హైదరాబాద్‌లో సడన్‌గా వర్షాలు ఎందుకు ఆగిపోయాయి?

హైదరాబాద్‌లో వర్షాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.80 శాతం కాంక్రీట్ జంగిల్, అధిక కాలుష్యం,తేమ గాలుల ప్రభావం తగ్గడం,రుతుపవనాల్లో బ్రేక్స్ వల్ల వర్షాలు ఆగిపోయాయి.

Update: 2024-08-08 08:42 GMT
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షాలేవి?

హైదరాబాద్ నగరంలో ఆకస్మికంగా వర్షాలు ఆగిపోయాయి.హైదరాబాద్ నగరంలో 80 శాతం ప్రాంతం కాంక్రీట్ జంగిల్‌గా మారడంతోపాటు కాలుష్యం పెరగడంతో తేమ గాలుల ప్రభావం గణనీయంగా తగ్గింది.

- హైదరాబాద్ సెంట్రిక్ పాయింటుగా ఉండటంతో కురిస్తే కుంభవృష్టి లేదంటే, విరామం వల్ల వర్షాలే కురవవని ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో హైదరాబాద్ నగరంలో వర్షాలకు రుతుపవనాల్లో విరామం ఏర్పడింది.
- తెలంగాణలోని జిల్లాల్లో అక్కడక్కడా తేమ గాలుల ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నా హైదరాబాద్ నగరంలో మాత్రం సరిగా వర్షాలు కురవడం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

రుతుపవనాల్లో విరామం...
ఘాట్ ఏరియాల్లో తేమ గాలులు ఎక్కువగా వీస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. జూన్ నెలలో రుతుపవనాల ఆగమనం తర్వాత దీని ప్రభావం దేశమంతటా విస్తరిస్తోంది. దీనివల్ల వేసవికాలంలో వేడెక్కిన భూమి రుతుపవనాల ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల చల్లబడింది. జులై, ఆగస్టు నెలల్లో విస్తారంగా వర్షాలు కురవాలి. అయితే ఆగస్టు నెలలో రుతుపవనాల వర్షాలకు అప్పుడప్పుడు విరామం ఏర్పడుతుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వివరించారు.

ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షాలేవి?
వచ్చే 24గంటల్లో హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్ నగరంలోని అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపినా, వర్షాలు మాత్రం కురవడం లేదు.హైదరాబాద్ నగరంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని సగటు ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుంచి 28 డిగ్రీల సెల్షియస్ దాకా నమోదవుతుందని చెప్పారు. రాగల నాలుగు రోజుల పాటు కూడా ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షాలు మాత్రం కురవడం లేదు.

జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో తేమ గాలులు వీస్తుండటంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం శాస్త్రవేత్త ధర్మరాజు చెప్పారు.

ఏపీ కోస్తా ప్రాంతంలో భారీవర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతాల్లో బుధవారం భారీవర్షాలు కురుస్తున్నాయని, ఏపీకి 982 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండటంతోపాటు కృష్ణా, గోదావరి నదుల ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు వివరించారు.

జిల్లాల్లో నాలుగురోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల నాలుగురోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ,జనగామ జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు వివరించారు. గంటకు 40 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

పెరగని భూగర్భజలనీటిమట్టం
హైదరాబాద్ నగరంలో 80 శాతం కాంక్రీట్ జంగిల్ ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు కురిసినా ఆశించినంత భూగర్భజలనీటిమట్టం పెరగలేదు. అడపాదడపా వర్షాలు కురిసినా వర్షపునీరంతా డ్రైనేజీ కాల్వలు, వరద కాల్వల ద్వారా వృథాగా పోయింది. భూగర్భంలో వర్షపునీరు ఇంకకపోవడంతో భూగర్భజలమట్టం పెరగలేదు.దీంతో పలు బోర్లలో కొంచెం నీరు మాత్రమే వస్తోంది.


Tags:    

Similar News