కేసీయార్, కేటీయార్ జగన్ జపం ఎందుకు చేస్తున్నారు ?

పోలింగుకు ముందు నుండే ఏపీలో జగనే అధికారంలోకి వస్తారని కేసీయార్ ఎందుకు చెబుతున్నట్లు ?

Update: 2024-05-16 08:50 GMT
kcr and ktr

ఏపీలో జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తారనే సమాచారం తమకుందని కేసీయార్, కేటీయార్ పదేపదే చెబుతున్నారు. నిజానికి ఏపీలో అధికారంలోకి ఎవరొచ్చినా ఇపుడు తండ్రి, కొడుకులకు వచ్చేలాభం ఏమీలేదు. అయినా సరే పోలింగుకు ముందు నుండే ఏపీలో జగనే అధికారంలోకి వస్తారని కేసీయార్ ఎందుకు చెబుతున్నట్లు ? అన్నదే ఇపుడు ఎవరికీ అర్ధంకావటంలేదు. తెలంగాణాలో కేసీయార్, ఏపీలో ముందు చంద్రబాబునాయుడు, ఇపుడు జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నా రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలైతే పరిష్కారంకాలేదు. కేసీయార్ ఏకపక్ష ధోరణి కారణంగా చంద్రబాబు, జగన్ ఇద్దరు కూడా సమస్యల పరిష్కారంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఫలితంగా రాష్ట్రవిభజన జరిగి పదేళ్ళవుతున్నా సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి.

ఇపుడు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీలో అధికారంలోకి ఎవరొస్తారనే విషయంలో ఆసక్తి చూపినా ఉపయోగముంటుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలమధ్య సమస్యల పరిష్కారంలో రేవంత్ చొరవ చూపించేందుకు అవకాశముంది. జగనే మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక పద్దతిగా ఉంటుంది. అదే చంద్రబాబు సీఎం అయితే పరిస్ధితి మరోరకంగా ఉంటుంది. జగన్ కన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రేవంత్ కు బాగా అడ్వాంటేజ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎలాగంటే చంద్రబాబు, రేవంత్ అత్యంత సన్నిహితులు, చంద్రబాబుకు రేవంత్ నమ్మినబంటు అని అందరికీ తెలిసిందే. ఓటుకునోటు వ్యవహారాన్ని గమనించిన వాళ్ళకు చంద్రబాబు, రేవంత్ బంధం ఎంత ధృడమైందో అర్ధమయ్యుంటుంది.

బహుశా ఈ విషయంలోనే కేసీయార్ బాగా ఆందోళనచెందుతున్నట్లున్నారు. ఓటుకునోటు వ్యవహారంలోనే కేసీయార్ దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ వదిలి ఏపీకి వెళిపోతే, రేవంత్ జైలుకు వెళ్ళారు. అలాంటిది ఇపుడు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే సీన్ రివర్సయి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి తనను ఎక్కడ ఇబ్బందులు పెడతారో అనే ఆందోళన కేసీయార్లో పెరిగిపోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కేసీయార్ నిర్ణయాలపై రేవంత్ ప్రభుత్వం సమీక్షలు చేస్తోంది. విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీల పిల్లర్ల కుంగుబాటు లాంటి అంశాలపై విచారణ జరుగుతోంది. టెలిఫోన్ ట్యాపింగ్ అంశం కూడా కేసీయార్ మెడకు తొందరలోనే చుట్టుకోబోతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఇలాంటి పరిస్ధితుల్లో ఏపీలో జగన్ గనుక రెండోసారి సీఎం అయితే ఏదోపద్దతిలో తనకు ఊరటగా ఉంటుందని కేసీయార్ అనుకుంటున్నట్లున్నారు. రేవంత్ ప్రభుత్వం గనుక కేసీయార్ పైన యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఏరకంగానూ సాయంచేయలేరు. పోనీ రాజకీయంగా అనధికారికంగా ఏమైనా చేయగలా అంటే అదీ సాధ్యంకాదు. ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయినా ఒకవేళ కేసీయార్ మీద కక్ష సాధించాలని అనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్ ఇద్దరికీ కేసీయార్ కామన్ శతృవు కాబట్టి. ఆ పరిస్ధితే వస్తే ఢిల్లీ స్ధాయిలో కూడా కేసీయార్ రక్షణకు నిలబడే వాళ్ళు ఎవరూ కనబడటంలేదు. ఇన్ని విషయాలు కేసీయార్ ఆలోచించలేని వారు కాదు. అయినా సరే ఎందుకనే ఏపీలో జగనే అధికారంలోకి వస్తారని పదేపదే చెబుతున్నారో అర్ధంకావటంలేదు.

ఇదే విషయాన్ని రాజ్యసభ మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు ‘పక్కరాష్ట్రం ముచ్చట కేసీయార్ కు ఎందుక’ని నిలదీశారు. ‘ఆంధ్రా ఫలితాలు చూసుకోవటానికి కేసీయార్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోవటంలేద’ని రాపోలు చెప్పారు. ‘అనవసరంగా కేసీయార్ ఏపీ రాజకీయాల్లో మంత్రసానితనం చేస్తున్న’ట్లు ఎద్దేవాచేశారు. ‘ఏపీ రాజకీయాలపై కేసీయార్ వ్యాఖ్యల తర్వాత ఆ రాష్ట్రంలో అధికారం కోసం తహతహలాడుతున్న కులాలవారు, వారి సానుభూతిపరులు కేసీయార్ ను శతృవులుగా చూస్తున్నార’ని రాపోలు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News