పులి బోనులో అటవీశాఖ సిబ్బంది..
కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా బొమ్మలపురంలో గ్రామస్థుల తీరు..;
పులి(Tiger)ని పట్టుకోవడంలో విఫలమైన అటవీ సిబ్బందిపై కోపం పెంచుకున్న గ్రామస్థులు చివరకు వారినే బోనులో బంధించారు. ఈ ఘటన కర్ణాటక(Karnataka)రాష్ట్రం చామరాజనగర్ జిల్లా, గుండ్లుపేట తాలూకా బొమ్మలపురంలో జరిగింది.
బొమ్మలపురం, చుట్టుపక్కల అటవీప్రాంత గ్రామస్థులకు పులులు బెడద వేధిస్తోంది. రాత్రి సమయాల్లో పొలం దగ్గర కాపలాకు వెళ్లడానికి వణికిపోతున్నారు. నెల రోజులుగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పులిని పట్టుకోవాలని అటవీ అధికారులను మొరపెట్టుకున్నారు గ్రామస్థులు. వారు వచ్చి పులి బోను ఏర్పాటు చేశారు. రోజులు గడిచిపోయాయి. పులి మాత్రం అక్కడికి రాలేదు. ఎప్పుడు పట్టుకుంటారని అడిగినప్పుడల్లా, ‘‘తొందరపడకండి.. వస్తుంది.. పట్టుకుంటాం..’’ అని చెప్పుకుంటా వచ్చారు అటవీ(Forest) అధికారులు. సహనం నశించిన గ్రామస్థులు ఓ రోజు గ్రామానికి వచ్చిన అటవీ సిబ్బందిని బోనులో బంధించారు. "మీరు పులిని పట్టుకోలేకపోతే, మీరే బోనులో ఉండండి" అంటూ బోనులో పెట్టి తాళం వేశారు.
విషయం ఉన్నతాధికారులు తెలిసి వెంటనే గుండ్లుపేట రేంజ్ ఏసీఎఫ్ సురేష్, బందీపూర్ రేంజ్ ఏసీఎఫ్ నవీన్ కుమార్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి శాంతింపజేశారు. కాసేపు అధికారులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. "మేము రోజు పులుల భయంతో చస్తున్నాం..మీరేమో నిర్లక్ష్యంగా వస్తుంది.. పట్టుకుంటాం.. అని చెబుతూ పోతున్నారు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్థులు.
చివరకు పులిని పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్లు వెంటనే ప్రారంభిస్తామని అటవీ అధికారులు గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు సిబ్బందిని వదిలిపెట్టారు.