తెలంగాణ 'ఫైర్ సర్వీస్' మీద సర్కారుకు ఇంత చిన్నచూపా!

అరకొర సిబ్బంది, కనీస వసతులు లేకపోయినా 'ఫైర్ సర్వీస్' నిప్పుతో పోరాటం చేస్తోంది.;

Update: 2025-05-21 04:58 GMT
తెలంగాణలో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

తెలంగాణ అగ్నిమాపకశాఖలో మంటలను ఆర్పే ఫైర్ మెన్లు లేరు, మంటలను ఆర్పే అధునాతన పరికరాలు లేవు...అయినా అగ్నిమాపక శాఖ ఉద్యోగులు నిప్పుపై పోరాటం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్టుమెంట్ లో ఫైర్ మెన్ల ఖాళీలతో పాటు అగ్నిప్రమాదాల సమయంలో మంటలు ఆర్పడానికి అధునాతన పరికరాలు కూడా కొరవడ్డాయి. రాష్ట్రంలో 33 జిల్లా ఫైర్ ఆఫీసులతోపాటు 137 ఫైర్ స్టేషన్లు, 9 ఫైర్ అవుట్ పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో 2,771 పోస్టులు మంజూరు చేయగా, కేవలం 2057 మంది మాత్రమే పనిచేస్తున్నారు.


మంటలను ఆర్పే 551 ఫైర్ మెన్ల పోస్టులు ఖాళీ
అగ్నిమాపక శాఖలో 714 పోస్లులు ఖాళీగా ఉన్నాయి. అగ్నిప్రమాదాలు జరిగినపుడు మంటలను ఆర్పడానికి 1612 మంది ఫైర్ మెన్లు అవసరం కాగా, కేవలం 1061 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 551 మంది ఫైర్ మెన్ పోస్టులు నేటికి ఖాళీగా ఉన్నాయి.ప్రభుత్వం ఫైర్ మెన్ల పోస్టులను భర్తీ చేయక పోవడడంతో అగ్నిప్రమాదాలు జరిగినపుడు మంటలను ఆర్పేందుకు కీలకమైన ఫైర్ మెన్లు అవసరమైనంత మంది లేరు.


 అగ్నిమాపక వాహనాలు నడిపే డ్రైవర్ ఆపరేటర్ల కొరత

ప్రమాదాలు జరిగినపుడు టింగ్ టింగ్ అంటూ సైరన్ మోగించుకుంటూ వెళ్లే అగ్నిమాపక వాహనాలు నడిపేందుకు కావలసినంత మంది డ్రైవర్లు లేరు. రాష్ట్రంలో 475 మంది డ్రైవర్ ఆపరేటర్లు పోస్టులు మంజూరు చేసినా 385 మంది మాత్రమే పనిచేస్తున్నారుర. ఇందులో కొందరు డ్రైవర్లు సెలవులు, వారాంతపు సెలవుల్లో ఉంటే అగ్నిప్రమాదాలు జరిగినా వాహనాలు నడిపేవారుండరు. 90 డ్రైవరు ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.



 స్కై లిఫ్టులు లేవు...

హైదరాబాద్ నగరంలో అధిక అంతస్తులు ఉన్న హైరైజ్ భవనాలున్నాయి. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తే ఆర్పేందుకు కావాల్సిన బ్రొంటో స్కై లిఫ్టులు అందుబాటులో లేవు. కేవలం 54 మీటర్లు అంటే కేవలం 18 అంతస్తుల వరకే వెళ్ల గలిగే బ్రోంటో స్కై లిఫ్టులు రెండే ఉన్నాయి. కానీ నగరంలో హైరైజ్ భవనాలు చాలా ఉన్నాయి. ఒకే సమయంలో హైరైజ్ భవనాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తే మంటలు ఆర్పడానికి అగ్నిమాపక శాఖ వద్ద స్కైలిఫ్టులు అందుబాటులో లేవు.హైరైజ్ భవనాల్లో అగ్నిప్రమాదాలు జరిగినపుడు మంటలను ఆర్పేందుకు స్నోర్ కెల్ పేరిట ప్రత్యేక ఫైర్ ఫైటింగ్ రెస్క్యూ పరికరాలు అవసరం కాగా రాష్ట్రం మొత్తం మీద ఒకటే ఉంది. కెమికల్ కంపెనీల్లో ప్రమాదాలు జరిగినపుడు మంటలను ఆర్పేందుకు కావాల్సిన వాటర్ కం ఫోమ్ టెండర్లు అవసరం కాగా, అవి కూడా చాలినన్ని లేవు.



 రెస్క్యూ పరికరాలేవి?

భవనాలు కూలినపుడు, రోడ్డు, రైలు ప్రమాదాలు జరిగినపుడు రెస్క్యూ చేయడానికి కావాల్సిన రెస్క్యూ టెండర్లు కూడా అరకొరే ఉన్నాయి. రాష్ట్రంలో కేవలం అయిదు రెస్క్యూ టెండర్లు మాత్రమే ఉన్నాయి. పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు వాటిల్లితే మంటలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా డీసీపీ టెండరు యంత్రాలు కావాలి. కానీ రాష్ట్రంలో ఒకే యంత్రం ఉంది.




 ఏటేటా పెరుగుతున్న అగ్నిప్రమాదాలు

2025 వ సంవత్సరంలో గడచిన అయిదు నెలల్లోనే 5,518 అగ్నిప్రమాదాలు జరిగాయని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్టుమెంట్ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.ఇందులో 52 అగ్నిప్రమాదాలు తీవ్రమైనవి కాగా మరో 129 ప్రమాదాలు మీడియంవి. ఈ అగ్ని ప్రమాదాల్లో 263.522 కోట్ల ఆస్తులు బుగ్గిపాలయ్యాయి. అగ్నిప్రమాదాల్లో 66 మంది మరణించారు. ఈ ఏడాది అత్యధికంగా 412 నివాస భవనాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. 19 విద్యాసంస్థల భవనాల్లోనూ మంటలు అంటుకున్నాయి.


 అధునాతన పరికరాలేవి?

ఏటేటా అగ్నిప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. కారణాలేవైనా, భవనాల సంఖ్యతోపాటు అగ్నిప్రమాదాల సంఖ్య పెరుగుతున్నా అగ్నిమాపక శాఖ ఫైర్ స్టేషన్ల సంఖ్యను మాత్రం పెంచడం లేదు. దీంతో అగ్నిప్రమాదం జరిగితే దూరం నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోందని వినూత్న రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేత మాటూరి సురేందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దీనికితోడు ఫైర్ మెన్ల సంఖ్య తక్కువగా ఉండటం, అధునాతన మంటలు ఆర్పే యంత్రాలు చాలినన్ని లేక పోవడంతో అగ్నిప్రమాదాల్లో ఆస్తి నష్టం పెరుగుతోందని ఆయన తెలిపారు.మంటలను ఆర్పేందుకు కావాల్సిన నీటిని తీసుకువచ్చేందుకు కావాల్సిన పోర్టబుల్ పంపులు కూడా ఫైర్ శాఖ వద్ద తగినన్ని లేవు. కేవలం 13 పోర్టబుల్ పంపులతో కాలం వెళ్లదీస్తున్నారు.బ్యాకప్ వాటర్ టెండర్ల సంఖ్య కూడా తక్కువగా ఉన్నాయి. దీంతో నీరు లభ్యం కాకపోవడంతో అగ్నిప్రమాదాలు జరిగినపుడు ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది.



 అగ్నిప్రమాదాలకు కారణాలెన్నో...

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అగ్నిప్రమాదాలకు కారణాలను ఆ శాఖ విశ్లేషించగా పలు నివ్వెరపోయే అంశాలు వెలుగుచూశాయి.నిర్లక్ష్యంగా ధూమపానం చేయడం వల్ల 2,863 అగ్నిప్రమాదాలు జరిగాయని తేలింది. 1185 అగ్నిప్రమాదాలు విద్యుత్ షార్ట్ సర్య్యూట్ వల్ల జరిగాయని ఫైర్ అధికారులు చెప్పారు. చిమ్నీల వల్ల 12 ప్రమాదాలు, గ్యాస్, బొగ్గు వల్ల 93 ప్రమాదాలు, ఒవెన్, స్లౌలతో 325 అగ్నిప్రమాదాలు వాటిల్లాయని అధికారులు లెక్క తేల్చారు. అగ్నిప్రమాదాలకు కారణాలేవైనా ముందుజాగ్రత్త చర్యలు పాటించక పోవడం వల్లనే వీటి సంఖ్య పెరుగుతుంది.

తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్ 1999 నిబంధనలు బేఖాతర్
తెలంగాణ రాష్ట్రంలో అగ్నిప్రమాదాలు జరగకుండా తెలంగాణ అగ్నిమాపక శాఖ ఫైర్ సర్వీస్ యాక్ట్ 1999 ను అమలు చేస్తున్నా, వీటిలోని నిబంధనలు పాటించడం లేదు. ఈ యాక్ట్ ప్రకారం ఫైర్ సేఫ్టీ తప్పని సరి, కానీ ప్రజలు ఈ చట్టం ప్రకారం నిబంధనలు అమలు చేయక పోవడంతో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాణిజ్య భవనాలు, పరిశ్రమలకు ఫైర్ లైసెన్సులు తీసుకోవాలి. కానీ కొన్ని సంస్థలు ఫైర్ లైసెన్సులు లేకుండానే, అగ్నిమాపక భద్రతా చర్యలు పాటించకుండా పరిశ్రమలు నడుపుతుండటంతో అగ్నిప్రమాదాులు జరగుతున్నాయి.




  ప్రజల్లో కొరవడిన అప్రమత్తత

అగ్నిప్రమాదాల నివారణకు వీలుగా ప్రజల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అగ్నిమాపక శాఖ ప్రచారం చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. కరపత్రాలు, వీడియో ఫిలింల ద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రచారం చేస్తున్నారు. మరో వైపు అగ్నిప్రమాదాలు జరిగినపుడు పాటించాల్సిన జాగ్రత్తలపై మాక్ ఫైర్ డ్రిల్ చేస్తున్నా ప్రజలు దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. దీంతో అగ్నిప్రమాదాలు జరిగినపుడు ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా సంభవిస్తోంది.

ఫైర్ సేఫ్టీ ఆడిట్ ఏది?
హైదరాబాద్ నగరంలోని 15 మీటర్ల ఎత్తు ఉన్న నివాస భవనాలకు నిబంధనల ప్రకారం ప్రతీ సంవత్సరం ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. కానీ కొన్నేళ్లుగా ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయడం లేదు. హైదరాబాద్ నగరంలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిన బాధ్యత హైడ్రాకు ఉండగా, అది కూల్చివేతలతోనే కాలం గడుపుతోంది. అరకొర సిబ్బందితో ప్రతీ భవనం ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించ లేక పోతున్నామని హైదరాబాద్ అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భవన నిర్మాణానికి అనుమతి తీసుకునేటపుడు అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. కానీ పదేళ్ల క్రితం ఈ నిబంధన లేక పోవడంతో అగ్నిమాపకశాఖ అనుమతులు లేకుండానే భవనాలు నిర్మించారు.

అగ్నిప్రమాద జాగ్రత్తలు తీసుకోలేదు : డీజీ నాగిరెడ్డి
గుల్జార్ హౌస్ భవనంలో అగ్నిప్రమాద జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల పెను విషాదం సంభవించిందని తెలంగాణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి చెప్పారు.ప్రమాదం జరిగిన ఇంట్లో చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్ల మంటలు వ్యాపించాయని ఆయన పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోక పోవడం వల్లనే అగ్నిప్రమాదాల సంఖ్య పెరుగుతుందని డీజీ చెప్పారు.


Tags:    

Similar News