ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో పేరుకుపోయిన మట్టి, బండరాళ్లను కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నారు. కన్వేయర్ బెల్టుకు మరమ్మతులు చేయడంతో టన్నెల్ లోపల సహాయ పనులు వేగిరం అయ్యాయి. మరో వైపు టన్నెల్ భూగర్భం నుంచి ఉబికి వస్తున్న నీటిని మోటారు పైపుల సాయంతో బయటకు తోడేస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ను కట్ చేసి దాని భాగాలను లోకోమోటివ్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, దక్షిణ మధ్య రైల్వే, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్,ఎన్డీఆర్ఎఫ్,హైడ్రా,ర్యాట్ హోల్ మైనర్స్, సింగరేణి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా , జేపీ కన్ స్ట్రక్షన్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కార్మికులు మూడు షిఫ్టుల వారీగా టన్నెల్ లోపలకు వెళ్లి సహాయ పనులను ముమ్మరం చేశారు.
మృతదేహాల కోసం తవ్వకాలు
టన్నెల్ కూలిన ప్రాంతంలో పేరుకుపోయిన మట్టి, బురద, నీటిని తవ్వి అందులో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీసేందుకు నిపుణులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. మృతదేహాలున్నట్లు డీపీఆర్ డేటాలో తేలడంతో ఆయా ప్రాంతాల్లో నిపుణులు తవ్వకాలు చేపట్టారు. టన్నెల్ కూలిన ప్రాంతం నుంచి నీరు పెద్ద ఎత్తున వస్తుండటంతో వాటిని భారీ మోటార్లతో పైపుల ద్వారా బయటకు తోడేస్తున్నారు. టన్నెల్ లోపల పేరుకుపోయిన మట్టిని ఫైర్ వాటర్ జెట్ పంపు సాయంతో తొలగిస్తున్నారు. మరో 36 గంటల్లో టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్ ను పూర్తి చేస్తామని గురువారం ఓ ఎన్డీఆర్ఎఫ్ అధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలపై సమీక్ష
ఎస్ఎల్ బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో సహాయక చర్యలను సమీక్షించేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగంలోని శిథిలాలను తొలగిస్తున్నామని డిజాస్టర్ మేనేజ్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తూ శిథిలాలను తొలగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ గుర్తించిన సర్ఫేస్ డిస్టర్బెన్స్ ప్రాంతాల్లో మట్టితీత పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
టన్నెల్ సహాయ పనుల్లో రోబోటిక్ సేవలు
రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలతోపాటు ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం కూడా రంగంలోకి దిగింది.ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాద ప్రదేశంలో రోబోటిక్ సేవల కోసం హైదరాబాద్ కు చెందిన ఎన్ వీ రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్లోకి వచ్చింది. టన్నెల్ బోరింగ్ మిషన్ ఎడమవైపు నుంచి వాటర్ జెట్ ల ద్వారా బురదను తొలగించే పనులు ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాల ద్వారా వేగంగా జరుగుతుంది. కన్వేయర్ బెల్టు పునరుద్ధరించామని,రెస్క్యూ ఆపరేషన్ లో ఎదుర్కొంటున్న ఆటంకాలను అధిగమిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు అధికారులు వివరించారు. టన్నెల్ లోపల వెంటిలేషన్, లైటింగ్ సదుపాయాలను ముందుకు పొడిగించారు.
టన్నెల్ కూలిపోయే ప్రమాదముందని హెచ్చరించినా...
ఎస్ఎల్ బీసీ సొరంగం ముఖద్వారం నుంచి 13.88 కిలోమీటర్ల నుంచి 13.91 కిలోమీటర్ల మధ్య ఫాల్ట్ జోన్ ఉందని 2020వ సంవత్సరంలో అంబర్గ్ టెక్ ఏజీ సర్వే చేసి నివవేదికను టన్నెల్ సీస్మిక్ ప్రిడిక్షన్ – 303 ప్లస్ పేరిట 2020 జనవరి నెలలో జేపీ సంస్థకు సమర్పించిందని సమాచారం. టన్నెల్ లోపల ఫాల్ట్ జోన్ ఉందని, కూలిపోయే అవకాశాలున్నాయని హెచ్చరించినా తవ్వకాలు కొనసాగించడం వల్ల ప్రమాదం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. జైప్రకాష్ అసోసియెట్ లిమిటెడ్ కంపెనీకి సమర్పించిన ఈ నివేదికను ఆ సంస్థ రాష్ట్ర నీటిపారుదల శాఖతో పంచుకోలేదని అంటున్నారు.
కమీషన్ల కోసం ఫాల్గ్ జోన్ లో టన్నెల్ తవ్వకాలు : కేటీఆర్
ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రాజెక్ట్‌లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా ఉన్నా, ప్రజా ధనాన్ని వెచ్చించి టన్నెల్ తవ్వారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రెడ్ జోన్ అని ప్రకటించినా టన్నెల్ తవ్వకాలు కొనసాగించడం వల్లనే ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. టన్నెల్ లోపల 8 మంది చిక్కుకు పోయారని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథాగా మారిందని కేటీఆర్ విమర్శించారు. ఫాల్ట్ జోన్ లో టన్నెల్ తవ్వకాలను కాంగ్రెస్ పార్టీ కమిషన్ల కోసమేనా? అని ఆయన ప్రశ్నించారు. టన్నెల్ కూలిన ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.