చంద్రబాబు నిర్ణయంకోసం ఎదురుచూస్తున్న తమ్ముళ్ళు

చంద్రబాబునాయుడు కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. నిర్ణయం ఏపీకి సంబందించినది కాదు తెలంగాణా వ్యవహారాల గురించే.

Update: 2024-10-05 07:29 GMT
Chandrababu Naidu

చంద్రబాబునాయుడు కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. నిర్ణయం ఏపీకి సంబందించినది కాదు తెలంగాణా వ్యవహారాల గురించే. కొంతకాలంగా ఏపీలోని డెవలప్మెంట్లతో చాలా బిజీగా ఉన్న చంద్రబాబు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సీనియర్ తమ్ముళ్ళతో సమావేశం కాబోతున్నట్లు సమాచారం. ఈ భేటీలో పార్టీ సభ్యత్వ నమోదు, తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలు, తెలంగాణా రాజకీయాల్లో టీడీపీ పాత్ర, పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం, కార్యవర్గం, తెలంగాణా తమ్ముళ్ళల్లో ఏపీలో కేటాయించాల్సిన నామినేటెడ్ పోస్టులు తదితరాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిజానికి తెలుగుదేశంపార్టీ ఏపీలో కన్నా తెలంగాణాలోనే చాల బలంగా ఉండేది. టీడీపీకి మొదటినుండి బీసీల పక్షపాతి అనే పేరొచ్చిందంటే అందుకు పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ కే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇప్పటి నేతలు.

బీసీల పక్షపాతి అన్న పేరులో కూడా తెలంగాణాకు చెందిన బీసీ నేతలే చాలా కీలకంగా వ్యవహరించేవారు. అంతటి ఘనమైన చరిత్ర, గట్టి నేతలున్న టీడీపీ రాష్ట్ర విభజన కారణంగా 2014లో దెబ్బతిన్నది. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చినా తెలంగాణాలో పార్టీ పెద్దగా పుంజుకున్నది లేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పూర్తిగా నేలమట్టమైపోయింది. ఇపుడు 2019లో ఏపీలో అధికారం కోల్పోవటంతో రెండురాష్ట్రాల్లో ఇక టీడీపీ అన్నది చరిత్రలో మాత్రమే మిగిలుంటుందనేట్లుగా చర్చలు జరిగాయి. అయితే అదృష్టంకొద్ది 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. దాంతో ఏపీలో అధికారం కారణంగా తెలంగాణాలో కూడా పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆదివారం తమ్ముళ్ళతో చంద్రబాబు భేట అవబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం.

సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద అందరు దృష్టిపెట్టాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించారు. సమైక్య రాష్ట్రంలో పార్టీకి 70 లక్షలమంది సభ్యత్వం ఉంటే అందులో తెలంగాణాలోనే సుమారు 30-35 లక్షలుండేది. అలాంటిది ఇపుడు చాలావరకు తగ్గిపోయింది. అయితే రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీ పాల్గొనాలని చాలామంది తమ్ముళ్ళు చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారు. అందుకనే ముందు పార్టీ సభ్యత్వాలపైన దృష్టి పెట్టి మళ్ళీ మునుపటి స్ధాయిలో సభ్యత్వాలు చేయించగలిగితే అప్పుడు స్ధానికసంస్ధల్లో గెలుపుపైన విశ్వాసం వస్తుందన్నది చంద్రబాబు ఆలోచన. ఇదే విషయాన్ని గతంలో ఒకసారి చెప్పినా తమ్ముళ్ళతో భేటీలో మళ్ళీ గట్టిగా చెప్పబోతున్నారు.

పార్టీకి కొత్తగా అధ్యక్షుడిని, కార్యవర్గాన్ని ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది. అధ్యక్షపదవి రేసులో అరవింద్ కుమార్ గౌడ్, నందమూని సుహాసిని, బక్కని నర్సింహులు, కాట్రగడ్డ ప్రసూన, సామగోపాలరెడ్డి, నన్నూరి నర్సిరెడ్డి తదితరుల పేర్లు వినబడుతున్నాయి. చంద్రబాబు ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాలి. అధ్యక్షుడిగా ఎవరున్నా, కార్యవర్గంలో ఎంతమంది ఉన్నా చంద్రబాబు మాటే ఫైనల్ అన్న విషయం తెలిసిందే. రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీచేయాలని చంద్రబాబు నిర్ణయిస్తే తమ్ముళ్ళల్లో కొత్త జోష్ వచ్చేస్తుందనటంలో సందేహంలేదు. ఒకపుడు టీడీపీ ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో చాల బలంగా ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇపుడు పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు లేనప్పటికీ క్యాడర్ కు పార్టీపైన గట్టి అభిమానం ఉంది. కాకపోతే నియోజకవర్గాల్లో పార్టీ తరపున క్రియాశీలకంగా నేతలు ఎవరూ లేరు కాబట్టి క్యాడర్ చెల్లాచెదురు అయిపోయుండచ్చు. పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ గెలిచిన అత్యధిక నియోజకవర్గాల్లో సీమాంధ్రులు+టీడీపీ మద్దతుదారులు వేసిన ఓట్లే కీలకం. అలాడే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజమాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు అత్యధిక నియోజకవర్గాల్లో గెలిచారంటే టీడీపీ అభిమానులు, మద్దతుదారులు, క్యాడర్ కూడా కారణమే. చంద్రబాబు గనుక పార్టీని బలోపేతం చేయటంపై దృష్టిపెట్టి చర్యలు మొదలుపెడితే ఇతర పార్టీల్లోని టీడీపీ మద్దతుదారులు, అభిమానులు, క్యాడర్ మళ్ళీ సైకిల్ వెంట నడిచేందుకు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి చివరకు చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

Tags:    

Similar News