవం. హాస్టళ్ళల్లోని పిల్లల మరణాలన్నీ రేవంత్ ప్రభుత్వహత్యలే అని కేటీఆర్, హరీష్ నానా గోలచేస్తున్నారు.

పదేళ్ళపాలనలో సంక్షేమహాస్టళ్ళల్లో పరిస్ధితులను ఎందుకు చక్కదిద్దలేదని రేవంత్, మంత్రులు అడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్ నుండి సమాధానం ఉండటంలేదు. పదేళ్ళ అధికారంలో కేసీఆర్ సంక్షేమ హాస్టళ్ళలో పరిస్ధితులను మెరుగుపరచలేదన్నది వాస్తవం. తప్పులు తమవైపు కూడా ఉన్నా దాన్ని అంగీకరించక తప్పులన్నీ రేవంత్ ప్రభుత్వానిదే అన్నట్లుగా కేటీఆర్, హరీష్ గోలచేస్తున్నారు. ఇలాంటి అనేక కారణాలతోనే రెండుపార్టీలమధ్య ప్రతిరోజు ఆరోపణల యుద్ధం జరుగుతోంది. ఇక నరేంద్రమోడీ(Narendra Modi) పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని రేవంత్, మంత్రులు ప్రతిరోజు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రప్రభుత్వంవల్ల తెలంగాణకు ఏవిధంగా అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని రేవంత్, మంత్రులు లెక్కలతో సహా వివరిస్తున్నారు.

అయితే రేవంత్, మంత్రుల లెక్కలన్నీ నూరుశాతం తప్పులని కిషన్, బండి ఎదురుదాడులకు దిగుతున్నారు. కేంద్రప్రభుత్వం 11 ఏళ్ళల్లో తెలంగాణ(Telangana) అభివృద్ధికి రు. 10 లక్షల కోట్లు ఖర్చుచేసిందని కిషన్ లెక్కలు చెబుతున్నారు. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటి ? రేవంత్ చేస్తున్న ఆరోపణలూ కరెక్టే, కిషన్ చెబెతున్న లెక్కలూ కరెక్టేని. తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సినన్ని నిధులు కేటాయించటంలేదన్నది వాస్తవం. మంజూరుచేయాల్సిన ప్రాజెక్టులను చేయటంలేదు. మంజూరుచేసిన ప్రాజెక్టులకు సరిపడా నిధులను కేటాయించటంలేదు. ఇందుకు ఉదాహరణ ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట(Kajipet)కు ఎప్పుడో మంజూరైన రైల్వేకోచ్ ఫ్యాక్టరీ విషయమే. ఈ కోచ్ ఫ్యాక్టరీ విషయం ఏమైందో ఇప్పటికీ స్పష్టతలేదు. తొందరలోనే పనులు మొదలవుతాయని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య(Kadiyam Kavya) ఆమధ్య ప్రకటించారు. వెంటనే ఇదేవిషయమై కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్(Aswani Vyshnav) మాట్లాడుతు కోచ్ ఫ్యాక్టరీ పనుల విషయమై ఎలాంటి నిర్ణయం జరగలేదని ప్రకటించారు. దీంతో ఎవరి ప్రకటనను నమ్మాలో అర్ధంకాక జనాలు జుట్టుపీక్కుంటున్నారు.

ప్రాధాన్యత తగ్గిపోయిందా ?

ఇక అసలువిషయానికి వస్తే రేవంత్ ఆధ్వర్యంలో అఖలపక్ష సమావేశం జరిగుంటే దానికి బాగా ప్రాధాన్యత వచ్చుండేది. రేవంత్ స్ధానంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించటంతోనే సమావేశం ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రికి ఇచ్చినంత విలువ ఉపముఖ్యమంత్రికి ఇవ్వవు. ఎందుకంటే రాజ్యాంగబద్దంగా ఉపముఖ్యమంత్రి పదవి అన్నదే లేదు. అయితే రకరకాల అవసరాలకోసం పార్టీల అధినేతలు లేదా ముఖ్యమంత్రులు ఉపముఖ్యమంత్రి పదవిని సృష్టించారంతే. మంత్రివర్గంలో మిగిలిన మంత్రులు ఎంతో ఉపముఖ్యమంత్రి కూడా అంతే. అందుకనే బీఆర్ఎస్, బీజేపీలు భట్టి నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదు.

ఉపముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రప్రభుత్వంపై పోరాటాలు చేయాలంటే కేంద్రమంత్రులు ఎందుకు మద్దతిస్తారు ? తాము మంత్రులుగా ఉన్న కేంద్రప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలు పోరాటంచేయాలన్న డిమాండుకు కిషన్, బండి, బీజేపీ ఎంపీలు మద్దతుగా నిలవరని భట్టికి బాగా తెలుసు. అందుకనే కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు హాజరుకాలేదు. తమ గైర్హాజరుకు సాకుగా తక్కువసమయంలో ప్రభుత్వం నుండి ఆహ్వానం అందిందని కిషన్ చెప్పారు. కిషన్ చెప్పిన కారణం కూడా కరెక్టే అయ్యుండచ్చు. అసలు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భట్టిని రేవంత్ ఎప్పుడు ఆదేశించారో తెలీదు. సడెన్ గా అఖిలపక్ష సమావేశమని భట్టి నుండి ఆహ్వానం అందగానే కిషన్ కుదరదు పొమ్మన్నాడు. ఎందుకంటే తనకు ముందుగానే ఫిక్సయిన ప్రోగ్రాములు చాలా ఉన్నాయని కిషన్ చెప్పింది కూడా వాస్తవమే. మరో మంత్రి బండి గైర్హాజరుకు కారణాలు తెలీదు. తాము ఎందుకు రావటంలేదన్న విషయమై ఎంపీలు కూడా ఏమీ మాట్లాడలేదు. తమకు ముందుగా తగిన సమాచారం ఇస్తే అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామని కిషన్ చెప్పారు.

ఇక బీఆర్ఎస్ విషయాన్ని చూస్తే రేవంత్ అంటేనే మండిపడుతున్న బీఆర్ఎస్ కీలకనేతలు తమ ఎంపీలను సమావేశానికి ఎందుకు పంపుతారు ? బీఆర్ఎస్ కు లోక్ సభ ఎంపీలు లేకపోయినా రాజ్యసభ ఎంపీలున్నారు. వీళ్ళు కూడా అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదంటే కారణం ఆధిపత్య గొడవలే. ఇదే విషయమై భట్టి మాట్లాడుతు రాష్ట్రప్రయోజనాల కోసం పార్టీలన్నీ ఏకతాటిపైన నడవాలని పిలుపిచ్చారు. రాష్ట్రప్రయోజనాల సాధనలో తమిళనాడు ఎంపీలను ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్పారు. అయితే తమిళనాడులో ఉన్న రాజకీయ వాతావరణం తెలంగాణలో ఉందా అని భట్టి తనను తాను ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. తమిళనాడు(TamilNadu)లో మొదటినుండి ఎంపీలందరు పార్టీలకు అతీతంగా కేంద్రంపై పోరాటాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో ఆధిపత్యం కోసం పార్టీలమధ్య పోరాటాలు జరుగుతున్నా కేంద్రం విషయానికి వచ్చేసరికి అన్నీ పార్టీలు ఏకమైపోతాయి.

ఎంకే స్టాలిన్(MK Stalin) ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ప్రతిపక్షాలను బాగా గౌరవిస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలు కూడా స్టాలిన్ కు ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన విలువిస్తు గౌరవిస్తున్నాయి. కరుణానిధి-జయలలిత హయాంలో ఉన్న రాజకీయ ఉద్రిక్త వాతావరణ పరిస్ధితులు ఇపుడు చల్లారిపోయి ప్రశాంతంగా ఉంది. తెలంగాణలో ఇపుడు నడుస్తున్న బూతుల రాజకీయానికి ఆధ్యుడు కచ్చితంగా కేసీఆరే అని చెప్పకతప్పదు. తెలంగాణ సాధన పేరుతోను తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతిపక్షాలపై కేసీఆర్ బూతులతో రెచ్చిపోయిన విషయం అందరు చూసిందే. తాను ఎవరినైనా తిడతాను కాని తనను మాత్రం ఎవ్వరూ ఏమీ అనకూడదని కేసీఆర్ అంటే ఎలాగ చెల్లుతుంది ? మాటల్లో కేసీఆర్ ఎంతో రేవంతూ అంతే. కాబట్టి అప్పట్లో కేసీఆర్ తిడితే ఇపుడు రేవంత్ తిడుతున్నాడంతే. దీన్నే కేటీఆర్, హరీష్ తట్టుకోలేకపోతున్నారు.

చివరగా బీఆర్ఎస్-బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని రేవంత్, మంత్రులు పదేపదే ఆరోపిస్తున్నారు. ఈమధ్యనే జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేయకపోవటానికి ఈఒప్పందమే కారణమన్న రేవంత్, మంత్రుల ఆరోపణలు లాజికల్ గా నిజమే అనిపిస్తోంది. ఇందుకు కేసీఆర్ మాటలే బలాన్నిస్తున్నాయి. ఎలాగంటే రెండురోజుల క్రితమే తన ఫామ్ హౌసులో కీలకనేతలతో కేసీఆర్ భేటీఅయ్యారు. ఆ భేటీలో మాట్లాడుతు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. జనాలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై అంతటి వ్యతిరేకతతో ఉన్నట్లు చెప్పారు. కాసేపు కేసీఆర్ చెప్పిందే నిజమని అనుకుంటే మరి ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీ ఎందుకు పోటీచేయలేదు ? ఈ విషయమై కేసీఆర్ నోరిప్పి వివరణ ఇవ్వకపోవటంతోనే రేవంత్, మంత్రుల ఆరోపణలకు బలంగామారింది. అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీలు పాల్గొంటే కేంద్రానికి వ్యతిరేకంగా చేసే తీర్మానాలకు కట్టుబడుండాల్సి వస్తుంది. అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంతీరుపై బీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకంగా మాట్లాడాల్సుంటుంది. బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే కల్వకుంట్ల కవితకు మళ్ళీ ఇబ్బందులు మొదలవ్వచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో అరెస్టయి ఏడునెలలు తీహార్ జైలులో గడిపిన కవిత ఇపుడు బెయిల్ పై బయటున్నారు. కేంద్రానికి మండిందంటే కవిత బెయిల్ రద్దవుతుందని రేవంత్, మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి అనేక కారణాలతోనే బీఆర్ఎస్ కూడా అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరయ్యుంటుంది.

ఏమి జరిగినా కాంగ్రెస్ కే లాభమా ?

నిజానికి ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు హాజరు కారన్న విషయం భట్టికి బాగా తెలిసే ఉంటుంది. అఖిలపక్షానికి ప్రతిపక్ష ఎంపీలు హాజరైనా, గైర్హాజరైనా కాంగ్రెస్ కే లాభం. హాజరైతే కాంగ్రెస్ నాయకత్వంలో పార్లమెంటులో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాల్సుంటుంది. అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి ఢిల్లీలో అనుకూలంగా ఉండటం ప్రతిపక్షాలకే నష్టం. ప్రతిపక్షాల డబల్ గేమ్ ను కాంగ్రెస్ జనాల్లో ఎండగట్టేస్తుంది. ఇదేసమయంలో సమావేశానికి ప్రతిపక్షాల గైర్హాజరును కూడా కాంగ్రెస్ అనుకూలంగానే మార్చుకుంటుంది. రాష్ట్రప్రయోజనాల కోసం తాము అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తే బీఆర్ఎస్, బీజేపీలు హాజరుకాలేదని జనాలకు పదేపదే చెబుతుంది. తొందరలోనే మరోసారి అఖిలపక్ష సమావేశం పెడతామని భట్టి ప్రకటించారు. మరి రెండోసారి నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనే విషయంలో బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు ఏమిచేస్తారో చూడాలి.

Tags:    

Similar News