రేవంత్, కేటీఆర్ ను కలిపిన ఘనత మోడీకే దక్కుతుందా ?

డీలిమిటేషన్ అమల్లోకివస్తే ఎదురవ్వబోయే రాజకీయసంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకునే నరేంద్రమోడీని వ్యతిరేకించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ గొంతుకలు ఒకటయ్యాయి.;

Update: 2025-03-22 09:47 GMT
Stalin, Revanth and KTR

శతృవుకు శతృవు మిత్రుడనే రాజనీతి అందరికీ తెలిసిందే. చిన్నశతృవులు ఇద్దరినీ మించిన మరో బలవంతుడైన శతృవు కమ్ముకుని వస్తున్నపుడు వేరేదారిలేక శతృవులిద్దరు కలవటం అనివార్యం. పెద్ద శతృవును ఎదుర్కోవటానికి చిన్నశతృవులు ఇద్దరు చేతులు కలపకపోతే ఇద్దరికీ భవిష్యత్తుండదు. చిన్న శతృవులు ఎవరంటే కాంగ్రెస్(రేవంత్), బీఆర్ఎస్. ఇద్దరినీ దెబ్బకొట్టడానికి కమ్ముకుని వస్తున్న బలవంతుడైన పెద్దశతృవు ఎవరంటే నరేంద్రమోడీ. విషయం ఏమిటంటే ఉప్పు నిప్పులాగుండే రేవంత్-కేటీఆర్ చెన్నైలో కలిశారు. మామూలుగా అయితే వీళ్ళిద్దరు ఒకళ్ళకు మరొకళ్ళు ఎదురుపడటానికి కూడా ఇష్టపడరు. అలాంటి ప్రత్యర్ధులు చెన్నైలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. హాజరవ్వటమే కాకుండా ఇద్దరూ ఒకే గొంతుకను వినిపించారు. ఒకేగొంతుకను వినిపించటానికే ఇద్దరూ చెన్నై సమావేశంలో పాల్గొన్నారని చెప్పటం బాగుంటుంది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆధ్వర్యంలో చెన్నైలో సమావేశం జరుగుతోంది. సమావేశం దేనికంటే కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన డీ లిమిటేషన్(Delimitation) కారణంగా దక్షిణాధి రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గిపోతున్నాయి. దక్షిణాధి రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు తగ్గిపోవటమే కాకుండా ఉత్తరాధిలోని కొన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. దీంతో ఏమవుతుందంటే జాతీయ రాజకీయాల్లో దక్షిణాధి రాష్ట్రాల్లోని ఎంపీల ప్రభావం నామమాత్రం అయిపోతుంది. ఈ విషయాన్ని మొదటినుండి స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డీ లిమిటేషన్ను వ్యతిరేకిస్తున్న పార్టీలు, ప్రభుత్వాల అధినేతలతో స్టాలిన్ శనివారం మీటింగ్ ఏర్పాటుచేశారు. ఈ మీటింగుకు రేవంత్(Revanth) తో పాటు కేటీఆర్ కూడా హాజరయ్యారు.

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా స్టాలిన్ వాదనను రేవంత్, కేటీఆర్(KTR) బలంగా మద్దతిస్తున్నారు. అందుకనే ఇద్దరు సమావేశానికి హాజరైంది. రేవంత్, కేటీఆర్ సమావేశంలో పాల్గొనేట్లు చేసిన క్రెడిట్ స్టాలిన్ కు దక్కితే, ఉప్పు నిప్పులాంటి ఇద్దరు ప్రత్యర్ధులను ఏకంచేసిన ఘనత నరేంద్రమోడీ(Narendra Modi)కే దక్కుతుందనటంలో సందేహంలేదు. మోడీ గనుక డీ లిమిటేషన్ వ్యవహారాన్ని తెరమీదకు తీసుకుని రాకపోయుంటే స్టాలిన్ మీటింగ్ పెట్టేవారు కాదు. స్టాలిన్ మీటింగ్ పెట్టకపోయుంటే రేవంత్, కేటీఆర్ పాల్గొనేవారే కాదు. తెలంగాణ(Telangana)లో ప్రతిరోజు రేవంత్ టార్గెట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టైం టేబుల్ వేసుకున్నట్లుగా ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా రేవంత్ పై కేటీఆర్ బురదచల్లని, చల్లించని రోజు లేదనటం అతిశయోక్తి కాదు.

కేటీఆర్ కు ధీటుగా రేవంత్ కూడా ఏదో పద్దతిలో ఎక్కడో ఒకచోట సమాధానంతో రెచ్చిపోతునే ఉన్నారు. నిజానికి ఇద్దరి వల్లా రాజకీయ కాలుష్యం పెరిగిపోతోందన్నది వాస్తవం. అయితే ఇద్దరిలో ఎవరూ తగ్గటంలేదు కాబట్టి జనాలు కూడా వీళ్ళు వెదచల్లే రాజకీయ కాలుష్యానికి అలవాటు పడిపోతున్నారు. అంతటి వైరంతో రగిలిపోతున్న ఇద్దరిని కలిపింది డీ లిమిటేషన్ పాయింటే అనటంలో సందేహంలేదు. చెన్నైలో జరిగిన సమావేశం మొదటిది మాత్రమే. భవిష్యత్తులో ఇంకెన్ని సమవేశాలు జరుగుతాయో, వీళ్ళిద్దరు ఎన్ని సమావేశాల్లో పాల్గొంటారో చూడాలి. ఇద్దరు కూడా మోడీ విధానాలపై ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ ప్రక్రియను ఇపుడు వ్యతిరేకించకపోతే మోడీ వ్యూహం దెబ్బకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ నష్టపోవటం ఖాయం.

వీళ్ళిద్దరు చెబుతున్నదాని ప్రకారం డీలిమిటేషన్ అమల్లోకి వస్తే దక్షిణాధి రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు తగ్గిపోతాయి. ముఖ్యంగా తెలంగాణలో 8 సీట్లు తగ్గుతాయి. అంటే ఇపుడున్న 17 సీట్లు కాస్త 8కి తగ్గిపోతుంది. ఇదే విషయమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతు దక్షిణాధిలో ఎంపీల సీట్లు తగ్గిపోతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మండిపోతున్నారు. కిషన్ వాదనే నిజం అనుకుంటే జనాభా ఆధారంగా చేయబోతున్న డీలిమిటేషన్ లో ఉత్తరాధిలోని కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు పెరుగుతాయి. దక్షిణాధి రాష్ట్రాల్లో సీట్లు తగ్గకపోయినా, ఉత్తరాధిరాష్ట్రాల్లో పెరగబోయే సీట్ల సంఖ్యతో పోల్చుకుంటే దక్షిణాధిలో తగ్గిపోయినట్లే అనుకోవాలి. దక్షిణాధిలో తగ్గవని కిషన్ చెబుతున్నారుకాని ఉత్తరాధిలో సీట్లు పెరగవని మాత్రం చెప్పటంలేదు. డీలిమిటేషన్ అమల్లోకివస్తే ఎదురవ్వబోయే రాజకీయసంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకునే నరేంద్రమోడీని వ్యతిరేకించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ గొంతుకలు ఒకటయ్యాయి.

Tags:    

Similar News