‘చాముండి’ కొండ హిందువులది కాదు: డీకే శివకుమార్
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి;
By : The Federal
Update: 2025-08-27 08:33 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం మరో వివాదాస్పద ప్రకటన చేశారు. మైసూర్ లోని ప్రసిద్ధ చాముండేశ్వరీ ఆలయం ఉన్న చాముండి కొండ కేవలం హిందువుల ఆస్తి కాదని, ఇది అన్ని మతాలకు చెందినదని అన్నారు. దీనిని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా ఖండించింది.
ఈ సంవత్సరం సెప్టెంబర్ 22న చాముండి కొండలపై జరిగే ప్రపంచ ప్రఖ్యాత ‘మైసూర్ దసరా-2025’ వేడుకలను ప్రారంభించడానికి బాను ముష్తాక్ ను ఆహ్వానం పలికారు. ఆమె ఈ మధ్య బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్నారు.
దీనిపై సనాతన ధర్మ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. ఇది కేవలం హిందువులకు సంబంధించింది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘చాముండి కొండ, చాముండి దేవత ప్రతి మతానికి చెందినవి. ఇది హిందువుల ఆస్తి మాత్రమే కాదు. అన్ని వర్గాల ప్రజలు చాముండి కొండలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. అది వారి నమ్మకం, మేము చర్చిలు, జైన దేవాలయాలు, దర్గాలు, గురుద్వారాలకు వెళ్తాము. ఇది అంతా రాజకీయం’’ అని శివకుమార్ అన్నారు.
మతాంతర వివాహాలు, ఒక మతానికి చెందిన వ్యక్తులు మరొక మతాన్ని విశ్వసిస్తున్నారని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు. ‘‘అయోధ్య రామమందిరం కేవలం హిందువులకే ఎందుకు పరిమితం కాలేదు?
మీరు అక్కడ అలాంటి బోర్డు ఎందుకు పెట్టలేదు? ఇది లౌకిక దేశం, రాజ్యాంగం ఉంది. ప్రతి ఒక్కరికి రక్షణ ఉంది. ప్రతి ఒక్కరూ తమ నమ్మకాన్ని, విశ్వాసాన్ని అనుసరించవచ్చు’’ అని ఆయన అన్నారు.
బీజేపీ ఏమన్నదంటే..
శివకుమార్ ప్రకటనపై అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక తీవ్రంగా స్పందించారు. చాముండి కొండ కచ్చితంగా హిందువుల ఆస్తి, అది ముస్లింలది కాదని అన్నారు.
‘‘వందమంది డీకే శివకుమార్ లు వచ్చినా వారు దానిని మార్చలేరు. ఇది పక్కా హిందువుల ఆస్తి, చాముండి కొండ, ధర్మస్థల, తిరుపతి, శబరిమల ఇవన్నీ హిందువుల ఆస్తి. మీరు చాముండి కొండ వద్ద వస్తువులను తాకడానికి లేదా మార్చడానికి ప్రయత్నిస్తే అది తిరుగుబాటుకు దారి తీస్తుంది.
జాగ్రత్తగా ఉండండి. నేను కాంగ్రెస్ పార్టీకి ఈ హెచ్చరిక చేస్తున్నాను’’ అని బీజేపీ నాయకడు అన్నారు. శివకుమార్ వ్యాఖ్యలను మైసూర్ ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ కూడా ఖండించారు.
‘‘గౌరీ హబ్బా(పండగ) రోజున డీసీఎం డీకే శివకుమార్ చాముండి బెట్ట(కొండ), చాముండి దేవరు హిందువుల ఆస్తి కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య పూర్తిగా ఖండించదగినది’’ అని మైసూర్ రాజకుటుంబ వారసుడు వడియార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
‘‘చాముండి బెట్ట ఒక శక్తి పీఠం శాస్త్రాలచే పవిత్రం చేయబడింది. కోట్లాది మంది హిందువులు గౌరవిస్తారు. ఈ ఆలయం ఒకప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ హిందు ఆస్తిగానే ఉంటుంది.’’ అని ఆయన అన్నారు. కర్ణాటక ప్రజలు ప్రతి మతాన్ని గౌరవిస్తారని, కానీ హిందూ పండుగలు, సంప్రదాయాలు, దేవాలయాలపై నిరంతరం జరుగుతున్న దాడిని వారు ఎప్పటికీ సహించరని అన్నారు.
బాను ముష్తాక్ వివరణ..
దసర ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముష్తాక్ ను ఆహ్వానించాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ నాయకులు, ఇతరులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పాత వీడియో వైరల్ అయింది.
ఈ వీడియోలో ముష్తాక్ కన్నడ భాషను దేవత భువనేశ్వరిగా పూజించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు, ఆమె వంటి వ్యక్తులకు ఇది మినహయింపు అని పేర్కొన్నారు.
దసరాను ప్రారంభించడానికి అంగీకరించే ముందు చాముండేశ్వరి దేవత పట్ల ఆమెకున్న భక్తిని స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మైసూర్ ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ సహ పలువురు బీజేపీ నాయకులు ముష్తాక్ ను కోరారు.
అయితే ముష్తాక్ తన పాత ప్రసంగంలో కొన్ని ఎంపిక చేసిన భాగాలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా తన ప్రకటనను వక్రీకరించారని ఆమె అన్నారు.