‘తుంగభద్ర డ్యాం క్రెస్ట్ గేట్‌ను 4 రోజుల్లో పునరుద్ధరించాలి’
తుంగభద్ర డ్యాం క్రెస్ట్ గేటు పునరుద్ధరణ పనులను నాలుగు రోజుల్లోగా పూర్తి చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. త్వరలో వర్షాలు కురవబోతున్నాయని చెప్పారు.
కర్ణాటకలోని తుంగభద్ర రిజర్వాయర్ 19వ క్రెస్ట్ గేటు కొట్టుకుపోవడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి నీరు వృథాగా పోతోంది. ఇప్పటికే ఇంజనీర్ల బృందం మరమ్మతు పనులు మొదలుపెట్టింది. కాగా గేట్ పునరుద్ధరణ పనులు నాలుగు రోజుల్లోగా పూర్తి చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. డ్యాంను పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. నీరు వృథాగా పోతోందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పనులు త్వరగా పూర్తయి, డ్యాం మళ్లీ నిండుకుండలా కనిపిస్తుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీలు, శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు.
అన్ని కాల్వల ద్వారా నీరు ప్రవహిస్తున్నందున పంటలు వేసిన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మూడు రాష్ట్రాల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆగస్టు 17-18 మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఆ లోపుగా క్రెస్ట్ గేట్‌ను పునరుద్ధరించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చన్నారు.
70 ఏళ్లలో ఇదే తొలిసారి..
డ్యాం నిర్మాణ పనులు 1948లో ప్రారంభమై 1953లో పూర్తయ్యాయి. 1954 నుంచి కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది. డ్యాం పరిశీలించిన అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘‘డ్యామ్‌కు 70 ఏళ్లు నిండాయి. ఇంతవరకు ఈ డ్యామ్‌లోని 33 గేట్లకు చైన్‌లింక్ స్నాప్ జరగలేదు. మొదటిసారి 19వ గేటులో జరిగింది. ఈ ఏడాది డ్యామ్‌కు 115 టీఎంసీల నీరు వచ్చింది. ఇందులో 25 టీఎంసీలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతుల పొలాలకు కాలువల ద్వారా విడుదల చేశాం. మొదటి పంటకు 90 టీఎంసీల నీరు అవసరం కాగా.. ప్రస్తుతం డ్యాంలో 90 టీఎంసీల నీరు ఉంది. నేటి నుంచి మొదటి పంటకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.’’ అని చెప్పారు.
కాగా దెబ్బతిన్న 19వ గేటు నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు బయటకు ప్రవహిస్తోందని, నీటి ప్రవాహం మరమ్మతు పనులకు ఆటంకంగా మారిందని క్రెస్ట్ గేటు పునరుద్ధరణ పనులు చేపడుతున్న నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. నీటిమట్టాన్ని 1,629 అడుగుల నుంచి 1,621 అడుగులకు తగ్గితే పనులు చేయడం సాధ్యమవుతుందన్నారు.