ఏడుకొండలవాడా, వెంకన్నా! ఇన్ని ఘోరాలు నిజమేనా స్వామీ!!

తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యలాపాలు, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతాయని అంటే నమ్మగలమా.. కానీ నమ్మమంటున్నారు రమణ దీక్షితులు

Update: 2024-02-22 15:42 GMT
Tirumala Temple

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. అటువంటి చోట కొన్నేళ్లుగా అసాంఘిక కార్యలాపాలు జరుగుతున్నాయని... గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతాయని అంటే నమ్మగలమా.. ఎవరో చెబితే ఉత్తుత్తి ఆరోపణలా ఉంటుంది.. కానీ సాక్షాత్తు స్వామి వారి సన్నిధిలో ఏళ్ల తరబడి ప్రధాన అర్చకత్వం చేసిన రమణ దీక్షితులు స్వయానా ఈ విషయాలు వెల్లడించారు.. ఆయన విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ఈ కామెంట్స్ పై పలువురు స్పందించారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా కొందరు పూజారులు- రమణ దీక్షితులు.. వీడియోను ముక్త కంఠంతో ఖండించగా భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సీరియస్ గా స్పందించారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. సీబీఐ విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.


ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్...

టీటీడీలో చాలా మంది క్రీస్టియన్ లు ఉండటమే పెద్ద సమస్య అని రమణ దీక్షితులు అన్నారు. ‘ఈఓ ధర్మారెడ్డి ఒక క్రిస్టియన్, సీఎం జగన్మోహనరెడ్డి క్రీస్టియన్. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే దహనం చేయలేదు. ఖననం చేశారు. ఆయనను చూస్తేనే తెలుస్తుంది కదా, బొట్టు కూడా పెట్టుకోడు. వేషధారణ, మాట కూడా అంతే. అహోబిలంలో 2 వందల సంవత్సరాల కిందట కొండ మీద ఒక గుహాలో ఓ జియ్యర్ లోపలకు వెళ్లి సమాధి అయ్యాడట. ఆ గుహలో అప్పట్లో విజయనగర సామ్రాజ్యం కాలంలో పెద్ద ఎత్తున నిధులు పెట్టారని అంటారు. ఇప్పుడు ఉన్న జియ్యర్ తర్వాత వచ్చే రెండో జియ్యర్ కు ఆ నిధులు అందాలని సంకల్పం చేశారట. దాన్ని బయటకు తీయాలని చాలా సార్లు అహోబిలం జియ్యర్ దగ్గరికి ధర్మారెడ్డి వెళ్లి వస్తున్నారు. అలానే అవినాష్ రెడ్డి కోసం చాలా సార్లు హైదరాబాద్ కు తిరుగుతున్నారు’ అంటున్నారు రమణ దీక్షితులు.

జియ్యర్లు సాష్టాంగ నమస్కారం చేస్తారు!

పెద జియ్యర్, చిన జియ్యర్ ధర్మారెడ్డికి సాస్టాంగపడతారు. ఇది చాలా మంది నమ్మరు కానీ నిజం అంటారు రమణ దీక్షితులు. తిరుమల కిచెన్ లో అన్ని అసాంఘీక కార్యక్రమాలు జరుగుతుంటాయని అన్నారు. గుట్కా ప్యాకెట్ లు అన్నీ చింపి బయట పోస్తుంటారని అన్నారు.

నిధుల కోసం తిరుమలలో తవ్వకాలు...

‘టీటీడీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చెబితే వినదు. సీఏజీ చెబితే మేము ఒప్పుకోం. సమాచార హక్కు చట్టం మేము ఒప్పుకోం అంటే కూడా కాదంటుంది. మళ్లీ ఈఓ, చైర్మన్, డైరెక్టర్లు.. ఇలా అన్నీ నియామకాలు ప్రభుత్వమే చేస్తుంది. తిరుమల ఆలయంలోని పరకామణిలో గ్రానైట్ తీసి ఆర్టిఫిషియల్ ఏముందో అది చూపించాలని తవ్వకాలు చేస్తున్నారు. అంతకు ముందు రాతి బండలు ఉండేవి అయితే దాని మీద పరకామణి కోసం గ్రానైట్ వేశారు, ఇప్పుడు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతుండవచ్చు. వేయి కాళ్ల మండపం గానీ, దేవ మండపం గానీ అన్నీ నిధుల కోసమే తవ్వారు’ అంటున్నారు రమణ దీక్షితులు.

నైవేద్యం, కైంకర్యాలు సరిగా జరడం లేదు..

శ్రీవారికి నైవేద్యం, కైంకర్యాలు సరిగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రమణ దీక్షితులు. స్వామివారిని చూస్తుంటే బాధేస్తుందని అన్నారు. స్వామివారి ఎత్తున బట్టి ఎంత నైవేద్యం పెట్టాలనేది ఉంటుందన్నారు. భక్తుల సంఖ్య, తలనీలాలు సమర్పించిన వారు, హుండీ కలెక్షన్బయటకు చెబుతారు కానీ ప్రతి రోజు వచ్చే బంగారం, వెండి ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.

అమిత్ షా కు లేఖ

తిరుమలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంపై కొన్నేళ్లుగా వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. దీంతో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా లేఖ రాశారు. సీబీఐతో విచారాణ జరిపించాలని కోరారు.

స్పందించిన ప్రధాన అర్చకులు...



ఆరోపణలు ఎదుర్కొన్న ఈవో స్పందించలేదు గాని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు ఒకింత తీవ్రంగానే ఖండించారు. "తిరుమలలో పూజావిధానాలన్నీ ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయి. రమణ దీక్షితులు ఆరోపణలు సరికావు" అన్నారే తప్ప ఎందుకు సరికావో సోదాహరణంగా వివరించలేకపోయారని అనిపిస్తోంది.

“తిరుమల శ్రీవారి ఆలయంలో బయట నుంచి స్తంభాలు తెచ్చి ఆలయంలో ప్రతిష్టించారు. ఆలయంలో తవ్వకాలు, పూజ కైంకర్యం జరగటం లేదని గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. శ్రీవారి ఆలయంలో పూజా విధానం ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం. తిరుమలరాయ మండపంలో స్తంభాలు పెట్టారని, గోడలకు చిల్లులు, తవ్వకాలు చేశారనే ఆరోపణ అవాస్తవం. 10 ఏళ్ల కిందట రాతి స్తంభాలకు సపోర్ట్ గా కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రమణ దీక్షితులే ప్రధాన అర్చకులు. 80 వేల జీతం తీసుకుంటూ, ఆలయానికి రమణ దీక్షితులు రావడం లేదు. సోషల్ మీడియాలో ఇలాంటి అవాస్తవాలు వంశ పారంపర్య అర్చకులు చేయడం సబబు కాదు" అన్నారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు.

" టీటీడీ ఈవో ఏవి. ధర్మారెడ్డి ధర్మారెడ్డి తన సొంత ఊరిలో గుడి కట్టించుకొని నిత్యా పూజలు చేయిస్తున్నారు" ఆయన టీ షార్ట్ వేసుకుంటే క్రిస్టియన్ అవుతారా? అయితే మీరు (రమణ దీక్షితులు) కూడా టీ షర్ట్ వేసుకుని మాట్లాడారు. మరి మిమ్మల్ని ఏమనుకోవాలి. గొడవలు వద్దనే చర్యలు తీసుకోవడం లేదు" అంటున్నారు వేణుగోపాల్ దీక్షితులు. క్రమశిక్షణ తప్పితే చర్య తీసుకునే అధికారం టీటీడీకి ఉంది కదా అనే దానికి వారి నుంచి సమాధానం లేదు.

"తిరుమలలో అన్ని కైంకర్యాలు సజావుగా ఆగమ శాస్త్రం ప్రకారం సాగుతున్నాయి. పరిధి దాటి ఈవో, చైర్మన్లు కైంకర్యాల్లో జోక్యం చేసుకోవడం లేదు" అని అనడం మినహా మరో సమాధానం ఆయన నుంచి రాకపోవడం గమనార్హం. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి దృష్టికి రాష్ట్ర ప్రభుత్వ తీరు, టిటిడి వ్యవహార శైలి వెళ్ళింది గనుక దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News