కర్ణాటక రాష్ట్ర బంద్ విజయవంతమైందా?
కన్నడ- మహారాష్ట్ర మధ్య మళ్లీ మొదలైన సరిహద్దు వివాదం, కండక్టర్ పై దాడి తో భగ్గుమన్న కర్ణాటక;
By : The Federal
Update: 2025-03-22 13:04 GMT
కర్ణాటకలోని అంతర్భాగమైన బెళగావిలో మరాఠీ మాట్లాడలేదని కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్ పై దాడి జరిగిన నేపథ్యంలో కన్నడ భాషా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా నిరసనకారులు రోడ్లపై పడుకుని ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. ఓ చేతిలో గడ్డి, మరో చేతిలో ప్లకార్డులు పట్టుకుని మహారాష్ట్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చర్యతో కన్నడ ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ, ఓలా, ఉబేర్ సంస్థలు బంద్ కు సంఘీభావం ప్రకటించాయి.
రాజధాని బెంగళూర్ లో మైసూర్ బ్యాంక్ సర్కిల్ లో కార్యకర్తలు గుమిగూడి దాడికి గురైన కండక్టర్ కు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దాడి జరిగిన బెళగావిలో పరిస్థితి అదుపు తప్పకుండా భారీ స్థాయిలో భద్రతా దళాలను మోహరించారు.
ముఖ్యమైన సేవలపై ప్రభావం లేదు..
బంద్ ఉన్నప్పటికీ మెట్రో, రైల్వే, విమానాశ్రాయా కార్యకలాపాల వంటి ముఖ్యమైన సేవలు ప్రభావితం కాలేదు. అయితే కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దు చుట్టూ వివాదం ఉండటంతో ఈ రెండు రాష్ట్రాలను అనుసంధానించే మార్గాల్లో ఇరు రాష్ట్రాల బస్సులు కొన్ని ఆంక్షలతో నడిచాయి.
బంద్ కు మద్దతుగా రెస్టారెంట్లు, సినిమా హాళ్లు మూసివేయాలని నిరసనకారులు విజ్ఞప్తి చేశారు. కొన్ని అంగీకరించినప్పటికీ చాలా వాణిజ్య సంస్థలు సాధారణంగా పనిచేస్తునే ఉన్నాయి.
బెంగళూర్ లోని కొన్ని ప్రాంతాల్లో వీధులు ఖాళీగా కనిపించాయి. అయితే ప్రయాణీకులు బస్ టెర్మినల్స్ వద్దకు చేరుకోవడం కనిపించింది. బంద్ ఉన్నప్పటికీ ప్రజా కదలికల్లో స్వల్పంగా కదలికి కనిపించింది.
ప్రశాంతంగా బంద్..
కన్నడ భాషకు సంబంధించిన వివిధ సంఘాలు బెంగళూర్ పోలీసుల ప్రకారం.. బంద్ శాంతియుతంగా, చాలావరకూ విజయవంతమైంది. 12 గంటల నిరసన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగలేదు.
అయితే ఈ సంఘటన కర్ణాటక, మహారాష్ట్ర మధ్య భాషా వివాదాన్ని మళ్లీ రేకెత్తించింది. భవిష్యత్ లో ఇటువంటి బంద్ లు ఇకముందు కొనసాగుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.