రేవంత్ మెడకు ‘లగచర్ల’ చుట్టుకుంటుందా ?

ఫార్మా కంపెనీలకు భూములు సేకరించాలని అనుకున్న రేవంత్ ముందు ఆ విషయాన్ని స్ధానిక రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళని కన్వీన్స్ చేసుండాల్సింది.

Update: 2024-11-20 06:38 GMT
Victims of Lagacharla village in Delhi

ఏ ముఖ్యమంత్రికి అయినా సొంత నియోజకవర్గంలో తిరుగుండకూడదు. సీఎంగా ఉన్న వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నా తన నియోజకవర్గం బాగా అభివృద్ధిలోకి రావాలన్న ఉద్దేశ్యంతోనే తీసుకుంటారు. కాని సీఎం తీసుకుంటున్న నిర్ణయం వివాదాస్పదమై, జనాలు ఎదురుతిరిగితే అప్పుడు ఏమి చేయాలి ? ఇపుడీ విషయమే రేవంత్ రెడ్డి(Revanth reddy)కి అర్ధమవుతున్నట్లు లేదు. కొడంగల్(Kodangal) నియోజకవర్గంలోని లగచర్ల గ్రామం రెండువారాలుగా వార్తల్లో నిలుస్తోంది. లగచర్ల(Lagacharla) ఇపుడు వార్తల్లో ఊరుగా ఎందుకు మారింది ? ఎందుకంటే రేవంత్ తీసుకున్న నిర్ణయం వల్లే. తెలంగాణాలో ఫార్మా యూనిట్లకు పెద్దఎత్తున భూములు కేటాయించాలని రేవంత్ అనుకున్నారు. ఏ నియోజకవర్గాల్లో భూములు సేకరించాలన్నా, ఫార్మాకంపెనీ(Pharma Company)లకు కేటాయించాలన్నా గొడవలు అవుతాయన్న ఉద్దేశ్యంతో ప్రయోగాత్మకంగా తన నియోజకవర్గం కొడంగల్ నే ఎంచుకున్నారు. 



రేవంత్ ఆలోచన కరెక్టే కాని అమలుచేసిన విధానం వల్లే సమస్య బాగా పెరిగిపోయింది. ఫార్మా కంపెనీలకు భూములు సేకరించాలని అనుకున్న రేవంత్ ముందు ఆ విషయాన్ని స్ధానిక రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళని కన్వీన్స్ చేసుండాల్సింది. ఆపని చేయకుండా రైతులు, గ్రామస్తులతో మాట్లాడే బాధ్యత తన సోదరుడు తిరుపతిరెడ్డికి అప్పగించినట్లున్నారు. ఎప్పుడైతే తిరుపతిరెడ్డి(Tirupati Reddy) రంగంలోకి దిగారో విషయం బాగా వివాదాస్పదమైపోయింది. రేవంత్ మాట్లాడుంటే ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నారు కాబట్టి రైతుల సందేహాలను తీర్చి, ఇవ్వాల్సిన హామీలను ఇచ్చుంటే విషయం ప్రశాంతంగా సెటిల్ అయ్యేదేమో. ఆ పనిచేయకుండా ఎప్పుడైతే సోదరుడికి అప్పగించారో అప్పుడు విషయం పక్కదారిపట్టినట్లు అర్ధమవుతోంది.



 రైతులు, గ్రామస్తులతో తాను మాట్లాడటం వేరు, తన సోదరుడు మాట్లాడటం వేరన్న విషయాన్ని రేవంత్ మరచిపోయారు. తాను మాట్లాడినా, తన సోదరుడు మాట్లాడినా ఒకటే అందరూ ఒప్పుకుంటారన్న అతి థీమాతో ఉండటంతోనే విషయం ఇపుడు వివాదాస్పదమైపోయి జాతీయస్ధాయిలో హైలైట్ అవుతోంది. తాను స్వయంగా రంగంలోకి దిగటమో లేకపోతే మంత్రి లేదా కలెక్టర్ ను రంగంలోకి దింపాల్సిన రేవంత్ ఆపనిచేయకుండా తన సోదరుడిని దింపటమే పెద్ద తప్పు. తిరుపతిరెడ్డి కూడా రైతులు, గ్రామస్తులతో సౌమ్యంగా మాట్లాడకుండా బెదిరించినట్లు మాట్లాడారనే ఆరోపణలు వినబడుతున్నాయి. తాను చెబితే రేవంత్ చెప్పినట్లే అన్న ధీమాతో సోదరుడు మాట్లాడారనే ప్రచారం జరుగుతోంది. రైతులు, గ్రామస్తులను డీల్ చేయటంలో తిరుపతిరెడ్డి పూర్తిగా ఫెయిలయ్యారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అందుకనే సోదరుడి ఫెయిల్యూర్ రేవంత్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. లగచర్లతో పాటు మరో రెండు గ్రామాల్లో కలిసి ఫార్మా యూనిట్ల కోసం 3500 ఎకరాలను సేకరించాలని రేవంత్ టార్గెట్ పెట్టుకున్నారు. 



రైతులు, గ్రామస్తుల భూములను సేకరించాలని అనుకున్నపుడు రేవంత్ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేసుండాలి. తన నియోజకవర్గం, తన గ్రామాల్లోని జనాలు తాను ఏమి చెప్పినా ఎదురుమాట్లడకుండా వింటారన్న అతి విశ్వాసం వల్లే ఇపుడీ పరిస్ధితికి కారణమైంది. భూములు పోయేవాళ్ళల్లో అత్యధికులు గిరిజనులే కావటం కూడా వివాదం ఇంత సంచలనమైపోయింది. బీఆర్ఎస్ హయాంలో ఫార్మా ఇండస్ట్రీ అంటేనే కాలుష్య కారకమని రేవంత్ పదేపదే చేసిన ఆరోపణలు, ప్రకటనలు కూడా ఇపుడు తన మెడకు చుట్టుకుంటున్నాయి. ఫార్మా పరిశ్రమకు సంబంధించి ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేస్తూ తన నియోజకవర్గంలో మాత్రం కాలుష్యకారకమైన ప్రొడక్షన్ యూనిట్లు ఏర్పాటు చేస్తుండటం కూడా రేవంత్ నిర్ణయానికి జనాలు అడ్డం తిరగటానికి మరో కారణమైంది. ఏడాదికి మూడుపంటలు పండే తమ భూములను కాలుష్యకారకమైన పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చేదిలేదని గిరిజన రైతులు గట్టిగా రేవంత్ నిర్ణయానికి అడ్డం తిరిగారు.



 వ్యవసాయం చేయటం, పంటలు పండిచంటం మినహా తమకు వేరే వ్యాపకాలు తెలీవని, ఇపుడీ భూములు ప్రభుత్వం తీసేసుకుంటే తామెలా బతకాలన్న రైతుల ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానంలేదు. గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన దాడి జరిగిన తర్వాత రెండు రోజులు తిరుపతిరెడ్డి వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. లగచర్లతో పాటు మరో రెండు గ్రామాల్లో తిరిగిన తిరుపతిరెడ్డి రైతులు, రైతు కుటుంబాలను బెదిరించారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తమ నిర్ణయానికి ఎదురుతిరిగితే పరిస్ధితులు మామూలుగా ఉండవని తిరుపతిరెడ్డి బెదిరించినట్లు స్ధానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు చూస్తుంటే తిరుపతిరెడ్డి ఓవర్ యాక్షన్ వల్లే వ్యవహారం ఇంతగా వివాదాస్పదమైపోయిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతాచేస్తే రేవంత్ సోదరుడు అన్న ట్యాగ్ తప్ప తిరుపతిరెడ్డికి మరో హోదానే లేదు.

బీఆర్ఎస్ పాత్ర ఎంతుంది ?




 కలెక్టర్ మీద దాడి తర్వాత భూసేకరణ విషయం అత్యంత వివాదాస్పదమవ్వటంలో బీఆర్ఎస్(BRS) పాత్ర చాలానే ఉంది. లగచర్ల ఘటన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు రేవంత్ ను వ్యక్తిగతంగా నెగిటివ్ గా చిత్రీకరించటంలో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందనే అనుకోవాలి. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన పని తాను చేసుకుపోతోంది. తానంటేనే నిలువెల్లా మండిపోయే కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) లాంటి వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నపుడు రేవంత్ ఎంత జాగ్రత్తగా ఉండాలి ? కొడంగల్ తన నియోజకవర్గం కాబట్టి తనకు ఎదురులేదని అనుకున్నట్లున్నారు. అందుకనే గొడవజరిగి రెండువారాలు దాటిపోయినా ఇప్పటివరకు రైతులు, గ్రామస్తులతో రేవంత్ మాట్లాడలేదు. పైగా ఎన్ని గొడవలు జరిగినా భూములు సేకరించటం ఖాయమని తిరుపతిరెడ్డి చెబుతున్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. గ్రామస్తులు, రైతులను బీఆర్ఎస్ రెచ్చగొట్టిందో లేకపోతే గొడవ జరిగిన తర్వాతే కారుపార్టీ నేతలు సీన్ లోకి ఎంటరయ్యారో తెలీదు. ఏదేమైనా పై రెండింటిలో ఏది జరిగినా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ స్పష్టంగా బయటపడింది. కలెక్టర్ మీదే గ్రామసభలో దాడి జరిగిదంటే సమాచార సేకరణలో పోలీసులు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎంతుందో అర్ధమవుతోంది.  


కలెక్టర్ మీద దాడికి కారణమని గుర్తించిన వారిని, అనుమనించిన వారి కోసం పోలీసులు పై మూడుగ్రామాల్లో అర్ధరాత్రుళ్ళు ఇళ్ళపైన దాడులు చేశారు. దాడికి కారకులు ఇళ్ళలో లేకపోతే ఇంట్లోని ఆడవాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో నిర్బంధించారు. దాంతో వివాదం మరింతగా ముదిరిపోయింది. మగవాళ్ళ ఆచూకీ చెప్పమని తమను పోలీసులు బాగా టార్చర్ పెట్టారని మహిళలు కన్నీరు మున్నీరవుతు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్(National SC and ST Commission), జాతీయ మానవహక్కుల కమిషన్(National Human Rights Commission) కు ఫిర్యాదు చేశారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో బాధిత మహిళలతో బీఆర్ఎస్ నేతలు మీడియాతో కూడా మాట్లాడించారు. కొడంగల్ కోర్టులో బాధితులకు అవసరమైన న్యాయ సహాయం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ దగ్గరకు బాధితులు ముఖ్యంగా మహిళలను తీసుకెళ్ళి ఫిర్యాదులు చేయించింది. రాష్ట్రపతి ద్రౌపధి ముర్ము(President Droupadi Murmu) దగ్గరకు బాధిత మహిళలను తీసుకెళ్ళి ఫిర్యదులు చేయించే ఉద్దేశ్యంతో అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షంగా తాను ఏమిచేయాలో బీఆర్ఎస్ అంతా చేస్తోంది. ఇదే సమయంలో అధికారపార్టీగా విషయాన్ని సున్నితంగా డీల్ చేయటంలో కాంగ్రెస్ ఫెయిలైంది.



 ఇదే విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు రేవంత్ ఫెయిల్యూర్లను కవర్ చేసుకోవటానికి లగచర్ల ఘటనను కావాలనే రేపినట్లు మండిపడ్డారు. పాలనలో తన ఫెయిల్యూర్లను బీఆర్ఎస్ పైకి నెట్టేసేట్లుగా రేవంత్ మాట్లాడుతున్నారని చెప్పారు. తమ హాయంలో ఫార్మాయూనిట్ల కోసం 14 వేల ఎకరాలను సేకరించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేస్తున్నారు. తాము సేకరించిన వేలాది ఎకరాలుండగా మళ్ళీ కొత్తగా ఫార్మా యూనిట్ల పేరుతో రేవంత్ భూమిని సేకరించాల్సిన అవసరం ఏముందని నిలదీస్తున్నారు. తన అల్లుడి కంపెనీని కొడంగల్ లో ఏర్పాటు చేయించాలన్న ఆలోచనతోనే రేవంత్ కొత్తగా భూసేకరణ చేస్తున్నట్లు కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్ లో సేకరించాలని అనుకుంటున్న భూమంతా అల్లుడి కంపెనీ కోసమే అని బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) కూడా ఆరోపిస్తున్నారు. రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఏ హోదాలో రైతులు, గ్రామస్తులను బెదిరిస్తున్నాడంటు కేటీఆర్, డీకే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రేవంత్ చేతకానితనంవల్లే లగచర్ల గ్రామసభలో కలెక్టర్ మీద దాడి జరిగిందని అరుణ అంటున్నారు. కలెక్టర్ మీద జరిగిన దాడిని ఖండించిన అరుణ అందుకు కారకుడు మాత్రం రేవంతే అని గట్టిగా ఆరోపిస్తున్నారు.



తిరుపతిరెడ్డి యధేచ్చగా నియోజకవర్గంలో తిరుగుతున్నపుడు మహబూబ్ నగర్ ఎంపీగా తనకు మాత్రం పోలీసులు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని అరుణ మండిపోతున్నారు. గొడవ జరిగిన తర్వాత లగచర్ల బాధితులను పరామర్శించేందుకు ఎంపీ ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదని డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ మీద దాడికి కొడంగల్ మాజీ ఎంఎల్ఏ పట్నం నరేందర్-బొగమోని సురేష్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలే కారణమని పోలీసులు చెప్పటాన్ని కేటీఆర్ ఖండించారు. తమ పార్టీ నేతల మధ్య ఫోన్ సంభాషణలు జరిగితే తప్పేమిటని పోలీసులను కేటీఆర్ నిలదీశారు. ‘పట్నంతో సురేష్ ఎన్నిసార్లయినా ఫోన్లో మాట్లాడుకుంటారని ఆ విషయం మీకెందుకు’ అని కేటీఆర్ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ‘గొడవకు ముందురోజు ఇద్దరు 84 సార్లు ఫోన్లో మాట్లాడుకుంటే అరెస్టు చేసేస్తారా’ అంటు కేటీఆర్ నిలదీస్తున్నారు. పట్నం అరెస్టు విషయమై కోర్టులో జరుగుతున్న విచారణలో జడ్జీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. స్మూత్ గా జరిగిపోవాల్సిన భూసేకరణ విషయాన్ని అత్యంత వివాదాస్పదం చేసి జాతీయస్ధాయికి చేర్చటంలో రేవంత్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడుతోంది. మరి ఈ వివాదం చివరకు ఎక్కడిదాకా వెళుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News