అయ్యయ్యో.. బషీర్ బాగ్ కేఫ్ బహార్ మూతపడిందే!

హైదరాబాద్ బషీర్ బాగ్ నుంచి హైదర్ గూడ వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయ్యే ప్లేస్ కేప్ బహార్. శుక్రవారం సాయంత్రం వేళల్లో, రంజాన్ ఇఫ్తార్ వేళల్లో రద్దీ చాలా ఎక్కువ.

Update: 2024-10-20 03:19 GMT

హైదరాబాద్ బషీర్ బాగ్ నుంచి హైదర్ గూడ వెళ్తుంటే అనివార్యంగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్లేస్ కేప్ బహార్. శుక్రవారం సాయంత్రం వేళల్లో, రంజాన్ ఇఫ్తార్ వేళల్లో అక్కడ రద్దీ మామూలుగా ఉండదు. అటువంటి కేప్ బహార్ మూతపడిందంటే హైదరాబాద్ చరిత్రపై మమకారం ఉండే వాళ్లకి ఎక్కడో గుండెల్లో ముల్లుగుచ్చుకుంటున్నట్టు ఉంటుంది.


"హైదరాబాదీలు ఉపవాసం విరమించిన తర్వాత రంజాన్ స్పెషల్‌ కోసం వడివడిగా వెళ్లే కేప్ లలో ఇదొకటి. బషీర్‌బాగ్‌లోని కేఫ్ బహార్ లైట్లు దారినపోయే వాళ్లని ఆపి హలీమ్‌ను రుచి చూడకుండా ఎలా వెళ్తావన్నట్టుగా రెచ్చగొడుతుంది. లేదా ఓ కప్పు గరమ్ ఇరానీ చాయ్‌తో ఫ్రెష్‌గా ఉండమని వేడుకుంటున్నట్టుంటుంది. ఆ టెంప్టేషన్‌కు లొంగి నేను ఓ సీట్లో కంఫర్టబుల్ గా కూర్చున్నా. హలీమ్‌ను తెప్పించా. బిర్యానీకి ఆర్డర్ చేశా. చెంచాను తుడుచుకుంటూ కూర్చున్నా. ఆ తర్వాత ఏం జరుగుతుందో హైదరాబాదీలకు తెలియందేమీ కాదు. అంత అమితంగా ఇష్టపడ్డా" అంటాడు "వైట్ మొఘల్స్" అనే పుస్తక రచయిత విలియం డాల్రింపుల్. పద్దెనిమిదవ శతాబ్దపు బ్రిటీష్ వారి అదృష్టాన్ని వెతకడానికి భారతదేశానికి వచ్చిన రచయిత ఈ విలియం.

అటువంటి కేఫ్ బహార్ ఇప్పుడు మూతపడిందంటే బాధ కలగడం సహజమే. ఆస్తుల విలువ పెరిగి మనుషుల సంబంధాలు తరుగుతున్న రోజులివి. కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన ఆస్తుల తగాదాల్లో కేఫ్ బహార్ తాత్కాలికంగా మూతపడింది. ఇప్పటికి అంటే అక్టోబర్ 20నాటికి పది రోజులైంది. కేఫ్ బహార్ ప్రేమికులకు ఇది కచ్చితంగా నిరాశ కలిగించే వార్తే. హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో బాగా గుర్తుండిపోయిన ల్యాండ్‌మార్క్ ఇది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వచ్చిన గొడవలే ఇందుకు కారణమని అందులో పని చేసే ఉద్యోగులు చెబుతున్నారు.
1973లో ఇరాన్ కి చెందిన సయ్యద్ బోలూకీ ఈ కేఫ్ ను ప్రారంభించారు. మొదట్లో ఇరానీ చాయ్‌కి ఫేమస్ అయింది. ఆ తర్వాత బిర్యానీ, హలీమ్. కాలక్రమంలో హైదరాబాదీ బిర్యానీకి అదో హాట్ స్పాట్ అయింది. 1973లో ఐదారుగురు ఉద్యోగులు ఉంటే ఇప్పుడా సంఖ్య 250 మందికి చేరింది. రకరకాల వంటకాలకు మారుపేరుగా తయారైంది.
2019 నవంబర్ లో కోవిడ్ మహమ్మారి ప్రబలినపుడు బోలూకీ తన స్వస్ధలమైన ఇరాన్ వెళ్లి మరి తిరిగి రాలేదు. కోవిడ్ తర్వాత తిరిగి హోటల్ ప్రారంభమైనా బోలూకీ కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. అయినా వ్యాపారానికి ఢోకా లేకుండా ఉంది.
సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేలా అక్కడ ధరలు ఉండేవి. బిర్యానీ ధర ఇప్పటికీ రూ. 200లోపే. బిర్యానీతో పాటు రంజాన్ సమయంలో అత్యంత డిమాండ్ ఉండే వంటకం హలీమ్‌కు కూడా ఇక్కడ ఫేమస్. రెండు అంతస్థుల్లో అందరికీ అందుబాటులో ఉండే కేప్ బహార్ ప్రస్తుతానికి మూతపడింది. మళ్లీ ఎప్పుడు తెరుస్తారనేది ఇప్పుడిప్పుడే చెప్పలేం.


Tags:    

Similar News