పిడుగుల్లా దూసుకొచ్చి పత్తా లేకుండా పోతున్న ప్రాంతీయ పార్టీలెన్నో!

2023లో టీఆర్ఎస్ ఓటమి, 2024లో వైసీపీ ఘోరపరాజయం, 2025లో ఆమ్ ఆద్మీపార్టీ ఓటమి తర్వాత ప్రాంతీయ పార్టీల అస్థిత్వంపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ ప్రారంభమైంది.;

Update: 2025-02-12 01:30 GMT
2019లో టీడీపీ పరాజయం, 2023లో టీఆర్ఎస్ ఓటమి, 2024లో వైసీపీ ఘోరపరాజయం, తాజాగా 2025లో ఆమ్ ఆద్మీపార్టీ ఓటమి తర్వాత ప్రాంతీయ పార్టీల అస్థిత్వంపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ ప్రారంభమైంది. పిడుగుల్లా దూసుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు కొన్ని బిళ్లపాటుగా నేల వాలుతుంటే మరికొన్ని వేరే పార్టీలలో విలీనం అవుతున్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు నేలచూపులు చూస్తూ సమయం కోసం వేచి చూస్తున్నాయి. ఇంకొన్ని అంతర్ధానం అవుతున్నాయి. మరికొన్ని ఉన్నా లేనట్టే ఉన్నాయి. నిజానికి ప్రాంతీయ పార్టీలకు దేశ చరిత్రలో పెద్ద అధ్యాయమే ఉంది.
భారతీయ సమాజం అనేక జాతి, మత, కుల, భాషా, సాంస్కృతిక సంగమం. జాతీయ పార్టీలు తమను తక్కువ చేస్తున్నాయనే భావనతోనో, తమ డిమాండ్లు నెరవేర్చడంలో విఫలమవుతున్నాయన్న ఆక్రోశం, ఆవేదన, అస్థిత్వ పోరాటం, ఉనికిని చాటే ప్రయత్నంలోనో ప్రాంతీయ పార్టీలు పుడుతుంటాయి.
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనూ పుట్టాయి. ఇప్పుడూ పుడుతున్నాయి. భారతదేశంలో ప్రాంతీయ పార్టీల గుర్తింపు ఆయా పార్టీలు చేసిన, చేస్తున్న ఆందోళనలపై ఆధారపడి ఉంటుంది.
స్వయం ప్రతిపత్తి డిమాండ్ తో జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పేరుగాంచింది. అదే డిమాండ్ తోనే 2024లో అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది. తెలుగువారి ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం ఆవిర్భవించింది. ఓ సమూహ సాంస్కృతిక హక్కుల గుర్తింపు పోరాటం నుంచి మహారాష్ట్రలోని శివసేన, దళితుల గుర్తింపు కోసం జరిగిన ఉద్యమం నుంచి డిఎంకె, బీఎస్పీ వంటివి ఉద్భవించాయి. జాతీయ పార్టీల అవమానాలు భరించలేక వైఎస్సార్ సీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు కసికొద్దీ పుట్టాయి. అవినీతి వ్యతిరేక పోరాటం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి పెరిగింది. ఇప్పుడీ పార్టీలలో కొన్ని రాజ్యమేలుతుండగా మరికొన్ని నేలచూపులు చూస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఒక నిర్దిష్ట ప్రాంత ప్రజలకు మేలు చేయగలుగుతాయన్న నమ్మకం ఈనాటిదేమీ కాదు. అయితే కొన్నిసార్లు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాల కోసం 'కల్లోలాలు' సృష్టించిన ఘటనలూ లేకపోలేదు.
ప్రాంతీయ పార్టీల పరిణామం
నాలుగు దశాబ్దాలుగా, ప్రాంతీయ పార్టీల సంఖ్య, బలం బాగా పెరిగింది. భారతీయ పార్లమెంటరీ రాజకీయాలను ప్రాంతీయ పార్టీలు మరింత వైవిధ్యభరితంగా మార్చాయి. ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రాంతీయ రాజకీయ పార్టీలే అవసరమనే దాకా వెళ్లాయి. ఏ ఒక్క జాతీయ పార్టీ కూడా లోక్‌సభలో సొంతంగా మెజారిటీ సాధించలేక పోయిన పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు సంకీర్ణ రాజకీయాలకు తెరలేపాయి. ఫలితంగా, జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సిసిన అనివార్యపరిస్థితిని కల్పించాయి. 1989 నుండి 2014 వరకు, తిరిగి 2025లో కూడా ప్రాంతీయ రాజకీయ పార్టీలు సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. ప్రాంతీయ రాజకీయ పార్టీల కారణంగానే కేంద్రం వారి సమస్యలను పరిష్కరించడం, వారి ఆకాంక్షలకు ప్రతిస్పందించడం ప్రారంభించింది.
అయితే ప్రాంతీయ పార్టీల స్వరూపం కుటుంబ పార్టీలనే విమర్శ లేకపోలేదు. ఒకటి రెండింటికి మినహాయింపు ఉన్నా వాస్తవానికి చాలా ప్రాంతీయ పార్టీల నాయకత్వాలు- ఆ పార్టీ ఎవరు పెట్టారో వారి చేతుల్లోనే ఉంటున్నాయి. దశాబ్దాల తరబడి అదే కొనసాగుతోంది.
అదే సమయంలో భారత రాజకీయ వేదిక నుండి చాలా ప్రాంతీయ పార్టీలు అదృశ్యమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత ఎన్నో పార్టీలు ఏర్పడి, కాలక్రమంలో క్షీణించాయి లేదా విలీనం అయ్యాయి. అవుటైపోయిన కొన్ని ప్రముఖ ప్రాంతీయ రాజకీయ పార్టీలేమిటో చూద్దాం:
స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో...
1. స్వతంత్ర పార్టీ
1959లో సి. రాజగోపాలాచారి స్థాపించిన ఈ పార్టీ మార్కెట్ ఆధారిత ఆర్థిక విధానాలను ప్రోత్సహించేది. 1974లో అంతర్గత విభేదాలు, మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ పార్టీ తెరమరుగైంది.
2. అఖిల భారత గణతంత్ర పరిషత్
1950లో ఒడిశాలో అప్పటి సంస్థానాధిపతులు స్థాపించిన ఈ పార్టీ 1962లో స్వతంత్ర పార్టీలో విలీనం అయ్యింది.
3. సోషలిస్ట్ పార్టీ (లోహియా గ్రూప్)
1955లో ప్రజా సోషలిస్ట్ పార్టీలో నుంచి విడిపోయి ఏర్పడింది. 1964లో తిరిగి సంయుక్త సోషలిస్ట్ పార్టీలో విలీనం అయింది.
4. జనతా దళ్
1988లో విభిన్న విపక్ష పార్టీలు కలసి ఏర్పరిచిన ఈ పార్టీ తరువాత చిన్న చిన్న పార్టీలుగా చీలిపోయింది.
జనతా దళ్ (యునైటెడ్), జనతా దళ్ (సెక్యులర్) వంటి అనేక కొత్త పార్టీలుగా రూపాంతరం చెందింది.
ఏవి తల్లీ నిరుడున్న ప్రాంతీయ పార్టీలు...
భారత రాజకీయ వ్యవస్థ చాలా డైనమిక్ గా ఉంటుంది. పార్టీలు కొత్తగా ఏర్పడి, ప్రజాస్వామ్య పోటీలో నిలబడలేకపోతే మిగతా ప్రధాన పార్టీల్లో విలీనం అవుతుంటాయి. కొన్ని పార్టీలు ప్రజల మద్దతు కోల్పోవడం, అంతర్గత విభేదాలు, నాయకత్వ సమస్యలు, కుటుంబ విభేదాలు, అహంభావపూరిత ధోరణలు వంటి కారణాల వల్ల నిర్వీర్యమై పోతాయి.
అస్సాంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఓ విద్యార్థి ఉద్యమ పార్టీ " అస్సాం గణ పరిషత్ (ఏజీపీ)". 1985లో అస్సాం ఒప్పందం తర్వాత ఏర్పడిన ఈ పార్టీ రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషించింది. ఇది రెండు సార్లు అస్సాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడా పార్టీ హవా తగ్గిపోయింది.
అలాగే అఖిల భారత ఐక్య ప్రజాస్వామ్య సమాఖ్య (AIUDF). 2005లో స్థాపించిన ఈ పార్టీ అస్సాంలోని మైనారిటీ వర్గాల హక్కులు, సమస్యలపై దృష్టి సారించింది. అస్సాంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో ఒకటి. ఇప్పుడెక్కడా వినిపించడం లేదు.
బీహార్‌లో 1993లో ఆనంద్ మోహన్ సింగ్ స్థాపించిన బీహార్ పీపుల్స్ పార్టీ 2004లో భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం అయింది. పప్పూ యాదవ్ జన్ అధికార్ పార్టీ (లోక్‌తాంత్రిక్) అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు. 2024లో ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో గతంలో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు కాలక్రమేణా తమ ప్రాధాన్యతను కోల్పోయాయి లేదా ఇతర పార్టీలలో విలీనం అయ్యాయి.
తెలుగు రాష్ట్రాలలో తెరమరుగైన ప్రాంతీయ పార్టీలు...
తెలుగు రాష్ట్రాలలో పుట్టి పెరిగిన ప్రాంతీయ పార్టీలూ ఇందుు మినహాయింపు కాదు. ఆచార్య ఎన్జీ రంగా పెట్టిన పార్టీలు ఏవీ నిలబడలేదు. అందుకే ఆయన్ను రంగులు మార్చే రంగా పేరుంది అంటారు. ఉరుములు మెరుపులతో వచ్చిన చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పురిటి వాసన పోకుండానే కాంగ్రెస్ లో విలీనం అయింది. 2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, ప్రారంభంలో ప్రజల్లో మంచి ఆదరణ పొందింది. సొంతంగా అధికారంలోకి రాలేకపోయింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. 2011లో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది.
లోక్ సత్తా పార్టీ: 2006లో జయప్రకాశ్ నారాయణ స్థాపించిన ఈ పార్టీ, రాజకీయాల్లో పారదర్శకతపై దృష్టి సారించింది. ప్రారంభంలో మంచి గుర్తింపు పొందినా, కాలక్రమంలో ప్రజాదరణ కోల్పోయి, ప్రస్తుతం రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఆ పార్టీ తరఫున జయప్రకాశ్ నారాయణ ఒక్కరు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సారీ సీపీ పెట్టుకున్నట్టే ఆయన సోదరి వైఎస్ షర్మిల 2021 జూలై 8న వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)ని స్థాపించారు. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపనను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, 2024 జనవరి 4న వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2014లో "జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ)" అనే పార్టీని ప్రారంభించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి ఈ పార్టీని ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడి, ఏకీకృత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ పార్టీ ఏర్పాటైంది. అయితే, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించలేకపోయింది. ప్రజాదరణ కోల్పోయిన తర్వాత, పార్టీ క్రమంగా నిర్వీర్యమైంది.
చివరగా, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని కొనసాగించకుండా, 2018లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిపోయారు. దీంతో "జై సమైక్యాంధ్ర పార్టీ" కూడా ఆంధ్రప్రదేశ్‌లో కనుమరుగైన ప్రాంతీయ పార్టీలలో ఒకటిగా మారింది.
ఏపీలో జేడీ లక్ష్మీనారాయణ 2023 అక్టోబర్ లో జై భారత్ నేషనల్ పార్టీ (జెబిఎన్‌పి) పార్టీని ప్రారంభించారు. ప్రజలను అవినీతి, బానిసత్వం నుండి విముక్తి చేయడమే లక్ష్యం అన్నారు. ప్రస్తుత రాజకీయాలు వారసత్వ రాజకీయ పార్టీల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయని అన్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓడిపోయారు. ఆ తర్వాత ఆ పార్టీ పేరు కూడా వినపడకుండా పోయింది.
2023 జూలైలో, చిత్తూరు జిల్లాకు చెందిన బీసీ నేత రామచంద్ర యాదవ్ ఆంధ్రప్రదేశ్‌లో "భారత చైతన్య యువజన పార్టీ" (BCYP) అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ ప్రస్థానానికి నాంది పలకడం అన్నారు. ఇప్పుడా పార్టీ జాడ తెలియడం లేదు.
మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ 2024 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌లో "లిబరేషన్ కాంగ్రెస్" అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. పేదల హక్కుల కోసం పోరాడటమే ధ్యేయంగా పాదయాత్ర చేశారు. ఇప్పుడా పార్టీ అడ్రసు కూడా కనిపించడం లేదు.
దళిత మహాసభ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నాయకుడు, కవి డాక్టర్‌ కత్తి పద్మారావు 2015లో "నవ్యాంధ్ర" పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ కులపరమైన పార్టీలుగా విమర్శించారు. అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు, ఆయా వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల కేటాయింపును చేయాలనే ఉద్దేశంతో "నవ్యాంధ్ర" పార్టీని స్థాపించారు. ఇప్పుడా పార్టీ ఉందో లేదో తెలియని వ్యవహారమే.
నవతరం పార్టీ- ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించిన ప్రాంతీయ రాజకీయ పార్టీ. ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం. 2023 ఫిబ్రవరిలో, బాపట్ల జిల్లాలో తమ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు, పర్చూరు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారని ప్రకటించిన రావు సుబ్రహ్మణ్యం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత ఆపార్టీ ఏమైందో తెలియదు.
ఇలా ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సమయంలో పుట్టుకొచ్చి ఆ తర్వాత కనుమరుగు అయ్యాయి. మళ్లీ ఎన్నికల సమయంలో వీటిలో కొన్ని తెరపైకి రావచ్చు.
ప్రాంతీయ పార్టీల నాయకుల్లో దురాభిమానం, అహంభావధోరణి, చులకన భావం, డబ్బుతో ఏమైనా చేయవచ్చుననే మీతిమీరిన విశ్వాసం ఉంటే ఎంత వేగంగా ఆకాశానికి ఎగురుతారో అంతే వేగంగా కింద పడడం కూడా ఖాయమని కే.చంద్రశేఖరరావు, వైఎస్ జగన్, అరవింద్ కేజ్రీవాల్ అనుభవాలు చెబుతున్నాయి.
జనసేన బలపడుతుందా...
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) చుట్టూతూనే తిరుగుతోంది. అయితే ఇటీవల కొన్నేళ్లుగా కొత్త ప్రాంతీయ పార్టీలు తెరపైకి వచ్చాయి. అందులో మొదటిది ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన.
ఇటీవల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలు స్వతంత్రంగా పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వర్గాలకు స్పష్టమైన ఓటు బ్యాంక్ ఉంటే, భవిష్యత్‌లో ప్రాంతీయ పార్టీలకు అవకాశాలు పెరుగుతాయి.
జనసేన పార్టీ ఇప్పటికే బలంగా ఎదుగుతున్న పార్టీగా ఉంది. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో తన పట్టును పెంచేందుకు ప్రయత్నిస్తోంది. వీటితో పోటీగా మరిన్ని చిన్న పార్టీలు రావచ్చు.
ప్రాంతీయ పార్టీల బలహీనతలు
పనిచేయగలిగిన నేతల కొరత: కొత్తగా వచ్చే పార్టీలు ప్రజల్లో విశ్వాసాన్ని రుజువు చేసుకోలేకపోతే, వారు తక్కువ కాలమే కొనసాగుతారు.
ధన, బల, ప్రచార పరిమితులు: ప్రధాన పార్టీలైన TDP, YSRCP, జనసేనతో పోలిస్తే కొత్త ప్రాంతీయ పార్టీలు పెద్దగా ఆర్థిక మద్దతు లేక పోవడం వల్ల బలపడలేరు.
ఓటు చీలిక సమస్య: చిన్న ప్రాంతీయ పార్టీలు పెరిగితే, వాటివల్ల ప్రధాన ప్రతిపక్షం నష్టపోయే అవకాశం ఉంటుంది.
నూతన సామాజిక వర్గాల ఆధిక్యత – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా అనుసంధానించే కొత్త పార్టీలు రాజకీయ సమీకరణాన్ని మార్చవచ్చు. ప్రజల్లో నిరాశ పెరిగితే, కొత్త ప్రాంతీయ పార్టీలు ముందుకు రావచ్చు. అధికార దాహం లేకుండా ప్రజా సమస్యలపై నిజమైన పోరాటం చేస్తే, కొత్త మార్పుకు దారి తీయవచ్చు. బలమైన నాయ‌కత్వం, ప్రజాభిమానాన్ని చూరగొనే విధానాలు, కచ్చితమైన ఓటు బ్యాంక్ ఉంటే ప్రాంతీయ పార్టీలు రాణించవచ్చు.
Tags:    

Similar News