కాంగ్రెస్ నేతలంతా ఎందుకు సైలెంట్ అయిపోయారో తెలుసా ?
అధికారంలోకి వచ్చిన వెంటనే సీనియర్లతో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధి భేటీ అయ్యారు. ఆ భేటీలో అందరికీ ఫుల్లుగా క్లాసుపీకారట.
కాంగ్రెస్ పార్టీ అంటేనే పూర్తి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అని అందరికీ తెలుసు. కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం అన్నది నేతిబీరకాయలో నెయ్యి లాంటిదే. అలాంటి పార్టీలో నేతలమధ్య గడచిన నాలుగు మాసాలుగా సహజస్వభావానికి భిన్నంగా ఐకమత్యం వెల్లివిరుస్తోంది. దీనికి కారణం ఏమిటని చాలామంది ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయారు. అలాంటిది ఒక ఛానల్ ‘క్వశ్చన్ అవర్’ ప్రోగ్రామ్ లో సీనియర్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి బయటపెట్టారు. పదేళ్ళ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే సీనియర్లతో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధి భేటీ అయ్యారు. ఆ భేటీలో అందరికీ ఫుల్లుగా క్లాసుపీకారట. కారణం ఏమిటంటే గతంలో లాగ గ్రూపు రాజకీయాలు చేయకుండా ఐకమత్యంగా ఉండమని చెప్పారట.
ప్రజలు పార్టీని నమ్మి ఓట్లేసి గెలిపించిన విషయాన్ని మరచిపోవద్దన్నారట. ప్రజలు కాంగ్రెస్ ను నమ్మి అధికారం అప్పగించిన విషయాన్ని మరచిపోవద్దని గట్టిగా చెప్పారట. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయటంపై దృష్టిపెట్టమన్నారట. పదవులకోసం గొడవలుపడుతు పార్టీని ప్రభుత్వాన్ని జనాల్లో పలుచన చేయవద్దని హెచ్చరించారట. అందుకనే సీనియర్ నేతలెవరు చప్పుడుచేయటంలేదని జగ్గారెడ్డి వివరించారు. రేవంత్ రెడ్డి అంటే పార్టీలో ఎంతమంది మద్దతుదారులున్నారో అంతకుమించి వ్యతిరేకులున్న విషయం తెలిసిందే. రేవంత్ ను కాంగ్రెస్ లోకి తీసుకోవటాన్నే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. రేవంత్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటాన్ని చాలామంది సీనియర్లు జగ్గారెడ్డితో సహా వ్యతిరేకించారు.
రేవంత్ కు పోటీగా
పీసీసీ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్ లాంటి చాలామంది పోటీపడ్డారు. అయితే అధిష్టానం రేవంత్ వైపు మొగ్గుచూపటంతో వ్యతిరేకులంతా ఎంత గోలచేశారో అందరికీ తెలిసిందే. పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రిగా రేవంతే అవుతారని తెలిసినా చాలామంది తనను వ్యతిరేకిస్తునే ఉన్నారు. అనుకున్నట్లుగానే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం పోస్టుకోసం కొందరు పోటీపడ్డారు. అప్పుడు ఎంఎల్ఏలతో అధిష్టానం ప్రతినిధులు అభిప్రాయసేకరణ జరిపి రేవంత్ ను సీఎంగా ప్రకటించింది. ఎప్పుడైతే రేవంత్ ను సీఎంగా అధిష్టానం ప్రకటించిందో అప్పటినుండి వ్యతిరేకులంతా చప్పుడుచేయకుండా కూర్చున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఇపుడు జగ్గారెడ్డి చెప్పిందే.
ముఖ్యమంత్రిగా రేవంత్ ను ప్రకటించిన దగ్గర నుండి ప్రమాణస్వీకారం చేసేమధ్యలోనే సీనియర్లను రాహుల్ పిలిపించుకుని ఫుల్లుగా క్లాసు పీకారు. గొడవలు పెట్టుకోకుండా ప్రజలకిచ్చిన హామీలను నిలుపుకునే విషయంలో అందరు రేవంత్ కు సహకారమందించాలని పదేపదే చెప్పారట. ముఖ్యంగా ఈ విషయాన్ని రాహుల్ తనకు చెప్పినట్లు జగ్గారెడ్డి వివరించారు. క్వశ్చన్ అవర్లో పార్టీలోని అతర్గత విభేదాలపై తాము ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రిపోర్టర్లు, యాంకర్లు పదేపదే రెట్టించినా సీనియర్ నేత ఏమాత్రం తొట్రుపడలేదు. ‘ప్రశ్నలు వేయటం మీహక్కు అలాగే సమాధానం చెప్పటం నా ఇష్టమ’ని గట్టిగా బదులిచ్చారు. వేసే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని, ఏ ప్రశ్నకు ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే చెబుతానని ధీటుగా సమాధానమిచ్చారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే జగ్గారెడ్డి పిరికివాడని జనాలు అనుకుంటారని ఒక యాంకర్ రెచ్చగొట్టారు. దానికి సమాధానమిస్తు తానేంటో జనాలకు బాగా తెలుసన్నారు. తనగురించి ఎవరేమన్నా తాను లెక్కచేయనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
సోషల్ మీడియాపై రియాక్షన్
సోషల్ మీడియా ఇఫుడు వేధింపులపై మాట్లాడుతు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో తనకు బాగా తెలుసన్నారు. తనపై కావాలనే బురదచల్లాలని చూసిన వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలో అదేపద్దతిలో చెప్పానన్నారు. అందుకనే అప్పటినుండి సోషల్ మీడియాలో తనపై ఎవరు మాట్లాడటంలేదన్నారు. రేవంత్ ను వ్యతిరేకించింది పీసీసీ అధ్యక్ష పదవి కోసమే అన్నారు. అప్పటి పరిస్ధితుల్లో పార్టీ పదవికోసం రేవంత్ ను వ్యతిరేకించానని, ఇప్పటి పరిస్ధితుల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ కు పూర్తి మద్దతిస్తున్నట్లు చెప్పారు. పదవుల పంచాయితీ ముగిసిందని, ఇపుడు తమ దృష్టంతా ప్రజలకు సేవచేయటం మీదే ఉందన్నారు. ఇపుడు కూడా పీసీసీ పదవికోసం ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నకు అవునని సమాధినమిచ్చారు. అవకాశం ఉన్నంతలో పీసీసీ అధ్యక్ష పదవికోసం ప్రయత్నాలు చేస్తునే ఉంటానని స్పష్టంగా చెప్పారు.
పార్టీలో చాలామంది తిట్టుకుంటారని, కొట్టుకుంటారనే ప్రచారాన్ని యాంకర్ ప్రస్తావించినపుడు అదే కాంగ్రెస్ పార్టీ స్పెషాలిటి అన్నారు. ‘అవసరమైనపుడు పార్టీలో కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, బయటవాళ్ళు మా మీదకు వస్తే అందరు ఒకటై వాళ్ళమీద పడతాం అదే కాంగ్రెస్ స్పెషాలిటి’ అని తనదైన పద్దతిలో సమాధానమిచ్చారు. ‘పీసీసీ అధ్యక్షపదవి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకు ఎందుకు సపోర్టుచేయటంలేద’ని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సపోర్టుచేయని మాట వాస్తవమే అని అంగీకరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందన్నారు. దొంగపాస్ పోర్టుల వ్యవహారంలో తనను అరెస్టుచేసిన మాట వాస్తవమే అని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. తన ఆపీసులో జరిగిన పొరబాటు కారణంగా తనను అప్పటి ప్రభుత్వం అరెస్టుచేసిందని అంగీకరించారు. బీజేపీ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తు మతరాజకీయాలే బీజేపీ బతుకన్నారు. మతాన్ని ప్రస్తావించి, జనాలను రెచ్చగొట్టకపోతే జనాలు ఓట్లేయరని నరేంద్రమోడికి బాగా తెలుసన్నారు. నరేంద్రమోడి కూడా జనాలను మతంపేరుతో రెచ్చగొట్టి ఓట్లడగటం నిజంగా దౌర్భాగ్యమని జగ్గారెడ్డి మండిపడ్డారు.