తమిళనాడు తొలి ఆర్థిక సర్వే: వృద్ధిరేట్ 8 శాతం దాటుతుందని అంచనా
నాలుగో తరం కార్మిక నైపుణ్యాన్ని సాధించాలని సూచన;
By : The Federal
Update: 2025-03-13 12:56 GMT
విజయ్ శ్రీనివాస్
దేశంలో రెండో ధనిక రాష్ట్రమైన తమిళనాడు 2030 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని తమిళనాడు ఆర్థిక సర్వే 2025 తెలిపింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో తమిళనాడులో జరిగిన మొట్టమొదటి ఆర్థిక సర్వే ఇది.
వ్యూహాత్మక పెట్టుబడులు, వైవిధ్యభరితమైన ఆర్థిక స్థావరంతో రాష్ట్రం జాతీయస్థాయి వృద్దిరేట్ ను అధిగమిస్తుందని సర్వే అంచనా వేసింది.
బలమైన వృద్ది
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పనితీరు బాగా ఉంది. వృద్దిరేటు 8 శాత కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. భారత వృద్దిరేటుకు దక్షిణాది రాష్ట్రం కీలకంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
2023-24 లో తమిళనాడు స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ) రూ. 27.22 లక్షలకు చేరుకుంది. ఇక్కడ నామమాత్రపు వృద్దిరేటు 13.71 శాతం, వాస్తవ వృద్దిరేట్ 8.33 శాతం అని ఆర్థిక సర్వే 2025 లో హైలైట్ చేసింది.
జీడీపీలో తమిళనాడు వాటా ఎంతంటే..
దేశ జీడీపీలో తమిళనాడు వాటా దాదాపు 9 శాతంగా ఉంది. ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. అలాగే తలసరి ఆదాయం విషయంలో కూడా రూ. 2.78 లక్షలుగా ఉంది. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ అని సర్వే వెల్లడించింది.
దేశంలోనే అత్యంత ఎక్కువ పారిశ్రామికీకరణ చెందిన రాష్ట్రంగా పేరుగాంచిన తమిళనాడులో ఆటోమొబైల్ తయారీ, వస్త్రాలు, తోలు వస్తువులు, ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. దేశ తయారీ జీడీపీకి గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది. సర్వేలో గుర్తించినట్లుగా జాతీయ ఉత్పత్తిలో 11.90 వాటా దీని సొంతం.
తమిళనాడులో ద్వితీయ శ్రేణి పట్టణాలలో కూడా ఆర్థిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ కోయంబత్తూర్, మధురై, తిరుపూర్ వంటి పట్టణ కేంద్రాలలో ఆర్థిక కార్యకలాపాలు విస్తరించి సమతుల్య వృద్ది ఏర్పడింది. ఇది ప్రపంచ ఆర్థిక సవాళ్ల నుంచి రాష్ట్రాన్ని రక్షించడంలో సాయపడిందని సర్వే తెలిపింది.
శ్రామిక నైపుణ్యం పెంచడం..
రాష్ట్రం ఇప్పుడున్న పారిశ్రామికాభివృద్దిని నిలబెట్టుకోవాలంటే తమిళనాడు ఇండస్ట్రీ నాలుగో తరం టెక్నాలజీని స్వీకరించి అప్ డేట్ కావాలి. అందుకు ముందుగా తన శ్రామిక శక్తిని, నైపుణ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సర్వే నొక్కి చెప్పింది.
తమిళనాడు ఆర్థిక వ్యవస్థలో సేవలరంగం ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రాష్ట్ర స్థూల రాష్ట్ర విలువ ఆధారిత (జీఎస్వీఏ) కు 53.63 శాతంగా వాటాను అందిస్తోంది. తయారీ రంగం 33.37 శాతం వాటాతో దగ్గరగా ఉంది. భూగర్భ జల క్షీణత, వాతావరణ మార్పు వంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వ్యవసాయం కీలకమైనదిగా ఉంది. ఇది జీఎస్వీఏకు ఆరుశాతం వాటాను అందుతుంది.
వాతావరణం ఆధారిత పంటలు, రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి వాతావరణానికి అనుగుణంగా వ్యవసాయ పద్దతులను ముందుగానే అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను కూడా సర్వే వివరించింది.
కార్మిక మార్కెట్..
కార్మిక మార్కెట్ డైనమిక్స్ కూడా సానుకూల ధోరణులు ఉన్నట్లు సర్వే పేర్కొంది. తమిళనాడు కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 2019- 20 అలాగే 2023-24 మధ్య 64.6 శాతానికి పెరిగింది.
ఇది జాతీయ సగటు 64.3 శాతం కంటే ఎక్కువ. ఈ పెరుగుదల ముఖ్యంగా తయారీ, సేవలలో నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడంలో రాష్ట్రం నిబద్దతను వివరిస్తుంది. ఇది మరింత స్థిరమైన ఆర్థిక శక్తిని నిర్ధారిస్తుంది.
అలాగే తమిళనాడులో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ఫలితాలను కూడా హైలెట్ చేసింది. ఈ సమావేశంలో తమిళనాడు రూ. 6.64 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరంచింది.
ఈ సమావేశాల ద్వారా 14.55 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజలో ఉందని చెబుతోంది.
తమిళనాడు మధ్యకాలిక విజయం దాని జనాభా ప్రయోజనం, మౌలిక సదుపాయాలను పెంచుకోవడంపై ఆధారపడి ఉంటుంది. స్థిరత్వంపై దృష్టి సారించిందని సర్వే తేల్చింది.